Rahasyam Idam Jagath Reivew: 'రహస్యం ఇదం జగత్' రివ్యూ
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:19 AM
సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అనుకున్నది అన్నకున్నట్లు ఆడియన్‌కి అర్థమయ్యేలా చెబితే ఈ తరహా చిత్రాలకు ఆదరణకు కొరతే ఉండదు. తాజాగా ఆ తరహా కథతో వచ్చిన చిత్రం 'రహస్యం ఇదం జగత్’.
సినిమా రివ్యూ: 'రహస్యం ఇదం జగత్' (Rahasyam Idam Jagath Reivew)
విడుదల తేది: 8–1–2024
నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్
సంగీతం: గ్యానీ
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్
సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అనుకున్నది అన్నకున్నట్లు ఆడియన్‌కి అర్థమయ్యేలా చెబితే ఈ తరహా చిత్రాలకు ఆదరణకు కొరతే ఉండదు. తాజాగా ఆ తరహా కథతో వచ్చిన చిత్రం 'రహస్యం ఇదం జగత్’. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతి కలిగించేందుకు ప్రయత్నించారు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది అన్నది చూద్దాం.
కథ: (Rahasyam Idam Jagath Story)
అమెరికాలో ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్‌లో ఉంటాడు అభి (రాకేష్). తన ప్రేయసి అకీరా (స్రవంతి) తండ్రి మరణించడంతో ఆమె తల్లి కోసం ఇండియాకు వెళ్లిపోవాలనుకుంటుంది. తన కోసం అభి కూడా అదే ప్లాన్ చేస్తాడు. అయితే వెళ్లే ముందు స్నేహితులు అంతా కలిసి సరదాగా గడపాలని ఓ ట్రిప్ వేస్తారు. అనుకోని కారణాల వల్ల అడవిలో ఓ హౌస్‌లో స్టే చేయాల్సి వస్తుంది. అక్కడికి మరో జంటతోపాటు అకిరా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. చిన్న చిన్న మాటలతో మొదలై అకిరా కోసం అభి, విశ్వ మధ్య గొడవ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకొని ఆకీరా, కళ్యాణ్‌లను విశ్వ చంపేస్తాడు. అయితే మల్టీ యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేేస మెడికల్ ఎక్విప్మెంట్ డిజైనర్ ఆరుషి తనున్న ప్రదేశంలోనే మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి ఉందని తెఉసుకుని అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమెను ఎవరో గన్ తో పేల్చి చంపుతారు. అయితే చనిపోయిన స్నేహితులను బతికించుకోవడానికి అభి మల్టీ యూనివర్స్ లోకి వెళ్లే వార్మ్ హోల్‌లోకి వెళతాడు. అదంతా ఎలా జరింగింది. స్నేహితులు బతికారా? అన్నది మిగతా కథ.
విశ్లేషణ: (Rahasyam Idam Jagath)
ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి కలిగింది. టైం ట్రావెల్ గురించి సినిమా ఉంటుందేమోననిపించింది. అయితే ఈ కథ మల్టీ యూనివర్స్, వార్మ్ హోల్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్నారు. దానికి కృష్ణుడు, శ్రీ చక్రం, ఆంజనేయస్వామి కనెక్షన్ తీసుకుని మైథాలజీతో టచ్ చేశారు. ఫస్టాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్‌కి వెళ్లడం అక్కడ గొడవలు వారి మధ్య గిల్లికజ్జాలతో సాదాగా నడుస్తోంది. అయితే ఇంటర్వెల్ ముందు అభి ఫ్రెండ్స్ కల్యాణ్ చనిపోవడంతో ఆరుతో కలిసి అతనేం చేయబోతున్నాడనే ఆసక్తి కలిగింది. ఇక సెకండ్ హాఫ్‌లో వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిన అభి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఎలా కాపాడతాడు అనేది ఆసక్తి రేకెత్తించింది. క్లైమాక్స్‌కు ఫస్టాఫ్‌లో పలు సన్నివేశాలను లింక్ చేయాలనుకున్నారు. అది ప్రేక్షకుల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేసింది. ఫస్టాఫ్ బోరింగ్‌తో అనిపించినా సెకండాఫ్‌లో స్ర్కీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదీ కలిసి రాలేదు. నటీనటులు అంతా కొత్తవారు కావడం, తెరపై తెలిసిన ఫేస్ ఒకటి కూడా లేకపోవడం, అమెరికన్ ఇంగ్లిష్‌లోనే డైలాగ్స్ చెప్పడం సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. హాలీవుడ్ చిత్రాల ప్రేరణతో తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం దర్శకుడు ఇంటెన్స్‌గా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు. (Rahasyam Idam Jagath movie)
ఆర్టిస్ట్ విషయానికొస్తే.. హీరోగా రాకేష్ అభి పాత్రలో ఒదిగిపోయాడు. స్రవంతి క్యూట్‌గా కనిపించింది. సైంటిస్ట్‌గా అరు పాత్రలో మానస వీణ తనదైన శైలిలో నటించింది. భార్గవ్ నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. మిగతా పాత్రదారులు అందరూ తమ పాత్రల మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా చాలా ఉన్నతంగా ఉంది. పూర్తిగా ఈ చిత్రాన్ని అమెరికాలోనే తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ అమెరికాలో ఫారెస్ట్ లొకేషన్స్‌కి అందం తీసుకువచ్చింది. డార్క్ నైట్‌లో తీసిన సీన్స్‌లో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ బావుంది. కానీ కొన్ని సందర్భాల్లో మరీ లౌడ్‌గా అనిపించింది. ప్రొడక్షన్, సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. సైంటిఫిల్ థ్రిల్లర్‌కు ఎంత ఖర్చు చేయాలో అంతా చేశారు. కానీ సినిమా స్ర్కీన్‌ప్లే కన్‌ఫ్యూజ్ చేయడం సినిమాకు మైనస్ అనవచ్చు. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అనుభవలేమి అనేది కనిపించింది. సెంటిఫిక్ థ్రిల్లర్స్‌కు హోంవర్క్ ఎక్కువ చేయాలి. ప్రయత్నం మంచిదే కానీ తెరపై చూసినప్పుడు తికమకగా అనిపించడంతో ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇష్డపడేవారు ఈ సినిమా చూడొచ్చు.
ట్యాగ్ లైన్: అర్థం కావడానికి టైమ్ పడుతుంది!