Khushbu Sundar: ఇంత దిగజారుతారనుకోలేదు
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:51 PM
నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్ ఎలా రికార్డు చేస్తారు? మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఏముందంటే..
తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్‌లో చెప్పిన మాటలు వాస్తవమేనని, అయినప్పటికీ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం సరికాదన్నారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ ఇటీవల ఓ స్థానిక మీడియా సంస్థ ఫోన్ కాల్‌లో ఆమెను సంప్రదించగా.. ఆమె తమిళనాడు బీజేపీ తనను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ ఆడియో రికార్డును సదరు మీడియా సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. దీనిపై తాజాగా ఖుష్బూ స్పందించారు.
Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..
‘‘నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్ ఎలా రికార్డు చేస్తారు? మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. కానీ, నేను నిజమే చెప్పా. బీజేపీ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించరు. కానీ, నేనేమీ పార్టీ మారడం లేదు. అలాగే అందులో ఉన్న వాయిస్ నాది కాదని కూడా నేను చెప్పడం లేదు. కాకపోతే వాయిస్ రికార్డ్ చేసే ముందు నా అనుమతి తీసుకోవాలి. అలా ఎందుకు చేయలేదు. ఇది కరెక్ట్ కాదు. జర్నలిజం విలువలు పక్కన పెట్టేశారా? ఇక్కడి జర్నలిస్ట్ అందరితో నాకు మంచి పరిచయం ఉంది. కానీ ఇది నేను ఊహించని విషయం. ఒక చనిపోయిన చేప చాలు.. కొలను మొత్తం కలుషితం చేయడానికి..’’ అంటూ ఖుష్బూ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.