Anupama Parameswaran: విక్రమ్ కుమారుడితో అనుపమ, ఈసారి తమిళ సినిమా

ABN , Publish Date - Mar 13 , 2024 | 11:28 AM

మంచి విజయం కోసం చూస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఆశలన్నీ ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' పైనే వున్నాయి. ఈ సినిమా ఈనెలాఖరుకు విడుదలవుతున్న నేపథ్యంలో, అనుపమ ఇప్పుడు ఒక తమిళ సినిమా ఒప్పుకుంది.

Anupama Parameswaran: విక్రమ్ కుమారుడితో అనుపమ, ఈసారి తమిళ సినిమా
Dhruv Vikram and Anupama Parameswaran

మలయాళం సినిమా 'ప్రేమం'తో పరిచయం అయిన మలయాళం నటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ. ఆ..' సినిమాతో పరిచయమై తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తరువాత అటు తమిళం, మలయాళం లోనూ కూడా సినిమాలు చేస్తూ, దక్షిణాదిలో బిజీ గా ఉంటూ వస్తోంది. మధ్యలో కొన్ని విజయవంతమైన సినిమాలు వచ్చినా, అనుపమకి మాత్రం అంత పెద్దగా ఏ సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఈమధ్యనే విడుదలైన 'ఈగల్' సినిమాలో కూడా అనుపమ ఒక ముఖ్య పాత్ర చేసినా, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు.

anupamatamil.jpg

ఇప్పుడు అనుపమ ఆశలన్నీ 'టిల్లు స్క్వేర్' సినిమాపైనే వున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ కొంచెం గ్లామర్ పాత్రలో కనిపించనుందని ఆ చిత్ర ప్రచార వీడియోలు, పాటల వీడియోలు చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే బాగా వైరల్ అవటం ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలవటానికి సిద్ధం అవటం, ఈ సినిమా అనుపమ కెరీర్ లో ఒక కీలకమైన సినిమా అవటం ఆసక్తికరం.

Anupama Parameswaran

ఇదిలా ఉండగా అనుపమ ఇప్పుడు ఒక తమిళ సినిమా ఒప్పుకుంది. ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కథానాయకుడిగా, మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో ఒక సినిమా మొదలైంది. ఈ సినిమాలో ధృవ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది.

Anupama Parameswaran

ఆమె తమిళ సినిమా 'సైరెన్' గత నెలలో విడుదలైంది కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం మాత్రం చూపలేదు అనే చెప్పాలి. 2022 లో వచ్చిన 'కార్తికేయ 2' తరువాత అనుపమ పరమేశ్వరన్ కి ఏ భాషలోనూ బ్రేక్ రాలేదు. అయినా అటు తమిళ్, తెలుగు, మలయాళంలో చిన్న చిన్న సినిమాలు మాత్రం చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం 'టిల్లు స్క్వేర్' పైనే ఆశలు అన్నీ పెట్టుకున్నట్టు కనపడుతోంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ లో మార్పు వచ్చే అవకాశం వుంది అని పరిశ్రమలో అంటున్నారు.

Updated Date - Mar 13 , 2024 | 11:33 AM