Rajinikanth: నా కూతురు అలా చెప్పాక.. కథ వినకూడదు అనుకున్నా! 

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:21 AM

"లాల్‌ సలామ్‌ చాలా బలమైన కథ ఇది. ఇలాంటి సినిమా తీయడానికి ఎక్కువ శాతం నిర్మాతలు నిరాకరిస్తారు. ‘రజనీకాంతే ఈ సినిమాని ఎందుకు నిర్మించకూడదని కూడా చాలామంది అనుకునే ఉంటారు. 'బాబా’ చిత్రం తర్వాత నిర్మాతగా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నా.

Rajinikanth: నా కూతురు అలా చెప్పాక.. కథ వినకూడదు అనుకున్నా! 

"లాల్‌ సలామ్‌ (lal Salaam)చాలా బలమైన కథ ఇది. ఇలాంటి సినిమా తీయడానికి ఎక్కువ శాతం నిర్మాతలు నిరాకరిస్తారు. ‘రజనీకాంతే (Rajinikanth) ఈ సినిమాని ఎందుకు నిర్మించకూడదని కూడా చాలామంది అనుకునే ఉంటారు. 'బాబా’ (Baba)చిత్రం తర్వాత నిర్మాతగా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నా. అది అందరికి తెలిసిందే. ఆ నిర్ణయం నా కూతురు విషయంలోనూ వర్తిస్తుంది’’ అని సూపర్‌స్టార్‌ రజినీకాంత్  అన్నారు. ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం 'లాల్‌ సలామ్‌’. ఇందులో ఆయన మొయిద్దీన్‌ భాయ్‌గా అలరించనున్నారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం  చెన్నైలో జరిగింది. ఈ వేదికగా రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని నిర్మించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. 

"నా కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) ప్రతిభ ఏంటో నాకు తెలుసు. అందుకే ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నందుకు నేను ఆశ్చర్యపోలేదు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కన్నా ముందు చాలామంది నిర్మాతలను కలిసి ఐశ్వర్య ఈ కథ గురించి చర్చించింది. ఈ సినిమా తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. ‘రజనీకాంతే ఎందుకు ప్రొడ్యూస్‌ చేయకూడదు?’ అని అనుకుని ఉంటారు. ‘బాబా’ చిత్రం తర్వాత నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. నా కూతురు విషయంలోనూ అదే రూల్‌ ఉంది. అందుకే కొంత మంది నిర్మాతల పేర్లు ఆమెకు సూచించాను. వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథను వినేందుకు గంట సమయం కావాలని ఐశ్వర్య నన్ను అడగడంతో కాదనలేకపోయా. ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకుంటుందంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది. వెంటనే నేను వినకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే అవార్డుల కోసమే సినిమాలు చేయకూడదు. అలాగని నేను వాటికి వ్యతిరేకిని కాదు. ఆర్థికంగా కూడా మంచి ప్రతిఫలం ఉండాలనుకున్నాను’’ అని అన్నారు. 

కొంత గ్యాప్‌ తర్వాత ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రమిది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. 


Updated Date - Feb 06 , 2024 | 12:02 PM