Trisha: త్రిషకి మద్దతు, వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకుడిని బిచ్చం ఎత్తుకోమన్న విశాల్
ABN , Publish Date - Feb 21 , 2024 | 09:26 AM
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇంకా సమసిపోకముందే, ఈసారి తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు మళ్ళీ త్రిషనే టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలని నటుడు విశాల్ తప్పుబట్టడమే కాకుండా, ఆ రాజకీయనాయకుడిని తీవ్ర పదజాలంతో ఖండించారు
![Trisha: త్రిషకి మద్దతు, వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకుడిని బిచ్చం ఎత్తుకోమన్న విశాల్](https://media.chitrajyothy.com/media/2024/20240215/trishavishal_aefbeb92c2.jpg)
ఆమధ్య మన్సూర్ అలీ ఖాన్ అనే నటుడు దక్షిణాదిన అగ్ర నటీమణుల్లో ఒకరైన త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు తమిళ, తెలుగు పరిశ్రమలకి చెందిన అనేకమంది చిరంజీవితో సహా, నటి త్రిషకి తమ మద్దతు తెలిపి, మన్సూర్ వ్యాఖ్యలని ఖండించటమే కాకుండా, అతన్ని బేషరతుగా త్రిషకి క్షమాపణ చెప్పమని అడిగారు. ఈసారి తమిళ నాడు కి చెందిన ఒక రాజకీయ నాయకుడు త్రిషపై మళ్ళీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈసారి తమిళ పరిశ్రమకి చెందిన అనేకమంది నటీనటులు త్రిషకి తమ మద్దతు తెలపడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళ నటీనటుల సంఘం కార్యదర్శిగా వున్న విశాల్ ఆ వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడు ఏ వి రాజు పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు అని చెపుతూ అతని వ్యాఖ్యలు ఖండించారు. "ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక స్టుపిడ్, ఇడియట్ మన సినిమా పరిశ్రమకి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా, అసభ్యకరంగా మాట్లాడాడని నేను విన్నాను. నాకు తెలుసు, ఇది కేవలం మీ ప్రచారానికి మీరు చేసారని, అందుకనే నేను మీ పేరు కానీ మీరు ఎవరినైతే అన్నారో ఆమె పేరు కానీ ఇక్కడ ప్రస్తావించను," అని చెప్పి అతని వ్యాఖ్యల్ని ఖండించారు.
నటీనటుల సంఘం కార్యదర్శిగా కాకుండా ఒక మనిషిగా ఈ ప్రకటన చేస్తున్నాను అని తీవ్ర పదజాలంతో ఆ రాజకీయనాయకుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను కందించారు విశాల్. సెలబ్రిటీల మీద తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి డబ్బు సంపాదించటం ఇప్పుడు చాలామందికి అలవాటైపోయింది. మంచి జాబ్ చూసుకో, సంపాదించుకో, బిచ్చగాడిగా ముందు మొదలెట్టు, ఎందుకంటే అప్పుడైనా నీకు కొంచెం క్రమశిక్షణ అలవాటవుతుంది అని విశాల్ తీవ్రస్థాయిలో ఆ రాజకీయనాయకుడిపై విరుచుకు పడ్డారు.