Lizzie Antony: ఛాలెంజింగ్ పాత్రల్లో మెప్పిస్తోన్న లిజీ ఆంటోని
ABN , Publish Date - Feb 01 , 2024 | 10:26 AM
ఇటీవల తమిళ చిత్రపరిశ్రమలో భారీ విజయాలను సాధించిన చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన నటి లిజీ ఆంటోని వరుస హిట్లతో ప్రశంసలు అందుకుంటూ, చాలెంజింగ్ పాత్రల్లో మెప్పిస్తున్నారు.
ఇటీవల తమిళ చిత్రపరిశ్రమలో భారీ విజయాలను సాధించిన చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన నటి లిజీ ఆంటోని (Lizzie Antony) వరుస హిట్లతో ప్రశంసలు అందుకుంటూ, చాలెంజింగ్ పాత్రల్లో మెప్పిస్తున్నారు. కోలివుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ఆమె.. తను పోషించే ప్రతి పాత్రలో సహజత్వం ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ‘బ్లూస్టార్’ లోనూ తల్లిపాత్రలో మెప్పించారు.
రామ్ దర్శకత్వం వహించిన ‘తంగ మీన్‌గళ్’ (Thanga Meenkal) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన లిజీ.. తన మొదటి చిత్రంలోనే మంచి పేరుతో పాటు గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ‘తరమణి’, ‘పరియేరుం పెరుమాళ్’ చిత్రాల్లో లిజీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఓటీటీలో విడుదలైన ‘రాంగీ’ చిత్రం ఆమె నటనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.
పలువురు నటీమణులు నటించేందుకు వెనుకంజ వేసే చాలెంజ్‌తో కూడిన పాత్రలను సైతం ఆమె నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ‘రైటర్’, ‘సానికాయితం’, ‘నక్షత్రం నగర్‌గిరదు’, ‘గట్టాకుస్తీ’ వంటి వరుస హిట్ చిత్రాల్లో లిజీ నటించి, తమిళ సినిమాలోని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.