ఎన్టీఆర్ మొట్టమొదట రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదు, తెలుసా!

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:18 PM

భారతీయ సినిమా చరిత్రలో పౌరాణిక పాత్రలంటే ఒక్క ఎన్టీఆర్ పేరు తప్ప వేరే నటులు గుర్తుకురారు. కృష్ణుడు, రాముడు కాకుండా ఎన్నో పౌరాణిక పాత్రలు రామారావు వేస్తే ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అలంటి ఎన్టీఆర్ మొట్టమొదటి సారి రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదని మీకు తెలుసా ! అయితే ఇది చదవండి

ఎన్టీఆర్ మొట్టమొదట రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదు, తెలుసా!
First time NTR played as Lord Rama role in a film

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాముడు, కృష్ణుడు లాంటి దైవ పాత్రలు వేయాలంటే ఒక్క ఎన్.టి. రామారావు తప్పితే మరెవరూ చెయ్యలేరన్న పేరు వుంది. రాముడన్నా, కృష్ణుడు అన్నా రామారావునే తప్ప వేరే నటుల్ని ఊహించలేము. 1957లో వచ్చిన 'మాయాబజార్' సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడు పాత్రలో నిజంగానే కృష్ణుడు అవతరించాడా అనిపించే విధంగా ఒక దైవాంశ సంభూతునిగా అగుపిస్తారు. ఆ సినిమా తెలుగు చలన చిత్ర సీమలో ఒక మకుటాయమానం, మణిహారం, ఈరోజుకి ఆ సినిమా భారతదేశ సినిమా చరిత్రలోనే అగ్రస్థానంలో వుండే సినిమాగా చెపుతారు.

ఆ సినిమాలో ఎన్టీఆర్ వేసిన కృష్ణుడి పాత్రలో ఒక గుడి కూడా కట్టేశారు అంటే ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఎంత వుందో అర్థం అవుతోంది కదా. అటువంటి ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి పేరు గడించారు. తెలుగులో పౌరాణికం అంటేనే ఎన్టీఆర్ అనేట్టుగా పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు.

ntrasLordRama.jpg

అయితే కృష్ణుడిగా కనపడిన ఎన్టీఆర్ తరువాత ఎన్నో చిత్రాల్లో కృష్ణుడుగా నటించారు. అవన్నీ ఎంతో విజయం సాధించాయి. కానీ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా రాముడిగా ఏ సినిమాలో వేశారో తెలుసా? అందరూ అనుకుంటున్నట్టుగా 'లవకుశ' లో వేశారు అని అనుకుంటారు కానీ కాదు. రాముడిగా మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఒక తమిళ సినిమాలో వేశారు. 'సంపూర్ణ రామాయణం' అనే తమిళ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు, తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ భరతుడిగా అదే సినిమాలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో అప్పటి లేడీ సూపర్ స్టార్ పద్మిని సీతగా ఆ సినిమాలో కనిపిస్తారు. ఇది 1958లో విడుదలైంది

ntrlavakusa.jpg

ఆలా మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ రాముడిగా వేసినది తమిళ సినిమాలో. ఇది తెలుగులో కూడా అనువాదం అయింది కానీ, ఎన్టీఆర్ కి వేరేవాళ్లు గొంతు ఇచ్చారు. ఎందుకంటే ఇది అనువాద సినిమాగా విడుదలైంది. ఆ తరువాత ఎన్టీఆర్ 'లవకుశ' సినిమాలో రాముడి పాత్రతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. ఆ సినిమా ఒక చరిత్ర సృష్టించిన సినిమా. అప్పట్లో ఆ సినిమా సంవత్సరాలపాటు ఆడింది అని చెపుతూ వుంటారు.

Updated Date - Apr 17 , 2024 | 01:39 PM