Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ కేసు.. ఈ రోజు నాంపల్లి కోర్టులో ఏమైందంటే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:06 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A 11, యాక్టర్ అల్లు అర్జున్ ని శుక్రవారం నాంపల్లి కోర్టు విచారించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A 11, యాక్టర్ అల్లు అర్జున్ ని శుక్రవారం నాంపల్లి కోర్టు విచారించింది. ఈ కేసులో కౌంటర్ ధాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరాగా.. తదుపరి విచారణ సోమవారంకు వాయిదా వేశారు. చిక్కడ పల్లి పోలీసులు సోమవారం కౌంటర్ ధాఖలు చేయనున్నారు. కాగా రిమాండ్ పొడిగింపుపై అల్లు అర్జున్ వర్చ్యువల్ విధానంలో హాజరు అయ్యారు. అసలు అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కోర్టులో వాదనలు వినిపించారు. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు.
కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే.