Saindhav: వెంకటేష్, శైలేష్ కొలను సినిమా ఆ హాలీవుడ్ సినిమాకి కాపీనా?

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:00 PM

ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక ప్రేక్షకులు వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు చూస్తూ వుంటారు. ఒక్కోసారి ఇది పలానా సినిమాలా వుందే అనికూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ‘సైంధవ్’ ట్రైలర్ చూసాక, ఇలాంటి సినిమానే నెట్ ఫ్లిక్స్ లో ఒకటి చూశామా అన్నట్టుగా వుంది. మరి ఆ ఇంగ్లీష్ సినిమా, ఈ తెలుగు ‘సైంధవ్’ ఒక్కటే అవునా కదా అనే విషయం సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

Saindhav: వెంకటేష్, శైలేష్ కొలను సినిమా ఆ హాలీవుడ్ సినిమాకి కాపీనా?
Saindhav

సీనియర్ నటుడు వెంకటేష్ (Venkatesh Daggubati) తన 75 వ చిత్రం ‘సైంధవ్’ #Saindhav ఒక యాక్షన్ నేపధ్యం వున్న కథతో వస్తున్నారు. దీనికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడు, అతను ఇంతకు ముందు 'హిట్', 'హిట్ 2' అనే రెండు పరిశోధనాత్మక సినిమాలు తీశారు. ‘సైంధవ్’ సంక్రాంతికి అంటే జనవరి 13 న విడుదలకి సిద్ధంగా ఉంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో సినిమా కథని దర్శకుడు చెప్పేసాడు అనే చెప్పాలి. అందులో ఒక పాపకి ఆమె తండ్రే హీరో, తండ్రి దగ్గర ఉంటే భయం ఉండదు. అలాంటి పాప ఒకసారి డ్యాన్స్ చేస్తూ పడిపోతుంది, చూస్తే ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ఒక అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అయితే ఆ పాపకి వచ్చే వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ధర రూ. 17 కోట్లు, మరి అతను అంత డబ్బు పెట్టి ఆ మందును కొనగలడా? అందుకని అతను తన పాత స్నేహితులను, ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ అతని గతం ఏమిటి? ఈ సినిమాలో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాణి శర్మ ల పాత్రలు ఏంటి ఇవన్నీ ట్రైలర్ లో చూపించారు.

venkatesh-saindhav2.jpg

ఇది తండ్రి కూతుళ్ళ మధ్య జరిగే ఒక అనుబంధం, పాప సినిమాకి ముఖ్యం. తండ్రి తన కుమార్తె కోసం ఏమి చెయ్యాలన్న, అవసరం అయితే హింసాత్మక మార్గంలో అయినా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. దాని పేరు 'స్వీట్ గర్ల్', దీన్ని బ్రెయిన్ ఆండ్రూ (Brian Andrew Mendoza) దర్శకత్వం వహించారు. ఇందులో జాసన్ మెమోయ (Jason Momoa) కథానాయకుడిగా నటిస్తే, అతని కూతురిగా ఇసాబెలా (Isabela Merced) నటించింది. ఇందులో కథానాయకుడి భార్యకి కాన్సర్ వస్తుంది, ఆ జబ్బు నయం అవటం కోసం ఒక మందు ఉంటుంది, ఆ మందు ఇస్తే ఆమె బతుకుతుంది. కానీ ఆ మందుని మార్కెట్ లోకి రాకుండా చెయ్యడానికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రయత్నం చేస్తుంది. తెలుగు సినిమా ‘సైంధవ్’ ట్రైలర్ లో చూపించినట్టుగా, ఆ ఇంగ్లీష్ సినిమాలో కూడా ఆ మందు బయటకి రాకుండా అడ్డుపడే ఒక మాఫియా, రాజకీయ నేపధ్యం వుండి, కథానాయకుడి భార్యకి అందదు, ఆమె చనిపోతుంది. ఆ మందు బయటకి రాకుండా, డబ్బుకోసం వ్యవస్థలో కొంతమంది అవినీతిపరులు ఎలా ఆ మందుని ఆయుధంలా వాడుకుంటారు, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే నేపథ్యంలో జరిగే ఒక ప్రతీకార కథ అది. ఆ సినిమాలో కూడా చాలా పాత్రలు ఉంటాయి, ఒక పోలీసాఫీసర్, ఒక జర్నలిస్ట్, సెనెటర్ ఇంకా ఇలా ఎన్నో పాత్రలుంటాయి. అయితే అందులో కుమార్తె తన తల్లిదండ్రుల చావుకు బాధ్యులైన సమాజంలోని కొంతమంది పెద్దమనుషులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది ఆ సినిమా కథ.

sweetgirl.jpg

తెలుగు ‘సైంధవ్’ ట్రైలర్ లో కూడా చాలా పాత్రలున్నాయి. అక్కడ భార్యకి ఆ జబ్బు వస్తే, అదే నేపథ్యంలో ఇక్కడ కుమార్తెకి జబ్బు వస్తుంది, కొంచెం అటు ఇటు తెలుగు నేటివిటీ కోసం మార్చినట్టు కనపడుతోంది. కానీ ఆ సినిమాకి, ఈ ‘సైంధవ్’ సినిమా ట్రైలర్ ని చూస్తే మాత్రం రెండు కథలు ఇంచుమించు ఒకే నేపధ్యలో ఉన్నట్టు కనపడతాయి. మరి దర్శకుడు ఆ ఇంగ్లీష్ సినిమా 'స్వీట్ గర్ల్' నుంచి స్ఫూర్తి పొందారో, లేక అదే కథని కొంచెం అటు ఇటు మార్చి తీశారో ‘సైంధవ్’ సినిమా విడుదలయ్యాక గానీ చెప్పలేము. అయితే ఆ ఇంగ్లీష్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 2021లో స్ట్రీమింగ్ అయింది, ఇంకా వుంది. ఆ సినిమాని ఇప్పుడు అందరూ చూడొచ్చు, కథా నేపధ్యం అయితే ఒకేలా వుంది, మరి దీనికి దర్శకుడు శైలేష్ కొలను ఏమంటారో చూడాలి.

Updated Date - Jan 04 , 2024 | 05:00 PM