తెలుగు నేర్చుకుంటున్న జాన్వీ కపూర్... తల్లి, కుమార్తె ఇద్దరూ ఎన్టీఆర్‌తో...

ABN , Publish Date - Feb 23 , 2024 | 05:26 PM

తల్లి శ్రీదేవి ఎన్ టి రామారావు తో తెలుగు సినిమాలు చేస్తే, కుమార్తె జాన్వీ అదే ఎన్ టి రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగు సినిమా ఆరంగేట్రం చెయ్యడం ఆసక్తికర విషయం

తెలుగు నేర్చుకుంటున్న జాన్వీ కపూర్... తల్లి, కుమార్తె ఇద్దరూ ఎన్టీఆర్‌తో...
Sridevi with NTR, Janhvi Kapoor still from her debut Telugu film 'Devara'

దివంగత శ్రీదేవి దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్రనటీమణిగా ఎన్నో ఏళ్ళు ఏలింది. తరువాత హిందీ పరిశ్రమలో కూడా నంబర్ వన్ గా కొనసాగిన శ్రీదేవి తనదైన మార్కు భారతీయ సినిమా పరిశ్రమపై వేసింది. ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది. ముందుగా హిందీలో కొన్ని సినిమాలు చేసిన జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'దేవర' లో చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. (Janhvi Kapoor is now learning Telugu language)

filmfarejanhvikapoor.jpg

ఈ సినిమా విడుదల కాకముందే జాన్వీ కపూర్ ఇంకో పెద్ద సినిమా ఒప్పుకుంది. ఇంకో అగ్ర నటుడైన రామ్ చరణ్ పక్కన, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండూ కాకుండా, తమిళ నటుడు సూర్య పక్కన కూడా ఒక సినిమా చేస్తోంది. ఇలా సినిమాలేవీ విడుదలకాకుండానే దక్షిణాదిలో అగ్రస్థానంలోకి తొందరగా వెళ్లే ప్రయత్నంలో వుంది జాన్వీ కపూర్. దక్షిణాదిని కాకుండా కరన్ జోహార్ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్ లో వరుణ్ ధావన్ తో ఒక సినిమా 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి' ప్రకటించారు. (Sridevi starts her Telugu career with NTR and now her daughter Janhvi is making her debut with NTR's grandson Jr NTR)

అయితే తెలుగు సినిమాల గురించి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడని జాన్వీ కపూర్ మొదటిసారిగా తన ఆరంగేట్రం గురించి పెదవి విప్పింది. ఎన్టీఆర్ తో 'దేవర' సినిమా చేస్తున్నందుకు, ఆ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఆమె తన మూలాలకు దగ్గరగా వస్తున్నట్టుగా చెప్పింది. అంటే ఆమె తల్లి శ్రీదేవి దక్షిణాదికి చెందినామె కావటం, శ్రీదేవి తెలుగు సినిమాలు ఎక్కువ చెయ్యడం, ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఆరంగేట్రం చెయ్యడం అంటే, తల్లి ఎక్కడ మొదలెట్టిందో, తాను కూడా అక్కడ సినిమా చెయ్యడం బాగుంది అని చెప్పింది.

janhvikapoor-devara1.jpg

ఇప్పుడు వరసగా తెలుగులో అవకాశాలు వస్తుండటంతో తాను తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పింది జాన్వీ కపూర్. ఆసక్తికరం ఏంటంటే, జాన్వీ తల్లి శ్రీదేవి, అప్పట్లో ఎన్ టి రామారావు పక్కన చేసి పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జాన్వీ.. ఎన్ టి రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఇక హిందీతో పాటు తెలుగులో కూడా జాన్వీ దృష్టి పెట్టింది అని చెబుతోంది.

Updated Date - Feb 23 , 2024 | 05:33 PM