NTR: అప్పట్లోనే తెలుగు సినిమా చైనాలో ప్రభంజనం సృష్టించింది, ఏ సినిమా అంటే...

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:21 PM

పాన్ ఇండియా సినిమా ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు, కానీ ఎన్నో దశాబ్దాల కిందటే తెలుగు సినిమా పాన్ ఇండియాగా విడుదలైంది. అలాగే చైనాలో కూడా దశాబ్దాల కిందటే తెలుగు సినిమా విడుదలైంది, విజయం సాధించింది.

NTR: అప్పట్లోనే తెలుగు సినిమా చైనాలో ప్రభంజనం సృష్టించింది, ఏ సినిమా అంటే...
NTR and Bhanumathi

ఇప్పుడు తెలుగు సినిమాలు జపాన్ లోనూ, చైనాలోనూ విడుదలవుతున్నాయి, అది చాల గొప్పగా చెప్పుకుంటున్నారు కూడా. కానీ ఇలా చైనాలో సినిమాలు విడుదలవడం అందులోకి తెలుగు సినిమా విడుదలవడం ఇప్పుడు కొత్తగా ఉందేమో కానీ, అది పాతదే. 1950వ దశకంలోనే తెలుగు సినిమా చైనాలో విడుదలైంది. అలాగే అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా తెలుగు సినిమాని ప్రదర్శించారు. ఇవన్నీ ఎప్పుడో జరిగాయి. తరువాత తరువాత ఆధునిక కాలంలో తెలుగు సినిమా వ్యాపారాత్మకమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, నిర్మాతలు, దర్శకులు అటువైపు దృష్టి మరల్చకపోవటం వలన ఎక్కువ విడుదల కాలేదు. ఇప్పుడు పాన్ ఇండియా అంటూ తెలుగు సినిమాలు అన్ని దేశాల్లోనూ విడుదల చేస్తున్నారు.

ntrbhanumathi.jpg

ఇంతకీ చైనాలో విడుదలైన తెలుగు సినిమా ఎదో తెలుసా? ఎన్టీఆర్, భానుమతి నటించిన 'మల్లీశ్వరి' సినిమా. దీనికి బి ఎన్ రెడ్డి దర్శకుడు, నిర్మాత. ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ప్రేమ సినిమా. ఎన్ టి రామారావు నాగరాజు పాత్రలో, భానుమతి మల్లీశ్వరి పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా పోషించారు. కృష్ణదేవరాయలు గా శ్రీవత్స వేస్తె, న్యాపతి రాఘవరావు అల్లసాని పెద్దన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో ఒక చక్కని సినిమాగా నిలిచిపోయింది. బి ఎన్ రెడ్డి సృష్టించిన ఒక అపూర్వ కళాఖండం ఈ 'మల్లీశ్వరి' సినిమా. 1951, డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలైంది, మొదటి మూడు నాలుగు రోజులు ఈ సినిమా పెద్దగా నడవలేదు, కానీ తరువాత ఆ నోటా ఈ నోటా ఈ సినిమా గురించి తెలిసి, వ్యాపారాత్మకంగా విజయం సాధించి, గొప్ప సినిమాగా ప్రజాదరణ పొందింది. ఈ సినిమాని రెండోసారి విడుదల చేసినప్పుడు, మొదటిసారికన్నా ఎక్కువ విజయం సాధించింది.

ntrbhanumathimalliswari.jpg

1952 లో పెకింగ్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రదర్శించారు. ఇది మొదటి తెలుగు సినిమా,ఆ అలాగే చైనాలో కూడా విడుదల చేసిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది ఈ 'మల్లీశ్వరి'. మార్చి 14, 1953 లో చైనాలో డబ్బింగ్ చేసి విడుదలచేసిన మొదటి తెలుగు సినిమా ఇది. ఎన్నో దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు, అప్పుడు ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దాం అనుకున్నారు కానీ, బడ్జెట్ ప్రొబ్లెమ్స్ వలన చేయలేకపోయారు. తన కెరీర్ లో 'మల్లీశ్వరి' చిత్రం తన బెస్ట్ అని చెప్పుకున్నారు దర్శకుడు బిఎన్ రెడ్డి. ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇందులో పాటలు అప్పుడే కాదు ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి. ఒక్కో సన్నివేశం చూస్తుంటే ఒక కళాఖండం, పెయింటింగ్ చూస్తున్నట్టుగా ఉంటుంది. అంతగా ఈ సినిమా ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసింది.

Updated Date - Jan 23 , 2024 | 12:21 PM