కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రసుగా మారిన సుహాస్

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:51 PM

సుహాస్ కథానాయకుడిగా నటించిన 'కలర్ ఫోటో' జాతీయ అవార్డు గెలుచుకుంది, 'రైటర్ పద్మభూషణ్' కి బాగా డబ్బులు వచ్చాయి, ఇప్పుడు మూడో సినిమా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫిబ్రవరి 2 న విడుదలవుతోంది. ఆసక్తికరం ఏంటంటే ఈ మూడు సినిమాలతో ముగ్గురు కొత్త దర్శకులు పరిచయం అయ్యారు, ఇంకో అరడజను సినిమాలు చేతిలో వున్నాయి, అవి కూడా కొత్త దర్శకులతోటే...

కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రసుగా మారిన సుహాస్
Suhas is eagerly waiting for his film Ambajipeta Marriage Band

దర్శకులు కావాలని పరిశ్రమకి ఎంతోమంది దర్శకులు వస్తూ వుంటారు, అందులో కొంతమందే విజయం సాధిస్తారు. ఎక్కువమంది అవలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి తగిన నటులు దొరకకపోవడం, కొంచెం పేరున్న నటులతో తీయాలని అనుకుంటూ ఆగిపోతూ వుండటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ కొత్త దర్శకులతో హిట్ తరువాత హిట్ ఇస్తున్న సుహాస్ లాంటి నటుడు ఇప్పుడు కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రసుగా మారిపోయాడు. 'మజిలీ' సినిమాలో నాగ చైతన్య స్నేహితుడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పించి ఒక కొత్త నటుడు తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు అని అందరిచేత శబాష్ అనిపించుకున్నాడు. సుహాస్ నటనే కాదు అతని గొంతు కూడా ప్రత్యేకంగా ఉంటుంది అని అందరూ ప్రశంసిస్తూ వుంటారు.

suhascolourphoto.jpg

'మజిలీ' తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా చాలా సినిమాలు చేసాడు సుహాస్. అలా చేస్తున్నప్పుడే కొత్త దర్శకుడు సందీప్ రాజ్ 'కలర్ ఫోటో' అనే సినిమాని సుహాస్ కథానాయకుడిగా సంకల్పించి చేసాడు. ఆ సినిమా థియేటర్స్ లో విడుదల కాలేదు, ఓటిటి లో విడుదలైంది, అక్కడ విజయం సాధించింది. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. సుహాస్ నటన, ప్రతిభని అందరూ మెచ్చుకున్నారు. ఆలా కథానాయకుడిగా మొదటి సినిమా విజయం సాధించటంతో కథానాయకుడిగా ఎక్కువ సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

క్యారెక్టర్ యాక్టర్ గా ఒప్పుకున్న కొన్ని సినిమాలు పూర్తి చేస్తూ ఇంకో కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ని పరిచయం చేస్తూ 'రైటర్ పద్మభూషణ్' అనే సినిమాలో కథానాయకుడిగా చేసాడు సుహాస్. ఈ సినిమాని ముందుగా కొన్ని పట్టణాల్లో ప్రీమియర్ షోలు వేసి ప్రేక్షకులు మెచ్చుకొని, బాగుంది అనే నోటి మాటతో ఒకరినుండి ఇంకొకరికి అలా వెళ్లి సినిమా విడుదలైనప్పుడు నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది ఈ 'రైటర్ పద్మనాభం'. "చిన్న సినిమాలకి ఇలాంటి ప్రీమియర్ షోలు వేసినప్పుడు, ప్రేక్షకులు బాగుంది అన్నప్పుడు అది సినిమా విజయానికి ఎంతో దోహదపడుతుంది" అని చెప్పాడు సుహాస్. చిన్న సినిమాలకి అదే ముఖ్యం అని కూడా అంటాడు.

suhaswriterpadmabhushan.jpg

ఇప్పుడు కథానాయకుడిగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి కూడా కొత్త దర్శకుడు దుష్యంత్ కొత్తవాడు అవటం ఆసక్తికరం. "నాకు ఒక సినిమా ఆడకపోయినా నేను క్యారెక్టర్ నటుడిగా పాత్రలు తెచ్చుకొని నా కెరీర్ కొనసాగిస్తాను. కానీ కొత్త దర్శకులకి ఆలా కాదు. అందుకని వాళ్ళు మొదటి సినిమాకి చాలా కష్టపడతారు, మంచి కథలు రాసుకుంటారు, నేను వాళ్ళ కష్టానికి తగిన విధంగా సాయపడతాను, అందుకని వాళ్ళకి విజయం వస్తే వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తారు," అని చెప్పాడు సుహాస్, కొత్తవాళ్లతో ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని అడిగితే.

