తెలుగు సినిమాలో తెలుగు నటులే కరువయ్యారు...

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:49 AM

ఏ తెలుగు సినిమా చూసిన ఏమున్నది గర్వకారణం, పరభాషా నటీనటులు తప్ప అని చెప్పవచ్చు. ఈమధ్య ఎక్కువ తెలుగు సినిమాల్లో తెలుగు నటులు ఒకరిద్దరు తప్పితే మిగతా అందరూ పరభాషా నటులే కనిపిస్తున్నారు. ఇక తెలుగు క్యారెక్టర్ నటులకి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఉండవా అనే విషయం ఒకటి నడుస్తోంది పరిశ్రమలో..

తెలుగు సినిమాలో తెలుగు నటులే కరువయ్యారు...
Saindhav pre release event held in Visakhapatnam on Sunday

ఈమధ్య చాలా తెలుగు సినిమాల్లో తెలుగు నటులే కనిపించడం మానేశారు. ఒక్క కథానాయకుడు తప్పితే, మిగతా చాలామందిని ఇతర బాషల నుండి తెచ్చుకున్న నటులే కనిపిస్తున్నారు. అయితే అదేమీ తప్పు కాదు కానీ, తెలుగు సినిమాలో తెలుగు నటులకి ప్రోత్సహం ఇస్తే బాగుంటుంది కదా అని పరిశ్రమలో కొంతమంది అనుకుంటున్న మాట. అయితే ఈమధ్య ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా అంటూ అసలు తెలుగు నటులనే తీసుకోవటం మానేశారు. పోనీ ఆ పరభాషా నటుల వలన ఆ సినిమా ఏమైనా ఇతర భాషల్లో నడుస్తోందా అంటే అస్సలు లేదు, ఒక్క టికెట్ కూడా అక్కడ కూడా తెగడం లేదు.

కొన్ని రోజుల క్రితం 'సైంధవ్' ట్రైలర్ విడుదలైంది, ఇది వెంకటేష్ 75వ సినిమా, శైలేష్ కొలను దర్శకుడు. ఈ సినిమాలో కథానాయకుడు వెంకటేష్ తప్పితే ఇంకొక్క తెలుగు నటుడు కూడా కనిపించడం లేదు. కథానాయికలని ఎలాగు తెలుగు అమ్మాయిలని పెట్టుకోవటం మానేశారు, ఎక్కువ సినిమాల్లో పరభాషా నటీమణులే కనిపిస్తున్నారు. ఈమధ్యనే తెలుగు అమ్మాయి శ్రీలీల బాగా షైన్ అవుతోంది, అది సంతోషించదగ్గ విషయం అని అంటున్నారు.

ఇప్పుడు 'సైంధవ్' చూస్తే, అందులో శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా పాలేకర్ వీళ్ళందరూ తెలుగువాళ్లు కాదు. పోనీ నటులనైనా పెట్టుకున్నారా అంటే నవాజుద్దీన్ సిద్దిఖీ, జిషు సేన్ గుప్త, ముకేష్ ఋషి, ఆర్య, జయప్రకాశ్ ఇంకా మరికొంతమంది అందరూ పరభాషా నటులే. అయితే ఇక్కడ ఈ నటులందరూ వాళ్ళ భాషలో ప్రతిభ కలవాళ్లే, కానీ 'సైంధవ్' మరి తెలుగు సినిమా అంటున్నారు కదా. ఎదో మరీ విమర్శిస్తారు అనేమో ఒకరిద్దరు 'జబర్దస్త్' నటులకి అవకాశం ఇచ్చినట్టున్నారు. తెలుగు సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఇప్పుడు తెలుగు నటులు, తెలుగు మొహాలు కరువయ్యాయి అనే విషయం మీద పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఇలా తీసుకోవటం వలన డబ్బింగ్ ఆర్టిస్టులకి మంచి గిరాకీ వచ్చింది అని కూడా అంటున్నారు.

saindhavevent.jpg

అదే కాకుండా వీళ్ళందరికీ చాలా ఎక్కువ పారితోషికాలు ఇచ్చి మరీ తెలుగు సినిమాల్లో నటింప చేస్తారు. అదే ఒక తెలుగు క్యారెక్టర్ నటుడికి పారితోషికం అనేసరికి బడ్జెట్ గురించి మాట్లాడతారు. దర్శకుడిగా తెలుగువాడిని పెట్టుకుంటున్నారు, అందుకు సంతోషించండి అనే పేరు చెప్పని ఒక నిర్మాత అన్నారు. ముందు ముందు దర్శకులని కూడా ఇంపోర్ట్ చేసుకుంటారేమో అని కూడా ఆ నిర్మాత ఒక సందేహం వ్యక్తపరిచారు. మళ్ళీ ఈ సినిమాలు తెలుగువాళ్ళకి ముఖ్యమైన పండగ అయిన సంక్రాంతికి విడుదలవుతున్నాయి.

కథలో దమ్ముండాలి కానీ, పరభాషా నటుల్ని పెట్టుకోవటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు అని కూడా అంటున్నారు. 'పుష్ప', 'కాంతారా' లాంటి సినిమాలు ప్రభంజనం సృష్టించాయి, అందులో ఎటువంటి పరభాషా నటులు లేరు కదా. 'పుష్ప' లో ఒక్క ఫహాద్ ఫాజిల్ తప్పితే అందరూ తెలుగు నటులే, అలాగే 'కాంతారా' లో కూడా అందరూ కన్నడ నటులే, మరి ఈ రెండు సినిమాలు అన్ని భాషల్లో ఆడాయి కదా.

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత వూరికే పోదు కదా, మళ్ళీ తెలుగు నటులను తెలుగు సినిమాల్లో చూసే సమయం ముందు ముందు వస్తుంది అని అంటున్నారు పరిశ్రమలో. ఎందుకంటే ఈ పరభాషా నటులకి ఎంతకాలం ఎక్కువ పారితోషికాలు ఇచ్చి పోషిస్తారు, ఎదో ఒకరోజు మళ్ళీ పాత వైభవం వస్తుంది అని అంటున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:49 AM