మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pavan Sadineni: వరసగా రెండు సినిమాలతో దర్శకుడు పవన్ సాధినేని

ABN, Publish Date - Mar 26 , 2024 | 11:40 AM

వరసగా రెండు పెద్ద సినిమాలతో దర్శకుడు పవన్ సాధినేని ఇప్పుడు బిజీగా వున్నారు. రాజశేఖర్ తో ఒక సినిమా షూటింగ్ నడుస్తోంది, తరువాత మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఇంకో సినిమా వుంది అని భోగట్టా

Pavan Sadineni is directing Rajasekhar and Dulquer Salman in two different films

దర్శకుడు పవన్ సాధినేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మొదటి సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్' తో పరిశ్రమలోకి దర్శకుడిగా ఆరంగేట్రం చేసి, మొదటి సినిమాతో ప్రసంశలు అందుకోవటమే కాకుండా, అందరి కళ్ళలో పడ్డాడు పవన్. ఆ తరువాత 'సావిత్రి' అనే ఇంకో సినిమా చేసాడు. కానీ ఎందుకో తరువాత వెబ్ సిరీస్ ల మీదకి వెళ్లి కొన్ని వెబ్ సిరీస్ లు చేసాడు పవన్. తాజాగా 'దయా' అనే వెబ్ సిరీస్ చేసి అందులోకూడా తన ప్రతిభని చాటుకున్నాడు. జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో తయారైన ఈ 'దయా' వెబ్ సిరీస్ మంచి పేరు సంపాదించి పెట్టింది పవన్ కి.

ఇప్పుడు పవన్ వరసగా రెండు సినిమాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకటి రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నట్టుగా వినికిడి. ఇందులో జెడి చక్రవర్తి తో పాటు చాలామంది నటులు వున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాదులో జరుగుతోందని ఒక వార్త. ఇది పూర్తి యాక్షన్ సినిమా అని, ఇది ఒక కొత్త జానర్ అని తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి సినిమా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా గురించి ఒక అధికారిక ప్రకటన రానున్న రోజుల్లో వచ్చే అవకాశం వుంది.

ఈ సినిమా అయ్యాక పవన్ సాధినేని మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలిసింది. పవన్ ఒక మంచి కథని తయారు చేసాడని అది విన్న దుల్కర్ వెంటనే ఈ సినిమాకి అంగీకారం తెలిపారని తెలిసింది. అయితే ఇది ముందుగా తెలుగులోనే తీస్తారని, దుల్కర్ మలయాళం నటుడు, అలాగే తమిళం, హిందీ ప్రేక్షకులకి కూడా పరిచయస్తుడు కాబట్టి ఈ సినిమా మిగతా భాషల్లో విడుదలవుతుందని తెలుస్తోంది. కానీ దర్శకుడు పవన్ తెలుగులో తీయడానికే ఎక్కువ దృష్టి పెడుతున్నాడని తెలిసింది.

ఇలా వరస రెండు సినిమాలతో అందులోకి ఒకటి పాన్ ఇండియా లెవెల్ సినిమా కావటంతో, పవన్ సాధినేని పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. 'దయా' వెబ్ సిరీస్ కి ప్రసంశలు ఎక్కువగా రావటం, అది విజయవంతం అవటం ఇలా పవన్ కి వరసగా సినిమాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. 'దయా' వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా పవన్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత ఉంటుంది అని తెలుస్తోంది.

Updated Date - Mar 26 , 2024 | 02:28 PM