My Dear Donga Movie Review: ఎవర్రా ఈ అమ్మాయి? ఇంత టాలెంటెడుగా వుంది

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:35 AM

అభినవ్ గోమాటం, షాలిని కొండేపూడి నటించిన 'మై డియర్ దొంగ' సినిమా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి షాలిని కథ, రచన చెయ్యడం ఆసక్తికరం. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

My Dear Donga Movie Review: ఎవర్రా ఈ అమ్మాయి? ఇంత టాలెంటెడుగా వుంది
My Dear Donga Movie Review

సినిమా: మై డియర్ దొంగ

నటీనటులు: అభినవ్ గోమాటం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మండూరి, రోహిత్ వర్మ దండు తదితరులు

సంగీతం: అజయ్ అరసాడ

ఛాయాగ్రహణం: ఎస్ఎస్ మనోజ్

కథ: షాలిని కొండేపూడి

దర్శకత్వం: బిఎస్ సర్వజ్ఞ కుమార్

నిర్మాత: మహేశ్వర్ రెడ్డి

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

గత వారం నుండి చాలా చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలై తరువాత ఓటిటి లో విడుదలవుతూ వున్నాయి. అలాగే రానున్న వారంలో కూడా చాలా చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలకి సిద్ధంగా వున్నాయి. ఇదిలా ఉంటే ఓటిటిలో కూడా నేరుగా కొన్ని చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి 'మై డియర్ దొంగ'. అభినవ్ గోమాటం, షాలిని కొండేపూడి ఇంకా చాలామంది కొత్తవాళ్లు నటించిన సినిమా ఇది. 'ఆహా' ఓటిటిలో విడుదలైంది. బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకుడు, ఈ సినిమాకి షాలిని కొండేపూడి కథని సమకూర్చింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

mydeardongstillone.jpg

My Dear Donga Story కథ:

సుజాత (షాలిని కొండేపూడి) ఒక డేటింగ్ యాప్ కి కాపీ రైటర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి విశాల్ (నిఖిల్ గాజుల) అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, అతను ఒక డాక్టరు. సుజాత ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాను అనే ఫీల్ లో ఉంటూ ఉంటుంది, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా, ఆమె ఫోను చేస్తే, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆసుపత్రిలో బిజీగా వున్నాను అంటూ అబద్దాలు చెపుతూ ఉంటాడు. తనని కావాలనే విశాల్ దూరం పెడుతున్నాడు అని అర్థం అవుతుంది సుజాతకి. సుజాతకి మంచి స్నేహితులు బుజ్జి (దివ్య శ్రీపాద) ఆమె బాయ్ ఫ్రెండ్ వరుణ్ (శశాంక్ మండూరి). ఇదిలా ఉండగా అర్థరాత్రి సురేష్ (అభినవ్ గోమాటం) దొంగతనానికి ఒక అపార్టుమెంటుకి వెళతాడు, బయటకి వెళ్లిపోయే సమయానికి ఆ ఇంటి యజమానురాలైన సుజాత వస్తుంది. దొంగైన సురేష్ తో కాసేపు మాట్లాడిన తరువాత సుజాతకి దొంగపై సదభిప్రాయం కలుగుతుంది. అదే సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి విశాల్, బుజ్జి, వరుణ్ అందరూ ఆమె ఇంటికి వస్తారు. సుజాత వాళ్ళకి సురేష్ ని తన చిన్ననాటి స్నేహితుడని పరిచయం చేస్తుంది. సురేష్ ఆ ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చాడు? సుజాత తన స్నేహితులకి సురేష్ ని ఎందుకు చిన్ననాటి స్నేహితుడని పరిచయం చేసింది? పోలీస్ స్టేషన్ లో విశాల్ ఏమని ఫిర్యాదు చేసాడు? ఇంతకీ చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే 'మై డియర్ దొంగ' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమాకి ఇందులో నటించిన షాలిని కొండేపూడి కథ సమకూర్చడం ఆసక్తికరం. సినిమా అయిపోయాక పేర్లు వేసేటప్పుడు కథ ఆమె రాసిందని చూడగానే తెలిసిన కధైనా బాగానే రాసారు అనిపించింది. 'మై డియర్ దొంగ' సినిమా కథ గొప్ప కథేమీ కాదు, ఇంతకు ముందు ఇలాంటి కథలు వచ్చాయి, కానీ చూపించండం కొంచెం కొత్తగా చూపించారు దర్శకుడు సర్వజ్ఞ కుమార్. ఒకమ్మాయి ఉంటుంది, ఆమెకి ఎక్కువగా స్నేహితులు వుండరు, కనీసం తిన్నావా, పడుకున్నావా, ఏమి చేస్తున్నావ్ అని అడిగేవాళ్ళు కూడా కరవుతారు. 'తిన్నావా' అని అడగొచ్చు కదా అమ్మా' అంటే, హోటల్ కి వెళ్ళింది తినడానికే కదా, మళ్ళీ తిన్నావా అని అడగటం ఎందుకు అని అంటుంది వాళ్ళమ్మ. ఆలా వున్న అమ్మాయి ఇంటికి రాగానే ఇంట్లో దొంగ కనిపిస్తాడు, ముందు కొంచెం భయపడినా, ఆ దొంగా 'మీరు ఏమైనా తిన్నారా' అని అడిగేసరికి సుజాత కరిగిపోతుంది. అప్పుడు దొంగతో స్నేహం కడుతుంది. అదే సమయంలో తన స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. సుజాతకి దొంగని బయటకి పంపించే ఉద్దేశం లేక, తన స్నేహితులకి అతను చిన్ననాటి స్నేహితుడని పరిచయం చెయ్యడం, అందుకోసం రిహార్సల్స్, తరువాత వాళ్ళు చెప్పే సన్నివేశాలన్నీ నవ్వు తెప్పిస్తాయి. దర్శకుడు ఇవన్నీ చాలా వినోదాత్మకంగా చూపించాడు.

