Yash: 'జై హనుమాన్' లో హనుమంతుడిగా 'కేజీఎఫ్' నటుడు

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:47 PM

'కేజీఎఫ్' నటుడు యష్ ప్రశాంత్ వర్మ తీయబోయే సీక్వెల్ 'జై హనుమాన్' లో హనుమంతుడి పాత్ర వేస్తున్నారని ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Yash: 'జై హనుమాన్' లో హనుమంతుడిగా 'కేజీఎఫ్' నటుడు
Yash

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' సినిమా సంక్రాంతికి విడుదలైన ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర తన తడాఖా చూపిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయడంఖా మోగిస్తోంది. ఇందులో తేజ సజ్జ కథానాయకుడిగా నటించాడు, హనుమంతుని భక్తునిగా కనపడతాడు. అమృత అయ్యర్ కథానాయకురాలిగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యపాత్ర పోషించారు.

ఈ సినిమా ఇప్పటికే ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు కలెక్టు చేసిన సినిమాగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. అలాగే ఈ సినిమా 300 సెంటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుంది, ఇంకా విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్' వస్తుంది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎవరు హనుమంతుని పాత్ర వేస్తున్నారు అనే విషయమై అనేక పేర్లు వైరల్ అవుతున్నాయి.

yashashanuman.jpg

ప్రస్తుతం హనుమంతుని పాత్రకి కన్నడ సూపర్ స్టార్, 'కేజీఎఫ్' నటుడు యష్ పేరు వినిపిస్తోంది. 'జై హనుమాన్' సినిమాలో యష్ హనుమంతుడుగా నటిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే యష్ తన 'జై హనుమాన్' లో హనుమంతుడి పాత్ర వేస్తే ఆ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుందని, యష్ కూడా కరెక్టుగా హనుమంతుని పాత్రకి సరిపోతారని అంటున్నారు. 'జై హనుమాన్' బడ్జెట్ కూడా చాలా పెద్దగా ఉంటుందని అంటున్నారు. ఇందులో రాముడు పాత్రకి గాను రామ్ చరణ్ ని ఇప్పటికే లుక్ టెస్ట్ చేసారని ఇంకో వార్త కూడా వైరల్ అవుతోంది.

ఏమైనా 'జై హనుమాన్' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది, షూటింగ్ ఇంకా మొదలెట్టలేదు, కానీ సినిమా గురించి అప్పుడే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనటంలో అయితే సందేహం లేదు.

Updated Date - Feb 13 , 2024 | 03:48 PM