Chinni Krishna: నన్ను క్షమించు అన్నయ్య.. దిగొచ్చిన చిన్నికృష్ణ

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:16 PM

రచయితగా 'ఇంద్ర’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చినా చిరంజీవి తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదని కొంతకాలం క్రితం  వ్యాఖ్యలు చేశారు రచయిత చిన్నికృష్ణ. అంతే కాదు చిరంజీవిని దుర్భాషలాడుతూ మాట్లాడారు.

Chinni Krishna: నన్ను క్షమించు అన్నయ్య.. దిగొచ్చిన చిన్నికృష్ణ


రచయితగా 'ఇంద్ర’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చినా చిరంజీవి తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదని కొంతకాలం క్రితం  వ్యాఖ్యలు చేశారు రచయిత చిన్నికృష్ణ. అంతే కాదు చిరంజీవిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. తాజాగా ఆయన ఓ వీడియో ద్వారా స్పందించారు. అన్నయ్య చిరంజీవిగారికి  దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

"అన్నయ్యకు పద్మవిభూషణ్‌ వచ్చిందని తెలిసి చాలా సంతోషించా. ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఈ భూమ్మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా ఇచ్చిన చిరంజీవిగారిని నాకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్న సమయంలో పేర్లు చెప్పను కానీ కొందరి ప్రభావం, ఒత్తిడి వల్ల అన్నయ్యపై పలు వ్యాఖ్యలు చేశాను. నోటికొచ్చినట్లు మాట్లాడాను. దాని వల్ల నా భార్య, బిడ్డలు, చెల్లి, బావ, సమాజం, నా మిత్రులు నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా భగవంతుడి ముందు, స్నేహితుల ముందు క్షమాపణ కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో అంతర్మధనం చెందాను. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవిగారికి ఎదుటపడలేదు. ఆయనకు పద్మ విభూషణ్‌ వచ్చిందని విష్‌ చేయడానికి ఇంటికివెళ్తే ఆయన నన్ను రిసీవ్‌ చేసుకున్న విధానం, నా భార్యబిడ్డలు, వారి బాగోగులు గురించి ఆడిగిన తీరు చూసి నాలో నేనే బాధ పడ్డాను.  'ఇలాంటి వ్యక్తినా నా నోటితో తప్పుగా మాట్లాడాను’ అని నా తప్పు తెల్సుకుని క్షమించమని అన్నయ్యను అడిగాను. పెద్ద మనసుతో క్షమించి, దగ్గరకు తీసుకుని కథలు ఏమన్నా రాస్తున్నావా చిన్ని? అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అన్నయ్య మనసారా మాట్లాడటమే కాకుండా 'కలిసి పని చేద్దాం.. మంచి కథ చూడు’ అన్నారు. ఈసారి ఆయనతో పని చేసే సినిమా దేశం గర్వించేలా ఉండాలని కోరుకుంటున్నా. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అన్నయ్య అని ప్రాధేయపడ్డాను.  మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు  సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నారు’’ అని వీడియోలో పేర్కొన్నారు. 


Updated Date - Feb 02 , 2024 | 10:08 AM