డిస్ట్రాక్షన్ ఉండకూడదనే అప్పుడు పెళ్లి చేసుకోలేదు: వరుణ్ తేజ్

ABN , Publish Date - Feb 27 , 2024 | 06:14 PM

వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మార్చి 1 న హిందీ, తెలుగులో విడుదలవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు, ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఒక వార్ సినిమా. ఈ సినిమా గురించి తను ఎటువంటి తర్ఫీదు పొందాడు, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఈ సినిమా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనే విషయాలు వరుణ్ తేజ్ పంచుకున్నారు.

డిస్ట్రాక్షన్ ఉండకూడదనే అప్పుడు పెళ్లి చేసుకోలేదు: వరుణ్ తేజ్
Varun Tej talks about his film Operation Valentine

వరుణ్ తేజ్ ఇంకో వైవిధ్యమైన సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'తో ప్రేక్షకుల ముందుకు మార్చి 1 న వస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంత ప్రీ ప్రొడక్షన్ చేసిందీ చెప్పుకొచ్చారు. సినిమా కథ 2020లో విన్నాను, కానీ ఈ సినిమాకి చాలా ప్రీ ప్రొడక్షన్ పని జరగాల్సి వుంది. అందుకే దర్శకుడు చాలా రీసెర్చ్ చెయ్యడమే కాకుండా, నేను కూడా ఈ సినిమా పాత్ర కోసమని ఎయిర్ ఫోర్స్ పైలట్ లతో చాలాసేపు గడిపాను.

Varun Tej

ఈ సినిమా టైటిల్ 'ఆపరేషన్ వాలెంటైన్' అని ఎందుకు పెట్టారు అన్నదానికి కూడా ఒక కారణం వుంది అని చెప్పారు. భారతదేశంలో 14 ఫిబ్రవరి, 2019 న టెర్రరిస్ట్ ఎటాక్ జరిగి 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు, ఆరోజు బ్లాక్ డే గా ప్రకటించారు. దానికి ప్రతిఫలంగా భారతదేశం పది పన్నెండు ఎయిర్ ఫోర్స్ విమానాలతో టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఎటాక్ చేసి వాటిని నాశనం చేశారు. వాలెంటైన్ అంటే అమ్మాయి, అబ్బాయి మీద ప్రేమ కాదు, దేశంమీద ప్రేమ అని చెప్పడం కోసం ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' అని పెట్టాము. దానికితోడు ఒరిజినల్ గా జరిగిన ఆపరేషన్ కి ఎటువంటి పేరు పెట్టారో అది మేము పెట్టకూడదు అన్నారు, అందుకని ఈ టైటిల్ పెట్టాం, ఇది అందరికీ ఆసక్తికరం కలిగిస్తోంది అని అర్థం అవుతోంది.

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారు. అందుకనే తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త కథ ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేశాను. ప్రతి సినిమా రిస్క్ తో కూడుకున్నదే, కానీ ఈ సినిమా ఒక ప్రత్యేకం ఎందుకంటే ఇది భారతీయ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఒక దేశభక్తి తో కూడిన సినిమా. దేశభక్తి అనేది ప్రతి భారతీయునిలో ఉండే ఒక భావోద్వేగం, అందుకనే ఈ సినిమా చెయ్యాలని అనుకున్నాను. దర్శకుడు హిందీ అబ్బాయి అయినా ఇది మొదట్లో తెలుగులోనే తీద్దామని అనుకున్నాం, కానీ సోనీ కంపెనీ వచ్చాక ఇది హిందీలో కూడా చెయ్యాలని అనుకున్నాం. నేను సోనీ కంపెనీ కి సినిమా చేసి పెట్టాలి, అలా ఈ సినిమాతో కూడా కుదిరింది.

