Vijay Deverakonda: అందుకే ఓపెనింగ్స్ రాలేదు అనటం ఎంతవరకు సబబు...

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:11 PM

విజయ్ దేవరకొండ తన మొదటి సినిమా అప్పుడు ఎలా మాట్లాడతాడో, ఇప్పుడూ అలానే మాట్లాడుతున్నాడు. అతని మనసులో ఏముందో అదే బయటకి చెప్పేస్తాడు. మరి ఇప్పుడు కొత్తగా అతని మాటల వల్లనే అతని సినిమాకి ఓపెనింగ్స్ రావటం లేదు అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది, అది ఎంతవరకు సబబు?

Vijay Deverakonda: అందుకే ఓపెనింగ్స్ రాలేదు అనటం ఎంతవరకు సబబు...
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ పెట్ల దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. విడుదలకి ముందు ఈ సినిమా ప్రచారాలు ఊపందుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పరిశ్రమలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే విజయ్ దేవరకొండ తన సినిమా ప్రచారాల్లో కొత్త వివాదాలను మాట్లాడతారు అని, అందువల్లనే అతని సినిమాలకి కుటుంబ ప్రేక్షకులు దూరం అయ్యారని ఒక చర్చ పరిశ్రమలో నడుస్తోంది. కానీ నిజంగా అలా మాట్లాడటం వలన ప్రేక్షకులు సినిమాలకి రావటం లేదు అనటం ఎంతవరకు సబబు? అని కూడా పరిశ్రమలో కొంతమంది అంటున్నారు. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారని, ఆ సినిమా గురించి ఎంత ప్రచారం చేసినా, సినిమాలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాని తిరస్కరిస్తారని కూడా అంటున్నారు.

vijaydeverakonda2.jpg

అయితే ఈ సినిమా ముందస్తు విడుదల వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కెరీర్ మొదట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు భవిష్యత్తులో ఎటువంటి వార్త వినాలని అనుకుంటున్నావు అని అడిగితే 'విజయ్ దేవరకొండ సినిమా రూ. 100 కోట్లు కొట్టింది' అని వినాలని అనుకున్నాను అని, అది నాలుగో సినిమా 'గీత గోవిందం' తో కొట్టాను అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మళ్ళీ రూ.200 కోట్లు కలెక్టు చేసే సినిమా చేస్తాను అని చెప్పాను అని, అలా చెప్పడంతో చాలామంది అలా ఎందుకు చెప్పావు, అది తప్పు, అది బలుపు అనుకుంటారని చాలామంది తనకి చెప్పారని చెప్పాడు విజయ్ దేవరకొండ. అయితే తాను రూ. 200 కోట్లు కొడతాను అన్న ప్రకటన తప్పు కాదని, అది రాబోయే రోజుల్లో నిజం చేస్తాను అని చెప్పాడు విజయ్.

అయితే అదే సభలో ఇంకొకరు స్టార్ అయితే మనం అవలేమా ఏంటి, ఇంకొకరు 200 కోట్లు కొడితే నేను కొట్టలేనా ఏంటి అని కూడా చెప్పాడు విజయ్. చాలామంది ఇలా అన్నందుకు తనని బలుపు అనుకుంటారని, యారగన్స్ తో చెప్పాను అని అనుకుంటారని, కానీ అది తనమీద తనకున్న నమ్మకం అని చెప్పాడు విజయ్. ఇప్పుడే కాదు, విజయ్ తన మొదటి సినిమా నుండి అలానే మాట్లాడుతాడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలా మాట్లాడటం వలెనే అతనికి ఎంతోమంది అభిమానులు అయ్యారు, అవుతున్నారు కూడా. అతను తన మనసులో ఏముందో అదే మాట్లాడుతాడు అని పరిశ్రమలోని, అతని అభిమానులకి కూడా తెలుసు. అదే విషయం కొన్ని రోజుల క్రితం మెగా స్టార్ చిరంజీవి కూడా విజయ్ తో చెప్పారు. నువ్వు నీలాగే వుండు, ఎటువంటి చేంజ్ వద్దు, నిన్ను అలానే అభిమానిస్తారు అని. మరి కొత్తగా విజయ్ ఎదో తప్పులు మాట్లాడేసేడు, అందువల్ల కుటుంబ ప్రేక్షకులు దూరం అయ్యారు అని అంటూ ఉండటం ఎంతవరకు సబబు? అని పరిశ్రమలో కొందరు అంటున్నారు.

vijayd-new5.jpg

ప్రతి నటుడికి కొంత బ్యాడ్ టైము, గుడ్ టైము వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కి చాలా సంవత్సరాలు హిట్ సినిమా లేదు, 'ఖుషి' సినిమా తరువాత హిట్ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 'జల్సా' హిట్ అయింది, ఆ తరువాత మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత 'గబ్బర్ సింగ్' తో మళ్ళీ ట్రాక్ లో పడ్డారు పవన్ కళ్యాణ్. మహేష్ బాబు కి 'పోకిరి' హిట్ ఇచ్చిన తరువాత సుమారు ఐదారు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది ఇంకో హిట్ కోసం. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కి కూడా ఇలాంటి బ్యాడ్ టైములు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇలా చాలామంది నటులకి వున్నాయి.

అలానే 'గీత గోవిందం' సినిమా తరువాత విజయ్ కి అంత పెద్ద విజయం వరించలేదు. 'లైగర్' సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నాడు, అది సఫలం కాలేదు. కానీ అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు, అతనికి కొన్ని డ్రీమ్స్ వున్నాయి, అవి అచీవ్ చేసుకోవాలని అనుకోవటం తప్పు కాదు. తన సినిమా ఎవరు చూస్తారులే అనుకున్నవాడు, ఈరోజు పెద్ద స్టార్ అయ్యాడు. అది అతని డ్రీమ్, దాని వెనక అతని కష్టం ఎంతో వుంది. విజయ్ అనే నటుడు సినిమా కోసం, తన పాత్ర కోసం ఎంత కష్టపడతాడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి విజయ్ ఎదో అనేశాడు, ఎవరినో అన్నాడు అన్నది కరెక్టు కాదు అని పరిశ్రమలో కొంతమంది అంటున్న విషయం. అతను మొదటి నుండీ అలానే వున్నాడని, ఇప్పుడు కూడా అలాగే వున్నాడని అంటున్నారు. నిజంగా అతని మాటలు వల్ల సినిమాకి ప్రేక్షకులు రావటం లేదు అనేది తప్పు అని పరిశ్రమలో అంటున్నారు. రెండు వైవిధ్యమైన సినిమాలు 'అర్జున్ రెడ్డి', ఆ వెంటనే వచ్చిన 'గీత గోవిందం' పెద్ద విజయం సాధించాయి. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఎటువంటి సినిమానైనా ఆదరిస్తారు, అందులో ఎవరు నటించినా. ఈమధ్యనే విడుదలైన 'టిల్లు స్క్వేర్' సినిమా ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు కదా.

Updated Date - Apr 05 , 2024 | 03:11 PM