ఇలా ముగ్గురి కొత్త దర్శకులతో సినిమాలు చెయ్యడమే కాకుండా, రానున్న చాలా సినిమాలకి ఎక్కువ కొత్త దర్శకులే అవటం విశేషం. ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా కథ దుశ్యంత్ ఎప్పుడో రాసుకున్నాడు, కానీ అతను అసోసియేట్ దర్శకుడిగా కొన్ని సినిమాలతో బిజీగా ఉండటంతో కొంచెం లేట్ గా మొదలెట్టాం అని చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 'రైటర్ పద్మభూషణ్' విడుదలైంది మంచి విజయం సాధించింది, ఈ ఫిబ్రవరిలో ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' విడుదలవుతోంది. సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పాడు సుహాస్.

suhassukumarwritings.jpg

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ అంబాజీపేట దగ్గర ఆ చుట్టుపకాల్లా చేసాము అని చెప్పాడు. నాకు స్నేహితులు ఎక్కువగా వున్నారు, కాబట్టి నాకు ఆ ప్రాంత యాస మాట్లాడటం పెద్దగా కష్టపడలేదు అని చెప్పాడు. సినిమా కథ గురించి చెపుతూ తాను, శరణ్య ఇద్దరం కవలపిల్లలు అని, పుట్టినరోజు నాడు ఒక అనుకోని సంఘటన జరిగి, దానివల్ల ఎటువంటి మార్పులు జరిగాయి అన్నది కథ అని చెప్పాడు సుహాస్. ఈ సినిమా కథకి కొన్ని యదార్ధ సంఘటనలుతో కూడిన కల్పిత కథగా చెప్పాడు. "దర్శకుడు దుశ్యంత్ కి నిజ జీవితంలో ఎదురైన అనుభవాలు, కొన్ని అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకొని తీసిన కథ. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు చాలా హై ఫీల్ అవుతారు," అని చెప్పాడు సుహాస్. ఈ సినిమాకి సంగీతం ఒక ముఖ్యమైన అంశమని అది శేఖర్ చంద్ర చాలా బాగా ఇచ్చారని చెప్పాడు సుహాస్. కథానాయకురాలి కూడా తెలుగమ్మాయిని చెప్పాడు.

suhasambajipeta.jpg

మధ్యలో క్యారెక్టర్ నటుడిగా కూడా కొన్ని పాత్రలు చేసాడు సుహాస్. 'హిట్ 2' లో విలన్ గా నటించిన సుహాస్ తాను అలాంటివి కూడా చాలా బాగా చేస్తాను అని ఆ సినిమాతో నిరూపించుకున్నాడు. "ఆ తరువాత వరసగా విలన్ పాత్రలు చెయ్యడానికి చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను కొన్ని సినిమాలకు చేసుకున్న ఒప్పదం వలన చెయ్యలేకపోయాను," అని చెప్పాడు.

ఇప్పుడు సుహాస్ చేతిలో ఒక అరడజను సినిమాలున్నాయి. అవన్నీ ఎక్కువగా కొత్త దర్శకులతో చేస్తున్నావే. కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రసుగా మారిపోయాడు సుహాస్. 'ప్రసన్న వదనం' అనే ఒక సినిమా పూర్తయింది, కొత్త దర్శకుడితో. అలాగే సుకుమార్ అసిస్టెంట్ ఒకతను దర్శకుడిగా మారి సుహాస్ తో 'కేబిల్ రెడ్డి' అనే సినిమా చేస్తున్నాడు, అది షూటింగ్ అవుతోంది. ఇంకోటి దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేసిన అతను ఒకరు దర్శకుడిగా మారి సుహాస్ తో చేస్తున్నాడు. ఇంకా అతను వొప్పుకున్నవి చాలా సినిమాలు వున్నాయి. ఇప్పుడు సుహాస్ వరస సినిమాలతో బిజీగా వున్నాడు.

suhasambajipetamarriageband.jpg

ఈమధ్య అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగిన రోజు అంటే జనవరి 22వ తేదీన సుహాస్ తండ్రయ్యాడు. కుమారుడు పుట్టాడు. "ఇంకా పేరు పెట్టలేదు, ఏమి పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను", అని చెప్పాడు. చేతినిండా పని, ఇంకో పక్క పుట్టిన కొడుకుతో సమయం కేటాయించాలని, రెండు వైపులా బాలన్స్ చేసుకొని తన పనికి ఆటకం రాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సుహాస్.

-- సురేష్ కవిరాయని

Updated Date - Jan 30 , 2024 | 03:51 PM