Varun Tej

హిందీ, తెలుగు భాషల్లో సినిమా రెండు సార్లు ప్రతి సన్నివేశం చెయ్యడం చాలా కష్టంగా అనిపించింది. నేను హిందీలో ఒక మూడు నెలల పాటు క్లాసులు తీసుకున్నాను. ముంబై నుండి ఒక ట్యూటర్ వచ్చి నాకు సుమారు మూడు నెలలపాటు చెప్పారు. హిందీ వచ్చినా, మన హిందీకి అక్కడ హిందీకి చాలా తేడా ఉంటుంది. రెండు భాషల్లో చెయ్యడం ఎంత కష్టం అనేది షూటింగ్ మొదలైనప్పుడు తెలిసింది. మొదట నేను హిందీ సన్నివేశం చెప్పినప్పుడు హిందీ డైలాగ్స్ అన్నీ చదువుకొని ఆ సన్నివేశం చేసేసేవాడిని, కానీ మళ్ళీ అదే సన్నివేశం తెలుగులో చేసేసరికి నాకు మధ్యలో హిందీ డైలాగ్స్ వచ్చేసేవి. అలాగే తెలుగు సన్నివేశం చేసేటప్పుడు హిందీ డైలాగ్స్ వచ్చేసేవి మధ్యలో, ఇలా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజంగా ఇలా రెండు భాషల్లో రెండు సార్లు ఒకే సన్నివేశం షూటింగ్ చెయ్యడం కొంచెం కష్టమైన పనే అని చెప్పారు వరుణ్ తేజ్.

రుద్ర అనే పాత్ర ఒక కల్పిత పాత్ర. ఎయిర్ ఫోర్స్ పైలట్ పేర్లు సినిమాల్లో పెట్టకూడదు అని ఒక కల్పిత పాత్ర తీసుకోవాల్సి వచ్చింది. కానీ చాలామంది పైలట్స్ ని కలిసాను, వాళ్ళు ఎలా వుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే వాళ్ళు లైఫ్ గురించి మాట్లాడిన మాటలు వింటే మనకి కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి రోజు చావుని దగ్గరనుండి చూస్తూ వుంటారు, అలాగే యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసి అదే ఆఖరు రోజు కావచ్చని. అందుకనే వాళ్ళు ప్రతి రోజు ఎంజాయ్ చేస్తూ వుంటారు. మనం అనుకుంటున్నట్టు మిలటరీ అనగానే వాళ్ళకి కోపం ఉంటుంది, అందరూ వాళ్ళముందు క్రమశిక్షణతో వుంటారు ఇలా ఏవేవో వింటూ ఉంటాం. కానీ వాళ్ళు అలా వుండరు, వాళ్ళు ప్రతిదీ చాలా తేలికగా తీసుకుంటారు. మనం ఒకరు రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే చాలు, కోపంగా.. అతని మీద పక్కవాళ్ళమీద అరుస్తూ ఉంటాం. వాళ్ళతో కలిసి అవన్నీ చూసాక, విన్నాక, నాకు అనిపించింది నేను ఎన్నో సార్లు అనవసరంగా కోపంగా రియాక్ట్ అయ్యాను అని, అది ఇప్పుడు మానేశా.

Varun Tej

నేను ఏమి చేసానంటే ఈ డిస్ట్రాక్షన్ వుండకూడదు అని షూటింగ్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక సినిమా చేసేటప్పుడు ఎటువంటి అవరోధాలు వుండకూడదు అనుకున్నాను. అందుకనే నేను హాలిడే కి కూడా వెళ్ళలేదు. అందుకే ఇటువంటి సినిమా చేస్తున్నప్పుడు డిస్ట్రక్షన్ వుండకూడదు అనే పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాను. ముందు రెండు మూడు ముహుర్తాలు పెట్టినా, నేను సినిమా షూటింగ్ అయ్యాక చేసుకుందామని చెప్పాను. అందుకనే గత సంవత్సరం అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాను, ఆ తరువాత పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు వరుణ్ తేజ్.

