SKSH Review : వెన్నెల కిశోర్‌ నటించిన శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:51 PM

హాస్యనటుడుగా మంచి గుర్తింపు పొందిన  వెన్నెల కిశోర్‌ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆయన నటించిన చిత్రం ‘చారి 111’. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’తో క్రిస్మస్‌ బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

సినిమా రివ్యూ: శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌
విడుదల తేది: 25–12–2024
నటీనటులు: వెన్నెల కిశోర్‌, అనన్య నాగళ్ల, శియా గౌతమ్‌, రవితేజ మహాదాస్యం, మురళీధర్‌ గౌడ్‌, అనీష్‌ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్‌, భద్రం, నాగ్‌ మహేశ్‌, ప్రభావతి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: ఎన్‌.మల్లికార్జున్‌
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
రచన, దర్శకత్వం: రైటర్‌ మోహన్‌

హాస్యనటుడుగా మంచి గుర్తింపు పొందిన  వెన్నెల కిశోర్‌ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆయన నటించిన చిత్రం ‘చారి 111’. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’తో క్రిస్మస్‌ బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన రైటర్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. మరీ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.

Story
రాజీవ్‌గాంధీ హత్య జరిగిన రోజు విశాఖపట్నం సముద్రం ఒడ్డున మేరీ అనే యువతి హత్య కు గురవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సీఐ భాస్కర్‌ (అనీష్‌ కురివిల్లా) రాజీవ్‌ గాంధీ హత్య కేసులో బిజీ అయిపోతాడు. అందుకే ఈ కేసును ప్రైవేట్‌ డిటెక్టివ్‌ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ (వెన్నెల కిశోర్‌)కు అప్పగిస్తారు. తను మేరీ హత్య కేసును చేపట్టగానే ప్రేమికులు బాలు (రవితేజ), భ్రమరాంబ (అనన్య నాగళ్ల)తో సహా సస్పెండ్‌ అయిన ఎస్సై పట్నాయక్‌ (బాహుబలి ప్రభాకర్‌)తోపాటు మరో ముగ్గురు జాలర్లను అనుమానితులుగా గుర్తిస్తాడు. మరి వీళ్లల్లో మేరీని హత్య చేసిందెవరు? ఆ హత్య వెనకున్న కారణాలేంటి? ఈ కేసును శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ వారంలో పరిష్కరించాడా? లేదా? వెన్నెల కిశోర్‌కి ఎదురైన సవాళ్లేంటి? వెనక్కి వెళ్తే అతని ఆశయం ఏంటి అన్నది సినిమా ఇతివృత్తం.  

Sss.jpg

విశ్లేషణ (Srikakulam sherlock holmes Review)
చంటబ్బాయ్‌ లాంట డిటెక్టివ్‌ థ్రిల్లర్స్‌ ఆసక్తికరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తోపాటు కాస్త వినోదాన్ని పంచితే తప్పకుండా అది ప్రేక్షకాదరణ పొందుతుంది. చంటబ్బాయ్‌, యువ హీరో నవీన్‌ పోలిశెట్టి నటించిన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాలు అలాగే సక్సెస్‌ అయ్యాయి. ఈ చిత్రంలో కూడా ఆ తరహా కంటెంట్‌ ఉంది.  కానీ చంటబ్బాయ్‌లా నవ్విస్తూ, సస్పెన్స్‌కు గురి చేస్తూ, క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్‌ ఉంటే తప్ప ఇలాంటి ఈ తరహా కథలు ప్రేక్షకాదరణ పొందవు. ఈ సినిమా మర్డర్‌ కేస్‌తో మొదలై, ఆ వెంటనే రాజీవ్‌ గాంధీ హత్య, అలా బాగానే కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి కథంతా ఎక్కడ మొదలైందో అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. మేరీ హత్య కేసును భాస్కర్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌కు అప్పగించాల్సి రావడం వెనకున్న కారణం కన్విన్సింగ్‌గా ఉన్నా.. ఓ విలేకరి ఒత్తిడి మేరకు తను ఆ కేసును వారం రోజుల్లో పూర్తి చేస్తాను, లేదంటే రాజీనామా చేస్తానని సవాల్‌ విసరడం ఏంటో అర్థం కాలేదు. కేసును ఛేదించే సన్నివేశాలు కూడా గజిబిజీగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఏడుగురు నిందితులను తెరపైకి తెచ్చి విచారణ పేరుతో కేసులోని కీలక అంశాల్ని వాళ్లతో చెప్పించడం ఏమాత్రం రక్తి కట్టించలేదు. ఆ మాత్రం అడగటానికి హీరో డిటెక్టివ్‌ కావాల్సిన పనిలేదు. ఈ విచారణ కోణంలోనే బాలు, భ్రమరాంబల ప్రేమకథ తెరపైకి వస్తుంది. అని అది నేచురల్‌గా ఉండదు. బీచ్‌లో భ్రమరాంబ బర్త్‌డే కేక్‌ కటింగ్‌ నుంచి మేరీ హత్య వరకూ ఏదీ సహజంగా అనిపించవు. ఇందులో ఝాన్సీ అనే యువతి మేరీ అనే యువతిపై వ్యామోహం పెంచుకోవడం  విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలతో ఫస్టాఫ్‌ పూర్తవుతుంది.  ద్వితీయార్థం సస్పెండ్‌ అయిన ఎస్సై పట్నాయక్‌, ముగ్గురు జాలర్ల విచారణ కోణం నుంచి మొదలవుతుంది. ఆ రెండు ట్రాక్స్‌లోనూ ఎలాంటి థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ కనిపించవు. హీరో డిటెక్టివ్‌గా మారడానికి వెనకున్న కారణం.. తన జీవితంలో విషాదం.. తనకు జరిగిన అన్యాయం... అన్నీ మరీ డ్రమాటిక్‌గా అనిపిస్తాయి.  అయితే చివరి 20 నిమిషాలు కాస్త గాడిలో ఉంటుంది సినిమా. మేరీ హత్య వెనకున్న కారణం.. బాలు, భ్రమర జీవితాల్లోని మరో కోణం.. అవయవాల అక్రమ రవాణా అంశం.. ఇవన్నీ మరీ థ్రిల్‌ పంచకున్నా ప్రేక్షకులకు కాస్త ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఫైనల్‌గా సినిమా క్లైమాక్స్‌ ఒకే అనిపిస్తుంది. (Srikakulam sherlock holmes Review)