mydeardongastill.jpg

సినిమా కూడా మామూలు సినిమాలా రెండున్నర గంటలు ఉండదు. ఒక గంటా 46 నిముషాలు మాత్రమే ఉంటుంది. కేవలం వినోదం కోసం తీసిన సినిమాల అనిపిస్తుంది, దర్శకుడు కూడా కేవలం వినోదాత్మక సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు, అలానే తీసాడు. ఆశ్చర్యకరం ఏంటంటే షాలిని కొండేపూడి ఈ సినిమాలో నటించడమే కాకుండా, కథ రచన కూడా ఆమే చెయ్యడం. చిన్న చిన్న మాటలు చక్కగా రాశారు. ముఖ్యంగా ఆ ఇంట్లో స్నేహితుల మధ్య జరిగే సన్నివేశంలో దొంగ ని పరిచయం చేసేటప్పుడు వచ్చే మాటలు బాగుంటాయి. 'దొంగలు మనుషులు కారా, మనుషులు దొంగలు కారా', 'దొంగలకు మనసుండదా, మనసుకి.. ' ఇలాంటివి బాగుంటాయి. పోలీసు స్టేషన్ లో సన్నివేశాలు కూడా అలరిస్తాయి. అయితే దొంగ అయిన సురేష్, సుజాత ఫ్లాష్ బ్యాక్ కథలు అంతగా అలరించవు, ఆసక్తిగా సాగవు. తల్లిదండ్రులతో సుజాత సన్నివేశాల్లో భావోద్వేగాలు అసలు లేవు. కథంతా సుజాత బార్ లో వుండే అబ్బాయికి వినిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఏమైంది అని ఆ అబ్బాయి అడగటం సుజాత చెప్పడం ఇలా కథంతా సాగుతూ ఉంటుంది. ఈ సినిమా కేవలం ఓటిటిలో సినిమా ప్రేక్షకులకి మాత్రం తీసినట్టుగా అనిపిస్తుంది.

shalinikondeputi.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో షాలిని కొండేపూడి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ అమ్మాయిని తెలుగు సినిమాల్లో ఎక్కడా చూసినట్టు లేదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె ఎంతో సహజంగా నటిస్తూ, అభినయిస్తూ సుజాత పాత్రలో లీనమై సినిమా మొత్తం తన భుజాలపై తీసుకెళ్లింది. ఈ సినిమాతో షాలిని అనే మంచి నటి పరిచయమైంది. నటనలోనే కాదు, కథ, రచనలో కూడా ఆమెది అందెవేసిన చెయ్యి అని నిరూపించింది. అభినవ్ గోమాటం మరో హైలైట్ అతను కూడా ఎంతో సహజంగా నటించి చూపించాడు. విశాల్ తన నటనతో ఆకట్టుకుంటాడు. దివ్య శ్రీపాద, శశాంక్, మిగతా నటీనటులు అందరూ పరవాలేదు అనిపించారు. అజయ్ అరసాడ సంగీతం పరవాలేదు, నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మాటలు బాగున్నాయి, ఛాయాగ్రహణం కూడా పరవాలేదు.

చివరగా, 'మై డియర్ దొంగ' సినిమా కథ పాతదే అయినా, దర్శకుడు కొత్తగా చెప్పడం, మాటలు సరదాగా ఉండటం, కొన్ని సన్నివేశాలు వినోదాత్మకంగా ఉండటంతో సరదాగా ఒకసారి చూసుకోవచ్చు. సినిమా మొత్తం షాలిని నటన హైలైట్ అనే చెప్పాలి.

Updated Date - Apr 22 , 2024 | 11:35 AM