Alluri Seetarama Raju: వెండితెరపై కృష్ణ చేసిన సాహసానికి నిదర్శనం 

ABN , Publish Date - May 01 , 2024 | 07:50 AM

సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి, దేశ మాత దాస్య శృంఖలాలను విడిపించడం కోసం  ప్రాణాలను లెక్కచేయని చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజు.

Alluri Seetarama Raju: వెండితెరపై కృష్ణ చేసిన సాహసానికి నిదర్శనం 

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama raju) చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి, దేశ మాత దాస్య శృంఖలాలను విడిపించడం కోసం  ప్రాణాలను లెక్కచేయని చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవిత కథ ఆధారంగా అల్లూరి చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. ఆయన లో సినిమా తీసి వ్యాపారం చేద్దాం అనే నిర్మాత  కంటే చిత్రం నిర్మించి సంచలనం సృష్టిద్దాం అనుకునే సాహసే ఎక్కువగా కనిపిస్తాడు. వెండితెరపై హీరో కృష్ణ చేసిన మరో సాహసం అల్లూరి సీతారామ రాజు చిత్రం.

ఏదో సాధించాలన్న ఆశ కొందరిని కొండ లెక్కిస్తుంది. కొన్నిసార్లు లోయలోకి నెడుతుంది. ‘దేవదాస్’ చిత్రం కృష్ణను ఎక్కడికి తీసుకువెళ్లినా, ‘అల్లూరి సీతారామరాజు’ మాత్రం హిమాలయాలను ఎక్కించింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆయన నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా హీరో కృష్ణ సాహసానికి నిదర్శనంగా నిలిచింది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించాలని కోరిక ఎన్టీఆర్‌కి ఉండేది. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలేతో చర్చించి గెటప్ స్కెచ్ తయారు చేయించారు కూడా. 1957 జనవరి 17న పాటల రికార్డింగ్‌తో విప్లవజ్యోతి ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అయితే అప్పటి నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు అడ్డంకులు వచ్చి ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడేది తను అనుకున్నది సాధించే మనస్తత్వం ఎన్టీఆర్‌ది అయితే ఈ చిత్ర నిర్మాణం మాత్రం ఎన్టీఆర్ ఆశయం నెరవేరలేదు.

Alluri-.jpg


‘అసాధ్యుడు’ చిత్రంలోని నాటికలో తొలిసారిగా తెరపై సీతారామరాజుగా కనిపించారు కృష్ణ. అయితే పూర్తిస్థాయిలో ఆ సినిమా తీయాలనే ఆయన ఆలోచన కార్యరూపం దాల్చడానికి సరిగ్గా ఎనిమిదేళ్లు ట్టింది. 1973లో ‘అల్లూరి సీతారామరాజు’ కథను కృష్ణ సినిమాగా తీస్తున్నారనే వార్త పరిశ్రమలో వైరల్ అయింది. ఆయన సాహసానికి పరిశ్రమ నివ్వెరపోయింది. ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్, మరోపక్క శోభన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకొని కూడా చేయలేకపోయారు. వారు చేయలేని పని కృష్ణ చేయగలడా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దానికి తిరుగు ఉండదు. దానిని అమలు చేసే వరకు ఆయన విశ్రమించరు. ఆయనకు తగిన వారే సోదరులు హనుమంతరావు ఆదిశేషగిరిరావు. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం అయ్యాక మా తదుపరి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అని కృష్ణ ఎనౌన్స్ చెయ్యగానే అలిగిన ఎన్టీఆర్ శతదినోత్సవానికి రాలేదు. ఒకరోజు ఎన్టీఆర్ కబురు చేస్తే కృష్ణ వెళ్లారు. బ్రదర్ ఇలాంటి సబ్జెక్ట్‌లు పే చెయ్యవు. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంతో సంపాదించిందంతా ఇందులో పోగొట్టుకుంటారు. నా మాట వినండి. మీకు మరో భారీ ప్రాజెక్టు చేయాలని కోరిక ఉంటే నాకు చెప్పండి. కాల్ షీట్లు ఇస్తాను. ‘కురుక్షేత్రం’ తీయండి. నేను కృష్ణునిగా నటిస్తాను. మీరు అర్జునుడుగా వెయ్యండి అని హితవు చెప్పారు ఎన్టీఆర్. వెంటనే కృష్ణ లేదు అన్న గారు.. మీకు కూడా ఆ సీతారామరాజు కథను సినిమాగా తీయాలని కోరిక చాలా రోజులుగా ఉంది కదా. మీరు వెంటనే తీస్తానంటే చెప్పండి. నేను సంతోషంగా డ్రాప్ అవుతా అని చెప్పి వచ్చేశారు .

Alluri-3.jpg

ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ముందుకు వెళ్లడానికి కృష్ణ నిర్ణయించుకున్నారు. ‘అల్లూరి సీతారామరాజు’ టైటిల్ ఇవ్వడానికి కూడా చాలా గొడవ జరిగింది. ఆ సమయంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా డివిఎస్ రాజు, సెక్రెటరీగా యు. విశ్వేశ్వరరావు ఉండేవారు. వారిద్దరూ ఎన్టీఆర్ మనుషులు కావడంతో టైటిల్‌కు అనుమతి ఇవ్వకుండా అప్లికేషన్‌ను పెండింగ్లో పెట్టారు. చివరకు హనుమంతరావు గొడవ చేయడంతో టైటిల్ వచ్చింది.

