Mohan Lal: వయసు వ్యత్యాసం ముఖ్యం కాదు..

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:16 PM

మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించిన ‘బరోజ్‌ త్రీడీ’ (barroj 3D)  చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి ఆయన మాట్లాడారు

మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించిన ‘బరోజ్‌ త్రీడీ’ (barroj 3D)  చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి ఆయన మాట్లాడారు. ‘‘ఒక కథకు ఎవరు సరిపోతారనేది నటులు వయసు కంటే వారి నటన ఆధారంగా ఎంచుకుంటారు. హీరోహీరోయిన్స్‌ మధ్య ఏజ్‌గ్యాప్‌ ఎక్కువగా ఉండడం ఇప్పటి విషయం కాదు. అది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో అలాగే ఉంది. తమిళ, తెలుగు.. ఇలా ఏ భాషలోనైనా ఇది సహజం. నటనకు వయసుతో సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ల వయసులోనూ నటించవచ్చు. ఎలాంటి పాత్రలు ఎంచుకుంటున్నామనేది మన చేతిలోనే ఉంటుంది. అసౌకర్యంగా అనిపించే అవకాశాలను తిరస్కరించడంలో  తప్పు లేదు. నేను ఏ విషయంలోనూ ముందస్తు ప్రణాళిక వేసుకోను’’ అని అన్నారు. బరోజ్‌ త్రీడీ సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితం కావడం గురించి మోహన్‌లాల్‌ మాట్లాడారు.

"అన్ని సినిమాలు కేవలం డబ్బు కోసమే తీయరని స్పష్టం చేశారు. ‘‘ఇందులో ఎంతో మంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఇదొక విభిన్న ప్రయత్నం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాం. మేము త్రీడీలో మాత్రమే విడుదల చేశాం. 2డీ కూడా విడుదల చేయాలని ఎంతో మంది కోరారు. ప్రజలకు సినిమాటిక్‌ అనుభూతి ఇవ్వాలంటే కొన్ని సినిమాలను త్రీడీలోనే విడుదల చేయాలి. దీన్ని డబ్బు కోసం తీయలేదు. 47 సంవత్సరాల నుంచి ప్రేక్షకులు నాకు అందించిన ప్రేమకు బహుమతిగా దీన్ని రూపొందించా. ఇది వారికి నేను ఇచ్చిన కానుక. పిల్లల కోసం తెరకెక్కించాను. కుటుంబ సమేతంగా వచ్చి ఆదరిస్తున్నారు’’ అని అన్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ‘తుడరమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా శోభన కనిపించనున్నారు. 1987 తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తరుణ్‌మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో మోహన్‌లాల్‌ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 02:16 PM