Ramoji Rao Death: తల వంచని మేరు పర్వతం దివికేగింది!

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:47 AM

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయంపై మెగాస్టార్‌ చిరంజీవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని ఆయన పేర్కొన్నారు.

Ramoji Rao Death: తల వంచని మేరు పర్వతం దివికేగింది!

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు (Ramojirao) అస్తమయంపై మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఓం శాంతి’ అంటూ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. అలాగే టాలీవుడ్‌కి చెందిన అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలు రామోజీరావుకి (RIP Ramojirao)సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. 


మకుటం లేని మహారాజు: బాలకృష్ణ (Balakrishna)

తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని  సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Pawann.jpg

బహుముఖ ప్రజ్ఞాశాలి: పవన్ కళ్యాణ్ 
"అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన అక్షర యోధుడు.  శ్రీ రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు. ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు గారి దక్షతను తెలియచేసింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారు. మీడియా మొఘల్ గా శ్రీ రామోజీరావు గారు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీ రావు గారు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. శ్రీ రామోజీరావు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని అన్నారు. 

Ntr.webp

నూటికో కోటికో ఒకరు: ఎన్టీఆర్‌
రామోజీ రావుగారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారు. మీడియా సామ్రాజ్యాధినేత మనియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్య లేరపూ వార్త చాలా బాధాకరం.  ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

"ఉత్తమ విలువలతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన అందరి శ్రేయోభిలాషి.రామోజీరావు గారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను"
- కె.రాఘవేంద్రరావు.

F_CT0fUbMAAKcgL.jpg


''ఏ రంగంలో అయినా, ఎలాంటి నేప‌థ్యం లేక‌పోయినా క‌ష్ట‌ప‌డితే చాలు.. విజ‌యం ద‌క్కుతుంది అనే స్ఫూర్తిని నాలాంటి ఎంతోమందికి పంచిపెట్టిన రామోజీరావు గారి జ‌న్మ ధ‌న్యం. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారి మ‌ర‌ణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీర‌ని లోటు.

- సి.అశ్వ‌నీద‌త్

Updated Date - Jun 08 , 2024 | 10:46 AM