AR Rahman: చనిపోయిన సింగర్ల గాత్రం మళ్లీ.. రెహమాన్   సరికొత్త ప్రయోగం! 

ABN , Publish Date - Feb 05 , 2024 | 03:56 PM

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తారు. తన సంగీతంతో సినీ ప్రియులను మెస్మరైజ్‌ చేస్తారు. ఆయన కెరీర్‌లో సంగీతంతో చేసిన ప్రయోగాలెన్నో. తాజాగా రజనీకాంత్‌ కీలక పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం మరో ప్రయోగం చేశారు.

AR Rahman: చనిపోయిన సింగర్ల గాత్రం మళ్లీ.. రెహమాన్   సరికొత్త ప్రయోగం! 

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తారు. తన సంగీతంతో సినీ ప్రియులను మెస్మరైజ్‌ చేస్తారు. ఆయన కెరీర్‌లో సంగీతంతో చేసిన ప్రయోగాలెన్నో. తాజాగా రజనీకాంత్‌ కీలక పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం మరో ప్రయోగం చేశారు. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దివంగత గాయకులు బంబా బక్యా(Bamba Bakya), షాహుల్‌ హమీద్‌(Shahul Hameed) లతో పాట పాడించారు. లాల్‌ సలామ్‌ విడుదల నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.  

బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల  గొంతులు చాలా ప్రత్యేకమైనవి. ప్రతిభావంతులైన గాయకులు. బక్యా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో ‘పొన్ని నది’, రజనీకాంత్‌ ‘రోబో 2.0’లో ‘కాలమే కాలమే’ ఇలా ఎన్నో పాటలు పాడారు. హమీద్‌ ‘జీన్స్‌’, ‘కాదలన్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలకు గాత్రాన్ని అందించారు. దురదృష్టవశాత్తు ఇద్దరూ చిన్నవయసులోనే చనిపోయారు. వారిపై ఉన్న అభిమానంతోనే.. వారి స్వరాలను ‘తిమిరి ఎళుడా..’ అనే  పాటతో ఏఐ ద్వారా వినిపించేందుకు సిద్థమయ్యాను. ఇలా చేయడం సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి. 

కుటుంబ సభ్యుల అనుమతితో... 

లాల్‌ సలాం కోసం బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల వాయిస్‌ ఏఐ ద్వారా వినిపించాలి అనుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులను కలిసి పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ల గొంతు మళ్లీ సినిమాలో వినపడుతుందని తెలియగానే ఇరు కుటుంబాల వారు సంబరపడిపోయారు. ఆ ఇద్దరి గాత్రాలు వారి కుటుంబ ఆస్తుల్లాంటివి. ఆ ఆస్తులను సినిమా కోసం వాడుతున్నామంటే అనుమతి తప్పనిసరిగా కావాలి. వాళ్లు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే తగిన పారితోషికం ఇచ్చి ముందుకెళ్లాం. 

అలా ఈ ఆలోచన పుట్టింది...

కొత్త టెక్నాలజీతో పాత ట్రాక్‌లను రీ క్రియేట్‌ చేయడం ఇప్పుడు సాధారణం. అందుకు చాలా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని  చూశాక  సరదాగా అనిపించి ఇలాంటి ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే అమలులో పెడుతున్నా. మేం వాణిజ్యపరంగా చేస్తుండటంతో.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అనుమతులు, పరిహారాలు, పారితోషికం విషయంలో న్యాయబద్ధమైన పద్ధతిని అనుసరిస్తున్నాం. అయితే కొత్త టెక్నాలజీని వినియోగించే ముందు దానికి వంద శాతం న్యాయం చేయగలననే నమ్మకం కుదిరినప్పుడే ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఏమాత్రం తేడా అయినా అది బెడిసి కొడుతుంది. చనిపోయిన వారి గాత్రాన్ని ఏఐ ద్వారా తీసుకు రావాలనే నా ఆలోచన దర్శకురాలు ఐశ్వర్యతో ముందు చెప్పా. ఆమె చాలా ఆనందించి  ఈ ప్రయోగం కూడా చిత్ర విజయంలో తప్పకుండా భాగమవుతుందని నమ్మారు. 

ఎస్‌పీబీ వాయిస్‌ అడుగుతున్నారు...

కొత్త టెక్నాలజీని వాడటం అంటే జిమ్మిక్కు కాదు. కానీ అది సరైన పద్ధతిలో, అవసరమైన అనుమతులతో చేయాలి. ఈ ప్రపంచంలో ఏఐ అనేది  ఒక మీట లాంటిది. అవసరానికి ఎంతో ఉపయోగపడుతోంది. కొన్నిసార్లు అదే సమస్యను తీసుకొస్తుంది. ఇప్పుడు దాని సహాయంతో గతంలో ఎన్నో పాటలను, నాకు సహకరించిన నా స్నేహితుల స్వరాలను తిరిగి వినిపిస్తుండడం ఆనందంగా ఉంది. ఈ విషయం తెలియగానే ఇప్పుడు చాలామంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గొంతును రీ క్రియేట్‌ చేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం దానిపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నా.


Updated Date - Feb 05 , 2024 | 03:58 PM