Pushpa 2: విడుదల తేదీలో మార్పు లేదు, అనుకున్న తేదీకే వస్తోంది

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:19 AM

దర్శకుడు సుకుమార్ రెండు యూనిట్ లతో 'పుష్ప 2' షూటింగ్ పూర్తి చెయ్యాలని, అనుకున్న తేదీకే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అల్లు అర్జున్ లేని సన్నివేశాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నట్టు సమాచారం

Pushpa 2: విడుదల తేదీలో మార్పు లేదు, అనుకున్న తేదీకే వస్తోంది
Allu Arjun and Sukumar

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' విడుదల ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్టు 15 కి వస్తుందా, లేదా అని చాలామందికి సందేహం వచ్చింది. పరిశ్రమలో కూడా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు వున్నాయి అని చాలా చర్చ జరిగింది. కానీ ఈ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లి అక్కడ ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ వుంది అని చెప్పడం చూస్తే ఈ 'పుష్ప 2' అనుకున్నట్టుగానే ఆగస్టు 15కి విడుదలవుతుంది అని అంటున్నారు.

దానికి తోడు, దర్శకుడు సుకుమార్ ఇప్పుడు రెండు యూనిట్స్ తో షూటింగ్ చేస్తున్నారు అని ఒక వార్త వినపడుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ లేని సన్నివేశాలని సుకుమార్ తీస్తున్నట్టుగా తెలిసింది. ఖైరతాబాదులోని ఒక కాలేజీలో కొన్ని ముఖ్య సన్నివేశాలను తీస్తున్నట్టుగా తెలిసింది. దీనిని బట్టి దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా తొందరగా పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో వున్నారు అని అర్థం అవుతోంది.

alluarjunpushpa2.jpg

ఎలాగు 'పుష్ప 3' కూడా వుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని ఆ సీక్వెల్ కి వదిలేయాలని చిత్ర యూనిట్ భావించిందని కూడా ఒక వార్త. అందుకనే ఈ 'పుష్ప 2' ని తొందరగా పూర్తి చేయగలరని, పాటలు ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తప్పితే పెద్దగా షూటింగ్ కూడా ఏమీ లేదని, అందుకని ఈ సినిమా అనుకున్నట్టుగానే ఆగస్టు 15 కి విడుదలవుతుందని అనుకుంటున్నారు. రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ పాట ఉంటుందని అయితే ఆ పాట కోసం బాలీవుడ్ నటి దిశా పటాని ని అనుకుంటున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. చిత్ర నిర్వాహకుల నుండి అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన ఈ వార్తపై రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.

Updated Date - Feb 17 , 2024 | 11:19 AM