నటీనటుల విషయానికొస్తే.. కథ మొత్తం వెన్నెల కిశోర్‌ యాంగిల్‌లోనే నడుస్తుంది. హాస్యనటుడిగా విభిన్న పాత్రల పోషించి మెప్పించిన ఆయనకు ఈ చిత్రంలో అంతగా ప్రాధాన్యం కనిపించలేదు. పాత్రలోకి పూర్తిగా వెళ్లలేకపోయాడనిపిస్తుంది. డిటెక్టివ్‌కు తగ్గ బలమైన సీన్స్‌ లేవు. కేసును పనిలో ఏదో ఒక క్లూ తెలుసుకున్న ప్రతి సారి ుఆ.. చెప్పేస్తారు మరి’ అంటూ రొటీన్‌గా చెప్పే డైలాగ్‌లు విసుగు తెప్పిస్తుంది. శ్రీకాకుళం యాస సెట్‌ కాలేదు. వెన్నెల కిశోర్‌తో మంచి కామెడీ ట్రాక్‌ కూడా రాయలేదు దర్శకుడు. ఆయనకు ఒక ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ ఇచ్చారు. అది ఓ మాదిరిగా బాగానే ఉంది. అనన్య నాగళ్ల మంచి పాత్రల్ని చేసుకొంటూ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతుంది. అయితే ఇందులో స్టార్టింగ్స్‌ సీన్స్‌ చూస్తే పెద్దగా ప్రాధాన్యం లేదనిపిస్తుంది. క్రమంగా పాత్ర డెప్త్‌ బయటపడుతుంది. రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించింది. ఆమె పాత్రలోని ఆ రెండో కోణం ప్రేక్షకుల్ని కాస్త థ్రిల్‌ చేస్తుంది. అనీష్‌ కురువిల్లాకు ఆర్‌సీఎమ్‌ రాజు డబ్బంగ్‌ సూట్‌ కాలేదు. శియా, రవితేజ, అనీష్‌ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్‌ పాత్రలు పూర్తిగా తేలిపోయాయి. జర్నలిస్ట్‌గా నాగరాజు పాత్ర సినిమాకు భారంగా అనిపించింది. రైటర్‌ మోహన్‌ రాసుకున్న డిటెక్టివ్‌ కథలో కొత్తదనం లేదు. కొన్ని సీన్స్‌ లాజిక్‌కు దూరంగా ఉంటాయి. డిటెక్టివ్‌ కథలంటే మలుపులు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండాలి. ఇందులో అవేమీ కనిపించవు.  సునీల్‌ కశ్యప్‌ ఆకట్టుకునేలా లేదు, శ్రీకాకుళం పాట మాత్రం బావుంది. ఆ ప్రాంత వాసులు ఆ పాటను బాగా ఇష్టపడతారు. కెమెరా వర్క్‌ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వెన్నెల కిశోర్‌ సినిమా అంటే నవ్వుల కోసం ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్తారు. కానీ ఇందులో అదే లేదు.

ట్యాగ్‌ లైన్‌: ఏమీ లేకుండా చేసేస్తారు మరి 

 
 

Updated Date - Dec 25 , 2024 | 09:00 PM