Guntur Kaaram: ఇది కదా మహేష్ బాబు స్టామినా అంటే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:15 AM

మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది, అయితే ఇక్కడ ఈ సినిమా ఇప్పుడు మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

Guntur Kaaram: ఇది కదా మహేష్ బాబు స్టామినా అంటే!
A still from Guntur Kaaram

సంక్రాంతి పండగ నాడు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి కొంతమంది నెగటివ్ ప్రచారాలు చేసినా, చివరికి చాలా ఏరియాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకి హైలైట్ మహేష్ బాబు నటన అని, అతనే ఒంటి చేత్తో ఈ సినిమాని ముందుకు నడిపించారని అతని అభిమానులు ఈ సినిమాని ఒకటికి రెండు సార్లు చూసి ఎంతో సంతోషం పడిన మాట కూడా వాస్తవమే.

ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ కూడా మహేష్ బాబు తన స్టామినా ఏంటో చూపించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఇప్పుడు నంబర్ 1 గా ట్రేండింగ్ అవుతోంది. ఇదేదో ఒక్క తెలుగు లేదా ఇండియా అని కాదు, మొత్తం గ్లోబల్ గా ఈ సినిమా మొదటి స్థానంలో ట్రేండింగ్ అవుతూ ఉండటం విశేషం.

maheshbabugunturkaaram.jpg

ఈ సినిమా విడుదలైనప్పుడు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కుటుంబ ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చడంతో ఈ సినిమా మీద ఎటువంటి నెగటివ్ ప్రచారం చేసినా, తట్టుకొని నిలబడింది. అందుకే ఇప్పుడు ఓటిటి లో కూడా ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. మహేష్ బాబు సినిమాలు థియేటర్స్ లో ఎంత విజయం సాధించినా, బుల్లితెర మీద అంతకు రెట్టింపు విజయం సాధిస్తూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం మహేష్ బాబు మాత్రమే అని చెప్పాల్సి వస్తుంది.

ఇందులో మహేష్ బాబు పాత్ర పేరు రమణ, అలాగే అతనికి జోడీ అమ్ములుగా శ్రీలీల వేసింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, అలాగే రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా నటించడం, ఆమెకి మహేష్ కి మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రేక్షకులకి బాగా నచ్చాయని అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇలాంటి చిన్న చిన్న బిట్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వున్నాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ సినిమా టీవీలో ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం.

Updated Date - Feb 13 , 2024 | 11:15 AM