మా పాత్రల నేపధ్యం కూడా చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ మధ్య ప్రేమ కంటే, వాళ్లిద్దరూ దేశాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ వుంటారు. ఈ కథలో నేను చేసే రుద్ర పాత్ర కానీ, నా భార్య రాడార్ ఆఫీసర్ పాత్ర కానీ రెండూ దేశభక్తి ప్రధాన పాత్రలే. ఏదైనా యుద్ధం వచ్చేటప్పుడు ముందుగా కదిలేది ఎయిర్ ఫోర్స్, తరువాతే మిగతా వాళ్ళు అందరూ బయలుదేరుతారు. అందుకనే ఎయిర్ ఫోర్స్ అంటే ప్రత్యేక అభిమానం, వాళ్ళకి ఎప్పుడూ మనం విధేయులుగా ఉండాలి. అటువంటి ప్రాముఖ్యం కలిగిన ఎయిర్ ఫోర్స్ నేపధ్యం వున్న ఈ కథని ప్రజలందరికి తెలియాలని ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాం.

ఐదడుగుల మూడంగుళాల ఆర్టిస్టు పోలీసాఫీసర్‌గా వేస్తే కామెడీగా ఉంటుంది అని నాగబాబు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అన్న మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అది కొంతమంది నటులను ఉద్దేశించి అన్న మాటలు అని వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు అన్నదానికి, వరుణ్ తేజ్ అది నాన్నగారు ఎవరినీ ఉద్దేశించి అన్నమాటలు కావు. నా గురించి చెబుతున్నప్పుడు నాన్న నోటిలోంచి వచ్చిన మాటలు అవి కానీ ఎవరినీ ఉద్దేశించి అన్న మాటలు అయితే కావు. నేను ఆరడుగుల 3 అంగుళాలు వుంటాను, నాన్న చెప్పిన ఆ ఐదడుగుల మూడంగుళాల నటుడు మన పరిశ్రమలో అయితే నాకు తెలిసి ఎవరూ లేరు. అదీ కాకుండా నాన్న మన మిలిటరీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి 25 నిముషాల సేపు చాలా గొప్పగా చెప్పారు, అవేమీ వినకుండా ఈ ఒక్క మాటే వైరల్ అవటం విచారకరం. అది ఎవరినీ ఉద్దేశించి నాన్న మాత్రం అనలేదని వివాదానికి ముగింపు పలికారు వరుణ్ తేజ్.

Varun Tej

చాలా తెలుగు సినిమాలు, పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నాయి కదా, మీ సినిమా కేవలం హిందీ, తెలుగు భాషాల్లో మాత్రమే విడుదల చేస్తున్నారు, ఎందుకు? అని అడిగితే, వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఎన్ని భాషల్లో విడుదల చేశాం అని కాదు, ఎంత బాగా విడుదల చేశామన్నది మాకు ముఖ్యం. మా బడ్జెట్ కి ఇంత అనుకున్నాం, దానికి సమానంగా మేము కూడా హిందీ, తెలుగులో విడుదల చేద్దామని అనుకున్నాం. ముందు తెలుగులోనే చేద్దాం అనుకున్నాం, కానీ సోనీ వచ్చాక హిందీలో కూడా చేస్తున్నాం. ఓటిటి లో విడుదలయ్యాక అన్ని భాషల వాళ్ళు చూస్తారు. ఇది లిమిటెడ్ బడ్జెట్ తో చాలా హై క్వాలిటీ తో తీసిన సినిమా. అత్యుత్తమ సాంకేతికత ఈ సినిమాలో కనబడుతుంది అని చెప్పారు వరుణ్ తేజ్.

Varun Tej

నాకు ఈ సినిమా ముందే వెబ్ సిరీస్ ఆఫర్స్ చాలా వచ్చాయి. వెబ్ సిరీస్ రాయటం కష్టం, సినిమా రాయటం కంటే వెబ్ సిరీస్ స్క్రిప్ట్ రాయటం కష్టం. అలాగే హిందీ సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఇటువంటి ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావటం చాలా సంతోషంగా వుంది. అలాగే హిందీ భాషలో వరుణ్ భార్య లావణ్య ఏమైనా సహాయం చేశారా అన్నప్పుడు వరుణ్ చెప్పిన సమాధానం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. నేను, లావణ్య ఒక మాట మాట్లాడితే అందులో మూడు భాషల పదాలు దొర్లుతాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషలు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం.

-- సురేష్ కవిరాయని

Updated Date - Feb 27 , 2024 | 06:32 PM