పెద్ద సినిమాల విడుదల తేదీల్లో మార్పు?

ABN , Publish Date - Jan 24 , 2024 | 10:16 AM

రానున్న నెలల్లో కొన్ని పెద్ద సినిమాలు విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉందని, కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తారని పరిశ్రమలో అనుకుంటున్నారు.

పెద్ద సినిమాల విడుదల తేదీల్లో మార్పు?
The above films may alter their release dates

రానున్న నెలల్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాలు చాలానే వున్నాయి. రామ్ పోతినేని, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్', ఎన్టీఆర్, కొరటాల శివ చేతులు కలిపిన 'దేవర' పార్టు వన్, అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్ చేస్తున్న 'పుష్ప 2' ఇంకా ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి'. ఇందులో కొంచెం బడ్జెట్ ఎక్కువ వున్న సినిమాలు వున్నాయి, సీక్వెల్స్ వున్నాయి. పైన చెప్పిన సినిమాలు అన్నీ విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు, ఇంకా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చెంజర్' విడుదల తేదీ ప్రకటించలేదు కానీ ఆ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదలవుతుంది.

rampothineni-skanda1.jpg

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించినా ఈ సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం వుంది అని అంటున్నారు. పూరి జగన్, రామ్ పోతినేని సినిమా ఇంకా షూటింగ్ చెయ్యాల్సి ఉందని, అదీ కాకుండా ఆ సినిమాకి కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు, అతనికి చాలా ఎక్కువ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు కూడా. అదీ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటిటి, శాటిలైట్ హక్కులు ఇంతకు ముందులా పోవటం లేదని, అది కూడా ఒక కారణం అని అంటున్నారు. అందుకని ఈ సినిమా మార్చి నుండి వేసవి సెలవుల్లో విడుదల ఉండొచ్చు అని అంటున్నారు. దీనిమీద ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ntrdevara.jpg

ఇక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా 'దేవర' కూడా చాలా షూటింగ్ ఉందని, ఈ సినిమాకి ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ పని చాలా ఉందని అందుకని ఈ సినిమా అనుకున్న తేదీకి రాకపోవచ్చు అని అంటున్నారు. ఈమధ్యనే ఇందులో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలై ఆసుపత్రిలో చేరారు అనే వార్త అందరికీ తెలిసిన విషయమే. అతను కోలుకొని మళ్ళీ సెట్స్ కి రావటానికి కొంచెం టైము పడుతుంది అని, అప్పుడు షూటింగ్ లో డిలే ఉండొచ్చు, అందుకని సినిమా విడుదల వాయిదా వేయడానికి అవకాశం ఉందని అంటున్నారు.

Kalki-Release-Date.jpg

ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'కల్కి 2898 ఏడి' అనే సినిమా కూడా ఇంకా చాలా గ్రాఫిక్ పని వుంది, షూటింగ్ కూడా కొంచెం చెయ్యాల్సి వుంది అని వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ సినిమా కూడా అనుకున్న తేదీకి కాకుండా వాయిదా పడే అవకాశం వుంది అని అంటున్నారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది కాబట్టి, ఈ సినిమాకి హిందీ సినిమాలు ఏమీ పోటీ లేకుండా వున్న తేదీని చూసి విడుదల చేస్తారు అని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, దుల్కర్ సల్మాన్ లాంటి చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. ఇంకా రానా దగ్గుబాటి కూడా వున్నారు అని అంటున్నారు. షూటింగ్ కూడా చెయ్యాల్సింది ఉందని అందుకని ఈ సినిమా వాయిదా పడే అవకాశం వుంది అని అంటున్నారు.

alluarjunpushpa2.jpg

ఇక 'పుష్ప 2' షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ తాను అనుకున్న అవుట్ ఫుట్ సరిగా వచ్చేవరకు తీస్తాడు. విడుదల తేదీ ప్రకటించేసాం కదా అని తొందరగా తీసే స్వభావం కాదు అతనిది. ఇంకా చాలా షూటింగ్ చెయ్యాల్సి వుంది అని అంటున్నారు. సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండబోతున్న గంగమ్మ జాతర పాట ఒక్కటే సుమారు ఒక నెల రోజుల పాటు చిత్రీకరించారు అని తెలిసింది. అదీ కాకుండా నీళ్లలో ఒక పోరాట సన్నివేశం ఉందని, దానికి హోమ్ వర్క్ చెయ్యడమే నెల రోజులు అయిందని, దానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో చేశారు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పోరాట సన్నివేశం చిత్రీకరించాల్సి వుంది, అది కూడా సినిమాకి ఇంకో హైలైట్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కేశవ పాత్ర చేసిన జగదీశ్ అరెస్టవటంతో అతనితో చెయ్యాల్సిన సన్నివేశాలు డిలే అయ్యాయని కూడా తెలిసింది. అతను బయటకి వచ్చాడు, అతని మీద సన్నివేశాలు తీయాల్సి ఉందని అంటున్నారు. రష్మిక మందన్న ఇంకా పూర్తిగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదని, ఆమె మీద చిత్రీకరించాల్సింది చాలా ఉందని అంటున్నారు. అలాగే పాటలు కూడా చిత్రీకరించాలి, ఇందులో కూడా ఒక స్పెషల్ పాట ఉంటుందని, అది ఒక బాలీవుడ్ నటి మీద చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇవన్నీ చిత్రీకరించడానికి చాలా సమయం పడుతుందని, అందుకని అనుకున్న విధంగా ఆగస్టు 15కి రాలేరని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ఇలా అన్ని సినిమాలు విడుదల తేదీల్లో మార్పులు ఉండొచ్చు అని పరిశ్రమలో కొన్ని రోజుల నుండి చర్చ జరుగుతోంది. అలాగే సామజిక మాధ్యమాల్లో కూడా ఈ సినిమాలు విడుదల తేదీలు గురించి చాలా చర్చ వైరల్ అవుతోంది. ఇంకొన్ని వారాల్లో ఈ సినిమాల విడుదల తేదీల గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం వుంది అని అంటున్నారు.

అధికారికంగా చెప్పిన విడుదల తేదీలు:

డబుల్ ఇస్మార్ట్ మార్చ్ 8, 2024

దేవర ఏప్రిల్ 5, 2024

కల్కి 2898 ఏడి మే 9, 2024

పుష్ప 2 ఆగష్టు 15, 2024

Updated Date - Jan 24 , 2024 | 10:16 AM