Vettaiyan Ott: ఓటీటీకి వచ్చేసిన.. రజనీ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ‘వేట్టయాన్’
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:11 AM
జైలర్ వంటి సూపర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వేట్టయాన్ ది హంటర్ నెల రోజుల తర్వాత ఇప్పుడుఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
'జైలర్' వంటి సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా.. జై భీమ్ వంటి చిత్రంతో జాతీయ అవార్డు సైతం అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (TJ Gnanavel) దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేసన్ క్రైమ్ థ్రిల్లర్ వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan). రజనీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఢిఫరెంట్ పాత్రలో నటించగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఫాహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి ( Rana Daggubati), రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ వంటి పేరున్న నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. భారీ నిర్మాణ సంస్థ లైకా (Lyca Productions) నిర్మించింది. ఆక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని రెండు రాష్ట్రాల్లోనూ మంచి విజయం సాధించింది. ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రామింగ్‌కు వచ్చేసి ప్రేక్షకులను అలరిస్తోంది.
అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అవతలి వారెవరైనా తప్పు చేశారని తేలితే ఎన్‌కౌంటర్ పక్కా. మరోవైపు చిన్న పిల్లలకు చదువు ముఖ్యమని పేద విద్యార్ధులకు అండగా ఉండే టీచర్ శరణ్య తన స్కూల్ ప్రాంగణంలో గంజాయి మాఫియా ఉందని తెలుసుకుని అదియన్‌కు లేఖ రాయగా వెటనే ఆసమస్య పరిష్కారమౌతుంది. ఆపై తను కోరుకున్న విధంగానే చెన్నైకి బదిలీపై వెళ్లి ఎస్పీ అశీస్సులు తీసుకుని కొత్త పాఠశాలలో చేరుతుంది. అనుకోకుండా ఒకరోజు ఓ అగంతకుడు శరణ్యను కిరాతకంగా మానభంగం చేసి చంపుతారు. శరణ్య చావుకి కారణం ఎవరు? నాట్స్ ఇనిస్టిట్యూట్‌కి శరణ్య మరణానికి ఉన్న సంబంధం ఏంటి. ఈ కేసులో గుణ అనే ఇంజినీరింగ్ స్టూడెంట్ ఎందుకు ఎన్‌కౌంటర్ చేయబడ్డాడు. దానిపై న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్ Amitab bachchan)) నేతృత్వంలో విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు. అదియన్ జీవితంలో, శరణ్య మర్డర్ కేసులో బ్యాటరీ అలియాస్ ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా ) ఏసీపీ రూప కిరణ్ పాత్రలు ఏంటి? అన్యాయంగా మరణించిన శరణ్య, గుణలకు న్యాయం జరిగిందా లేదా అన్నది మిగతా కథ. (Vettaiyan The Hunter OTT)
మానవ హక్కులను కాపాడాలి, నిందుతులకు ఎన్‌కౌంటర్ సరైన మార్గం కాదు, ప్రతి నిందితుడి వెనుక రెండో కోణం ఉంటుంది దాన్ని గుర్తించి అసలు నిందితుడికి శిక్ష ఉండాలన్న అంశం చుట్టూ తిరిగే పోలీస్ స్టోరీ ఇది. సినిమా ట్రైలర్‌లో యాక్షన్ ఆకట్టుకున్నా సాధారణంగా సాగే పోలీస్ స్టోరీ అనే భావించారు. అయితే కథ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వైపు మళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా శరణ్య మర్దర్ కేస్ ప్రథమార్థంలో ఓ తీరుగా సాగి ఇంట్రెస్ట్ తెప్పించినా.. సంథింగ్ ఏదో జరిగింది.. ఇంకా జరుగుతుందనే ఫీల్ ఇస్తుంది. తిరిగి ఇంటర్వెల్ తర్వాత అదే కేసు మరో కోణంలో రన్ అవుతూ ఆ మర్డర్ వెనుక పెద్ద కథ, చదువుతో వ్యాపారం చేసే తిమింగలాలు, ప్రస్తుతం స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నారు? విద్య పేరుతో తాము చేస్తున్న వ్యాపారానికి అడ్డొస్తే ఏం చేస్తున్నారు? అనేది మెయిన్ థీమ్ అని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన విధానంతో దర్శకుడు కాస్త ఆసక్తి కలిగించారు. అయితే మూవీ తర్వాత జరగబోతుందో ఊహించేలా ఉండడం మైనస్. కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా పోలికలు ఉన్నాయి. ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీ (OTT) దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, రజనీకాంత్ అభిమానులు ఇప్పుడు ఇంటి పట్టునే ఉండే ఈ వేట్టయాన్ ది హంటర్ సినిమాను తిలకించండి.