Avantika Vandanapu: హాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న‌ తెలుగమ్మాయి! అప్పుడు వీడియోతో.. ఇప్పుడు ట్రైల‌ర్‌తో

ABN , Publish Date - Feb 06 , 2024 | 06:06 PM

మ‌న తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు గురించి ఈ మ‌ధ్య చాలా వార్తలు చూసి, చ‌దివి, వినే ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ న‌టించిన హాలీవుడ్ హ‌ర్ర‌ర్ చిత్రం ట్రైల‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంటోంది.

Avantika Vandanapu: హాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న‌ తెలుగమ్మాయి! అప్పుడు వీడియోతో.. ఇప్పుడు ట్రైల‌ర్‌తో
avanthika vandanapu

మ‌న తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu) గురించి ఈ మ‌ధ్య చాలా వార్తలు చూసి, చ‌దివి, వినే ఉంటారు. అమెరికాలో పుట్టి పెరిగిన అవంతిక త‌న చిన్న‌త‌నం, వేస‌వి సెల‌వులన్నింటినీ హైద‌రాబాద్‌లోని తన అమ్మమ్మ‌, నాన‌మ్మల కుటుంబాల మ‌ధ్యే గ‌డిపింది. ఈ క్ర‌మంలో డ్యాన్స్ నేర్చుకోవ‌డంతో పాటు మ‌హేశ్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం, రారండోయ్ వేడుక చూద్దాం, ప్రేమమ్, మ‌న‌మంతా, ఆక్సిజ‌న్, అజ్ఞాతవాసి వంటి ఓ నాలుగైదు భారీ సినిమాల్లో టాప్ స్టార్ల‌తో.. అంతేగాక ఓ ప్ర‌ముఖ‌ ఆయిల్ కంపెనీ బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. 2016 నుంచి 2020 వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న అవంతిక 2021 త‌ర్వాత తెలుగు తెర‌కు పూర్తిగా దూర‌మైంది.

avanthika.jpg

స‌డ‌న్‌గా ఈమ‌ధ్య త‌ను న‌టించిన హాలీవుడ్ చిత్రం మీన్ గ‌ర్ల్స్ (Mean Girls ) 2 నుంచి అవంతిక (Avantika Vandanapu) పాత్ర‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, ఓ డ్యాన్స్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ముద్దుగుమ్మ ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చి సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఆ వీడియోలు, ఆమె ఫొటోల‌ను చూసి నోరెళ్ల‌బెట్టిన జ‌నం ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఇంత మార్పా, ఇందులో ఉన్న‌ది అస‌లు అవంతికేనా అంటూ ఇప్ప‌టికీ చాలామంది న‌మ్మ‌లేని విధంగా ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు.


అయితే గ‌త నెల‌లో విడుద‌లైన మీన్‌గ‌ర్ల్స్ 2 హాలీవుడ్‌లో మంచి విజ‌యం సాధించ‌గా అవంతిక న‌టించిన మరో చిత్రం టారో (Tarot) ట్రైల‌ర్ ( Trailer) ఈ మ‌ధ్య విడుద‌లై ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ తీసుకున్న‌ది. సూప‌ర్ నాచుర‌ల్ హ‌ర్ర‌ర్ (Super natural Horror) జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు స్పెన్సర్ కోహెన్ మరియు అన్నా హాల్బర్గ్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా స్క్రీన్ జెమ్స్ (ScreenGems) నిర్మించ‌గా సోని పిక్చ‌ర్స్ విడుద‌ల చేస్తోంది.

87252916.jpg

హ్యారియెట్ స్లేటర్ (Harriet Slater), అడైన్ బ్రాడ్లీ (Adain Bradley), అవంతిక (Avantika Vandanapu), జాకబ్ బాటలోన్ (Jacob Batalon) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొద‌ట హోరోస్కోప్ అనే పేరుతో ఈ సినిమా రూపొంద‌గా ఇటీవ‌ల‌ టారోగా పేరు మార్చి ముందు చెప్పిన స‌మ‌యంలో జూన్ 28న‌ కాకుండా.. ప్రీ పోన్ చేసి మే 10న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌డమే కాక బాగా ఆక‌ట్టుకుంటోంది.

avantika-vandanapu-v0-s6tuv9k83gdc1.jpg

క‌థ విష‌యానికి వ‌స్తే.. కొంత‌మంది ఫ్రెండ్స్ టారో కార్డ్స్ ఆట ఆడుతుంటారు. అందులో భాగంగా ఆ కార్డు మీద క‌నిపించే బొమ్మ‌లు, రాసి ఉన్నది చ‌దివి వారికిచ్చిన‌ స‌మ‌యంలో నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌కుండా దాని వెన‌కాల ర‌హాస్యాన్ని క‌నిపెట్టి దెయ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆ స్నేహితులు ఆ ర‌హ‌స్యాల‌ను క‌నిపెట్టారా, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ్డారా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో గూస్‌బంప్స్ తెప్పించే స‌న్నివేశాల‌తో రూపొందించారు. ఇక మ‌న తెలుగ‌మ్మాయి అవంతిక (Avantika Vandanapu) ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌డంతో మ‌న తెలుగు నాట కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Updated Date - Feb 06 , 2024 | 07:11 PM