అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఏం రేవంత్ రెడ్డి స్పందనిదే..
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:53 PM
‘‘రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా రూ. 15 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే.. ఆదివారం 15 మంది వచ్చాం.. ఈసారి 1500 మందితో వస్తాం’’ అంటూ ఓయూ జేఏసీ పేరిట కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ..
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ పేరిట కొందరు విద్యార్థులు వెళ్లి దాడి చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
Also Read- Allu Aravind: ఇంటిపై దాడి.. అల్లు అరవింద్ ఏమన్నారంటే..
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు వెళ్లి రేవతి మృతికి సినీ నటుడు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇంటి ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొట్టడంతో పాటు, ఇంటిపైకి టమోటాలు, రాళ్లు విసిరారు. అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఆందోళనకారులని అరెస్ట్ చేశారు. ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘‘మరో వైపు ఆందోళనకారులను అరెస్ట్ చేసినా.. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందేనంటూ అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా రూ. 15 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే.. ఆదివారం 15 మంది వచ్చాం.. ఈసారి 1500 మందితో వస్తాం..’’ అంటూ జేఏసీ నేతలు హెచ్చరిక చేశారు.
అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు:
అల్లు అర్జున్ ఇంటివద్ద ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. దాడిలో పాల్గొన్నది ఎవరనే విషయంపై ఆరా తీశారు. ఈ ఘటనపై అల్లు అరవింద్ సైతం స్పందించారు. ఇంటి వద్ద జరిగిన ఘటనను అందరూ చూశారని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని అల్లు అరవింద్ తెలిపారు. ఇటువంటి దాడులు ఎవరూ చేయవద్దని, ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే తాము సంయమనం పాటిస్తున్నామని.. దయచేసి అంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.