‘అల్లూరి సీతారామరాజు’ ఈ చిత్రంలో 40,50  పాత్రలున్నాయి. ప్రతి పాత్రకు పెద్ద ఆర్టిస్ట్‌ని తీసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, నాగభూషణం తప్ప ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరూ ఈ చిత్రంలో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నాలుగైదు సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సినిమాను హఠాత్తుగా మొదలు పెట్టకపోయినా పరిశ్రమలో ఉన్న ఆర్టిస్టులందరూ ఇందులో ఉండటంతో ఒకరకంగా పరిశ్రమ స్తంభించింది అని చెప్పాలి.

జగ్గయ్య, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్, బాలయ్య, పేకేటి త్యాగరాజు, మంజుల సహా చిన్నా పెద్దా అంతా కలిసి మూడు కంపార్ట్‌మెంట్స్‌లో షూటింగ్‌కు జట్టుగా బయలుదేరారు. షూటింగ్ జరిగే నెలరోజులు ఇంత మంది ఆర్టిస్టులు చింతపల్లిలోనే ఉండాలి కనుక వారి కోసం అక్కడ 12 డీలక్స్ కాటేజీలు కట్టించారు కృష్ణ. సాంకేతిక నిపుణులు ఉండటం కోసం పెద్ద డార్మెటరీ కట్టారు.
డిసెంబర్ నెల కావడంతో చింతపల్లిలో విపరీతమైన చలి ఉండేది. అయినా సరే అంతా తెల్లవారి లేచి షూటింగ్‌కు రెడీ అయ్యేవారు. చాలాసార్లు షూటింగ్ సూర్యోదయం చిత్రీకరణతోనే మొదలయ్యేది. రచయిత మహారధి ఏ రోజుకారోజు తెల్లవారుజామునే లేచి డైలాగులు రాసేవారు. జగ్గయ్య, మహారధి చాలాసార్లు షూటింగ్ అయిన తర్వాత రాత్రిపూట కాటేజ్‌లో కూర్చుని డైలాగ్స్ గురించి చర్చించేవారు. రూథర్ఫర్డ్ పాత్రలో రాక్షసత్వం లేదని కేవలం ఒక బ్రిటిష్ అధికారిగానే ఆయన వ్యవహరించాడని జగ్గయ్య అనేక ఉదాహరణలతో వివరించేవారు. రూథర్ఫర్డ్‌లో ఉన్న మంచితనాన్ని కూడా చూపించాలని మహారధితో చర్చించి ఆ విధంగానే మాటలు రాయించారు జగ్గయ్య. ఒకరకంగా ఆయనే రాశారు అనుకోవచ్చు.


alluari-2.jpg

ఈ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు రాంచంద్రరావు మరణించడంతో కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. యాక్షన్ సన్నివేశాలను కె.ఎస్.ఆర్.దాస్ చిత్రీకరించారు. 38 రోజుల పాటు చింతపల్లి, లోతుగడ్డ వసంపాడు, కృష్ణదేవిపేట బలిమెల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో 400 మంది పోలీసులు అవసరం కావడంతో నాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావుతో మాట్లాడి పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు కృష్ణ. చిత్ర నిర్మాణం పూర్తయింది. విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణికి ఈ సినిమా చూడాలనిపించి కృష్ణకి ఫోన్ చేశారు. కృష్ణ ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సినిమా అంతా చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నావు అని అడిగారు చక్రపాణి. 10 వరకు ఉంటాయని కృష్ణ చెప్పారు. సినిమా చాలా బాగుంది ఇంత చక్కని పాత్రలు నిన్ను చూసిన జనం రెండేళ్ల వరకు మరో పాత్రలో నిన్ను ఆమోదించరు అని చెప్పారు చక్రపాణి. చివరకు ఆయన వరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం తర్వాత కృష్ణకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తిరిగి ‘పాడిపంటలు’ చిత్రంతోనే ఆయన విజయాన్ని పొందగలిగారు.

Alluri-4.jpgఎన్నో సందేహాలు అనుమానాల మధ్య 1974 మే 1న ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం విడుదలైంది అన్నిచోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సీతారామరాజుగా చేసిన కృష్ణ‌కు జనం జేజేలు పలికారు. 19 కేంద్రాల్లో వంద రోజులు, రెండు కేంద్రాల్లో 25 వారాలు హైదరాబాద్‌లో సంవత్సరం ఈ సినిమా ఆడింది. 1975 మే 1న మద్రాసులోని వుడ్ ల్యాండ్ హోటల్‌లో జరిగిన స్వర్ణోత్సవానికి శోభన్ బాబు, హిందీ నటి హేమమాలిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

-వినాయకరావు

Updated Date - May 01 , 2024 | 12:55 PM