Sandhya Theatre Stampede: వెంటిలేటర్ లేకుండానే.. శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:41 PM
‘పుష్ప 2’ ప్రీమియర్ షో కారణంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ఏంటంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి.. దాదాపు రెండు వారాలుగా కోమాలో ఉన్న శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని ఈ హెల్త్ బులిటెన్‌లో డాక్టర్స్ తెలిపారు. శుక్రవారం కంటే శనివారం అతని ఆరోగ్యం మెరుగైందని, కాకపోతే.. అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, అవసరమైన డాక్టర్స్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఈ బులిటెన్‌లో తెలిపారు.
ఇంతకు ముందు కిమ్స్ హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆ బాలుడి పరిస్థితి విషయంగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నాడని, ఫీవర్ పెరుగుతుందని చెప్పిన వైద్యులు.. బాలుడి మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని తెలిపారు. ఇంకా అపస్మారక స్థితిలోనే బాలుడు ఉన్నాడని తెలిపారు. ట్యూబ్ ద్వారా ఆహారం పంపిస్తున్నామని తెలిపిన వైద్యులు.. పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ రోజు వచ్చిన బులిటెన్‌లో బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లుగా డాక్టర్స్ పేర్కొన్నారు.
అసలు జరిగింది ఇదే..
తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. దీనిపై అల్లు అర్జున్‌పై కేసు నమోదవ్వగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఈ విషయంపై శనివారం తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా చర్చలు నడిచాయి.