HanuMan movie review: ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ఎలా ఉందంటే...

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:29 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ఆ సినిమా విడుదలైన రోజే చిన్న సినిమా అయిన 'హనుమాన్' కూడా విడుదలవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకుడు, తేజ సజ్జ కథానాయకుడు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చదవండి.

HanuMan movie review: ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ఎలా ఉందంటే...
Hanuman Movie Review

సినిమా: హనుమాన్

నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, అమ్రితా అయ్యర్, వెన్నెల కిశోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శీను, దీపక్ శెట్టి తదితరులు

ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర

సంగీతం: అనుదీప్ దేవ్, గౌర హరి, కృష్ణ సౌరభ్

నిర్మాత: కె నిరంజన్ రెడ్డి

రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

రేటింగ్: 3.5

-- సురేష్ కవిరాయని

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది అంటే తెలుగు ప్రజలు సినిమాలు కూడా చూడటానికి ఇష్టపడతారు. ఈసారి సంక్రాంతి పండగకి పెద్ద సినిమా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' అయితే, దానితో పోటీగా అదేరోజు విడుదల చేస్తున్న సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మించిన 'హనుమాన్'. తేజ సజ్జ ఇందులో కథానాయకుడు, అమృత అయ్యర్ కథానాయకురాలు, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకో ప్రధానపాత్రలో కనపడతారు. ఇది ఒక సూపర్ హీరో సినిమా, తేజసజ్జ ఇందులో ఒక సూపర్ మేన్ గా కనపడతాడు. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది, కానీ మహేష్ బాబు సినిమా చాలా థియేటర్స్ లో విడుదల అవటం వలన ఈ సినిమాకి థియేటర్స్ దొరకటం కష్టం అయింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ ఆటలు జనవరి 11న చాలా థియేటర్స్ లో వేశారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ 'హనుమాన్' ఎలా వుందో చూద్దాం. (Hanuman movie review)

Hanuman.jpg

హనుమాన్ కథ:

అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) వుంటారు. హనుమంతు ఆ వూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ వూరికి హనుమంతు చిన్నప్పటి స్నేహితురాలు మీనాక్షి (అమృత అయ్యర్) డాక్టర్ గా చదువు పూర్తి చేసుకొని వస్తుంది. అదే వూరిలో వున్న ఒక బలమైన వస్తాదు ఆ వూరిలో దోపిడీ దొంగతనాలు చేయించి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. ఒకసారి మీనాక్షి వెళుతున్న బస్సు మీదకి దోపీడీ దొంగలు వస్తే, అందరూ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోవటానికి అడివిలోకి పారిపోతారు. ఆ సమయంలో హనుమంతు వచ్చి మీనాక్షిని కాపాడతాడు, అదే సమయంలో దొంగలు హనుమంతుని పొడిచి అక్కడ నదిలో పడేస్తారు. హనుమంతు నీటి అడుగుకి కొట్టుకుపోతున్నప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది, తరువాత దెబ్బలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన అతన్ని ఆ ఊరి ప్రజలు ఇంటికి చేరుస్తారు, కట్లు కడతారు, కానీ అతను కోలుకోవటం కష్టం అంటారు. మణి ప్రభావంతో హనుమంతుకి దెబ్బలు మాయం అయిపోతాయి, ఒక్కసారిగా సూపర్ మాన్ లా తయారవుతాడు. అదే సమయంలో మైకేల్ (వినయ్ రాయ్) అనే అతను అతని అసిస్టెంట్ (వెన్నెల కిషోర్) తో ఆ మణి గురించి తెలిసి అది కాజేయాలని, ఆ వూరికి వస్తారు. ఇంతకీ మైకేల్ ఎవరు? అతను ఎందుకు ఈ మణిని చేజిక్కుంచుకోవాలని అనుకున్నాడు? ఆ మణి నేపధ్యం ఏంటి? సూపర్ మేన్ గా మారిన హనుమంతు ఆ వూరికి ఏమి చేసాడు? అంజమ్మ పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'హనుమాన్' చూడాల్సిందే. (Hanuman movie review)

hanu-man.jpg

విశ్లేషణ:

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంతకు ముందు 'ఆ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' అనే సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఇది అతని నాలుగో సినిమా. ఇంతకు ముందు సినిమాలతో ప్రశాంత్ తాను ఒక సెన్సిబుల్ దర్శకుడిగా పేరుపొందారు. హాలీవుడ్ లో 'సూపర్ మేన్', 'స్పైడర్ మేన్', 'బాట్ మేన్' ఇంకా చాలా సూపర్ మాన్ కథలతో సినిమాలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ భారతీయ పురాణం అయిన రామాయణంలోని హనుమాన్ పాత్రని తీసుకొని ఒక కథను తయారు చేసి ఈ 'హనుమాన్' సినిమా నిర్మించాడు.

ఈ సినిమా మొదలవడం కూడా హనుమంతుడు పుట్టడం, సూర్యుడుని పండు అనుకొని తినటానికి వెళ్లడం, ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టడం అది హనుమంతునికి తగలడం వరకు బాగానే వుంది. ఇక్కడే ప్రశాంత్ వర్మ ఒక చిన్న కథని పెట్టాడు. వజ్రాయుధం హనుమంతునికి తగిలినప్పుడు అతని రక్తపు బిందువు ఒకటి అంజనాద్రి ఊరి దగ్గరలో వున్న నదిలో పడిపోయి నిక్షిప్తం అవుతుంది. ఇదంతా ఆసక్తికరంగా గ్రాఫిక్స్ ద్వారానే చెప్పేసాడు ప్రశాంత్ వర్మ.

