Game Changer: రామ్ చరణ్, శంకర్ 'గేమ్ చేంజర్' ఆలస్యానికి కారణమిదే...

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:32 PM

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అనడానికి కారణం ఇదే అని అంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ కారణాలు అంటే...

Game Changer: రామ్ చరణ్, శంకర్ 'గేమ్ చేంజర్' ఆలస్యానికి కారణమిదే...
Ram Charan, Shankar and Dil Raju

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా ప్రస్తుతం షూటింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. కియారా అద్వానీ, అంజలి కథానాయకురాలుగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నా, ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా క్లారిటీ మాత్రం రాలేదు. ఒక పక్క రామ్ చరణ్ అభిమానులు, ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలని సామజిక మాధ్యమాల్లో దర్శకుడు శంకర్ ని, నిర్మాత రాజుని టేగ్ చేస్తూ వైరల్ చేస్తూ వుంటారు. కానీ ఈ సినిమా గురించి ఏదైనా సమాచారం ఇవ్వడానికి, ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పటి నుండి ప్రచారాలు చేస్తారు అనే విషయం మాత్రం ఏప్రిల్ లో తెలుస్తుంది అని అంటున్నారు.

ఇంతకీ ఈ సినిమా ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, ఎందుకు నిర్మాత, దర్శకుడు ఈ సినిమా మీద ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు అని కొంచెం లోతుగా వెళితే తెలిసిన విషయాలు ఆసక్తికరంగా వున్నాయి. ఈ సినిమాలో చాలా కాంబినేషన్ నటులు వున్నారు. మలయాళం నటుడు జయరాం, తమిళ నటులు ఎస్.జె సూర్య, సముద్రఖని, నాజర్, తెలుగు నటులు సునీల్, నవీన్ చంద్ర ఇంకా శ్రీకాంత్ ఇలా చాలామంది నటులు వున్నారు.

gamechanger3.jpg

ఇప్పుడు దర్శక నిర్మాతలకి ఈ నటులందరి డేట్స్ కావాలంటే చాలా కష్టంగా ఉండటం ఒక కారణం అని చెపుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన, వీళ్లందరి కాంబినేషన్ దొరకటం చాలా కష్టంగా వుంది అని చెపుతున్నారు. ఇదిలా ఉంటే నటుడు శ్రీకాంత్ ఇంకో పెద్ద సినిమా 'దేవర'లో కూడా చేస్తున్నారు. ఆ సినిమాలో పాత్ర కోసమని శ్రీకాంత్ గెడ్డం బాగా పెంచారు, అదే 'గేమ్ చెంజర్' సినిమాకి వచ్చేసరికి అతనికి గెడ్డం లేకుండా కనపడాలి. కానీ అతను గెడ్డం ఇప్పుడిప్పుడే తీయడానికి అవదు అని అంటున్నారు అని తెలిసింది. ఇంకో నటుడు సునీల్ చాలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా వున్నాడు. అతని తేదీలు కూడా దొరకడం కష్టంగానే వుంది, అలాగే ఎస్ జె సూర్య కూడా. ఇలా అందరి డేట్స్ కుదరటం కష్టంగా ఉంటే, దొరికినవాళ్లతో దర్శకుడు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీస్తూనే వున్నారు అని కూడా తెలుస్తోంది.

రామ్ చరణ్ తో వున్న సన్నివేశాలని ఏప్రిల్ లోగా పూర్తి చెయ్యడానికి శంకర్ ఆలోచిస్తున్నారని, ఎందుకంటే రామ్ చరణ్ తదుపరి సినిమా బుచ్చిబాబు తో ఉంటుంది, ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని కూడా అప్పుడే మొదలైపోయింది. అందుకని 'గేమ్ చెంజర్' సినిమా ఎప్పుడు విడుదల అనేది నిర్మాతకి, దర్శకుడికి క్లారిటీ వచ్చేది మార్చి నెల అయిపోయిన తరువాత మాత్రమే అని అంటున్నారు. 'గేమ్ చెంజర్' ఆలస్యానికి ఎవరినీ నిందించాల్సిన పని కూడా లేదు అని, ఎందుకంటే ఈ సినిమాలో అంతమంది నటీనటులు వున్నారని, వాళ్ళందరి డేట్స్ తీసుకొని, కాంబినేషన్ సన్నివేశాలు చెయ్యాలని, అదీ కాకుండా ఆ నటులందరూ ఈ సినిమాకి కీలకమని కూడా అంటున్నారు.

అందువలన ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం కానీ ఇప్పుడిప్పుడే దొరకడం కష్టం అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఒక వీధి సెట్ ను రామోజీ ఫిలిం సిటీ లో వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది.

Updated Date - Jan 31 , 2024 | 12:32 PM