అంజనాద్రి అనే వూరిలో వుండే పరిస్థితులు, హనుమంతు, అతని అక్క, ఆ ఊరి ప్రజలు ఇలా ఆ ఊరి గురించి కొంచెంసేపు సాగదీసినట్టుగానే చెప్పినా ప్రశాంత్ వర్మ వెంటనే కథలోకి వచ్చేస్తాడు. ఆ ఊర్లో వుండే దోపిడీ దొంగలను అడ్డుకోవటానికి హనుమంతు ఎటువంటి బలం లేకపోయినా ధైర్యంగా ముందుకు రావటం, తరువాత అతనికి సూపర్ పవర్స్ రావటం ఇవన్నీ చాలా ఆసక్తికరంగా చూపించాడు ప్రశాంత్. మొదటి సగం అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే రెండో సగం వచ్చేసరికి కొంత సాగదీత సన్నివేశాలు ఉంటాయి. విలన్ అయిన మైకేల్ అంజనాద్రి వూరికి వస్తాడు, హనుమంతు ఎలా సూపర్ మేన్ అయ్యాడు అన్న రహస్యం తెలుసుకొని, దాన్ని ఎలా చేజిక్కుంచుకోవాలనే విషయాలు సరిగ్గా చూపించలేకపోయారు ప్రశాంత్. విలన్ ని కొంచెం హైలైట్ చేస్తే బాగుందేమో ఇక్కడ. విలన్ చేసే కంప్యూటర్ పరిశోధనలు అనీ మరీ సినిమాటిక్ గా అనిపించినా, చివరి పావుగంట మళ్ళీ ప్రశాంత్ ప్రేక్షకులని మైమరపిస్తాడు.

Hanu-Man.jpg

కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంగీత నేపథ్యంతో మొదటసారి పర్వతంలా వున్న హనుమంతుని చూపించినప్పుడు ఆ సన్నివేశం హైలైట్ అనే చెప్పాలి. అలాగే పోరాట సన్నివేశాలు బాగా కోరియోగ్రఫీ చేసి ఆసక్తికరంగా తీశారు. ఈ సినిమాకి నేపధ్య సంగీతం ఒక ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు నేపధ్య సంగీతంతో చాలా ఎలివేట్ చేసి చూపించాడు దర్శకుడు. ఇక భావోద్వేగ సన్నివేశాల్లో అక్క, తమ్ముడు సెంటిమెంట్, లీడ్ పెయిర్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ అవి తగ్గించి విలన్ పాత్రని రెండో సగంలో కొంచెం మెరుగుపరిస్తే బాగుండేది. ఛాయాగ్రహణం బాగుంది, పాటలు పరవాలేదు, హనుమంతుని మీద శ్లోకాలతో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు. రెండో సగంలో కొంచెం సాగదీత కనిపించినా, తనకున్న పరిధిలో బాగా తీసాడు అనే చెప్పాలి. హాలీవుడ్ సూపర్ మేన్ లతో పోలిస్తే ఇది మన పురాణం నుండి తీసుకున్న మన సూపర్ మేన్ కథ. అందుకని అందరూ చూడొచ్చు, ముఖ్యంగా పిల్లలకి విపరీతంగా నచ్చుతుంది.

ఇంతకు ముందు 'ముత్యాల ముగ్గు', 'శ్రీ ఆంజనేయం' లాంటి సినిమాలలో ఆంజనేయుని పాత్రలు ఉంటాయి, అవి కూడా ఫాంటసీ నేపధ్యం వున్న సినిమాలే. అలాగే మలయాళం నటుడు తోవినో థామస్ నటించిన 'మిన్నల్ మురళి' సూపర్ హీరో సినిమా 2021లో విడుదలైంది. అయితే ఈ 'హనుమాన్' సినిమా ఆ మలయాళం సినిమా ఒరవడిలోనే ఉంటుంది, కానీ కథలు రెండూ వేరుగా ఉంటాయి.

Hanu-Man-2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, తేజసజ్జ, హనుమంతు పాత్రలో ఇమిడిపోయాడు. చలాకిగా, అల్లరిగా వుండే పాత్రలో, తరువాత సూపర్ మేన్ అయిన తరువాత చాలా బాగా చేసాడు. నటనలో పరిణితి చూపించాడు. ఈ సినిమా అతని కెరీర్ ని ఒక మెట్టు పైకి తీసుకువెళుతుంది. అమృత అయ్యర్ డాక్టర్ పాత్రలో కథానాయకురాలిగా బాగా చేసింది, ఆమెకి ఇది మంచి పాత్ర అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అక్కగా బాగుంది, కానీ ఆమె యాస సరిగ్గా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇక సత్య, గెటప్ శీను కొన్ని నవ్వులు పండించారు. వినయ్ రాయ్ విలన్ గా బాగున్నాడు. వెన్నెల కిశోర్ సైంటిస్ట్ గా కనపడతాడు. మిగతా పాత్రల్లో అందరూ వారి పాత్రల పరిధిమేరకు నటించారు.

చివరగా, 'హనుమాన్' హాలీవుడ్ సినిమాల్లో చూపించే సూపర్ మాన్ సినిమాలకి స్ఫూర్తిగా భారతీయ సూపర్ మేన్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఆవిష్కరించాడు. ఇదొక మంచి ప్రయత్నమనే చెప్పాలి. వున్న లిమిటెడ్ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా తీసిన దర్శకుడిని అభినందించాల్సిందే. ఆసక్తికరంగా ఉంటుంది, ఒకసారి చూడొచ్చు, పిల్లలకి అయితే ఇంకా బాగా నచ్చుతుంది.

Updated Date - Jan 11 , 2024 | 11:29 PM