Raju Yadav Movie Review: గెటప్ శ్రీను కథానాయకుడిగా నటించిన చిత్రం ఎలా ఉందంటే...

ABN , Publish Date - May 24 , 2024 | 04:54 PM

గెటప్ శ్రీను మొదటిసారి కథానాయకుడిగా నటించిన 'రాజు యాదవ్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Raju Yadav Movie Review:  గెటప్ శ్రీను కథానాయకుడిగా నటించిన చిత్రం ఎలా ఉందంటే...
Raju Yadav Movie Review

సినిమా: రాజు యాదవ్

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత కారత్, మిర్చి హేమంత్, చక్రపాణి ఆనంద్, ప్రశాంత్, సంతోష్, జబర్దస్త్ సన్నీ తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి

ఛాయాగ్రహణం: సాయి రామ్ ఉదయ్

నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి

దర్శకత్వం: కృష్ణమాచారి కె

విడుదల: 24 మే, 2024

రేటింగ్: 1 (ఒకటి)

-- సురేష్ కవిరాయని

జబర్దస్త్ కామెడీ షో తో బాగా ప్రాచుర్యం పొందిన సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఆ షోలో నటించిన చాలామంది కమెడియన్స్ గా, క్యారెక్టర్ నటులుగా చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళల్లో గెటప్ శ్రీను ఒకరు. అతను ఇప్పుడు కథానాయకుడిగా నటించిన 'రాజు యాదవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణమాచారి కె ఈ సినిమాకి దర్శకుడు, అంకిత కారత్ కథానాయకురాలు. యధార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అని ముందుగానే ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Raju-Yadav-3.jpg

Raju Yadav Story కథ:

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) మహబూబ్ నగర్ లో ఉంటాడు, స్నేహితులతో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉండగా బాలు అతని మూతికి తగులుతుంది. అతన్ని వెంటనే స్పెషలిస్టు డాక్టర్ దగ్గరకి కాకుండా, ఒక చిన్న డాక్టరు దగ్గరకు స్నేహితులు తీసుకు వెళితే అతను తనకి తోచిన విధంగా కుట్లు వేసి గాయం మానేట్టు చేస్తాడు. కానీ సరిగ్గా చికిత్స జరగకపోవటంతో నోరు మూసుకోదు. అందువలన రాజుకి నిద్రలో అయినా, మామూలుగా అయినా ఎప్పుడూ నవ్వుతూ వున్న మొహం మాత్రమే ఉంటుంది. అందువలన తెలియని వాళ్ళు అది చూసి అపార్ధం కూడా చేసుకుంటారు. ఒకసారి పోలీసు స్టేషన్ లో స్వీటీ (అంకిత కారత్) అనే అమ్మాయిని చూస్తాడు, చూసిన వెంటనే ఆమెపై మనసు పారేసుకుంటాడు, ఆమెని ప్రేమిస్తున్న అంటూ ఆమె వెనకాల తిరుగుతాడు. స్వీటీ హైదరాబాదు వచ్చి జాబ్ చేసుకుంటుంది, రాజు కూడా ఆమె కోసం హైదరాబాదు వచ్చి టాక్స్ డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. స్వీటీ పుట్టినరోజు నాడు రాజు ఆమెకి డైమండ్ రింగ్ బహుమతిగా ఇస్తాడు, అదే రోజు స్వీటీ, రాజు ని తన ఇంటికి ఆహ్వానిస్తుంది, ఇద్దరూ దగ్గరవుతారు. ఆ మర్నాడు ఆమె గురించి ఇంకో నిజం తెలిసిన రాజు ఖంగు తింటాడు. తర్వాత ఏమైంది, స్వీటీని రాజు పెళ్లి చేసుకున్నాడా, స్వీటీ ఏమి తప్పు చేసింది? రాజు జీవితం చివరికి ఏమైంది? ఇవి తెలియాలంటే 'రాజు యాదవ్' చూడండి.

Raju-Yadav-2.jpg

విశ్లేషణ:

ఇది ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన కథ అని సినిమా ప్రారంభంలోనే వేస్తారు. అటువంటప్పుడు ఈ కథ ఆసక్తికరంగా ఉంటుంది అని ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ అన్నిటికీ విరుద్ధంగా దర్శకుడు ఈ సినిమా కథని ఒక చౌకబారు సినిమాగా తీసి చూపించడం విడ్డూరం. యదార్ధ సంఘటన అని తెలిసినప్పుడు, దర్శకుడు, రచయిత కలిసి కూర్చొని కథని ఎంతో ఆసక్తికరంగా తీర్చి దిద్దాలి. కానీ ఒక మంచి కథని సినిమాగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి. రాజు అనేవాడు పోలీసు స్టేషన్ లో ఒక అమ్మాయిని చూసి ఆమె వెనకాల పడతాడు. అంతే మొదటి సగం అంతా ఆమె వెనకాల అతను తిరుగుతూ ఉండటమే, ఎటువంటి ఆసక్తికర సన్నివేశాలు కానీ, మాటలు కానీ వుండవు. కథ అసలు నడవక నత్తనడకలో అక్కడే వుండి ప్రేక్షకుడికి నిద్ర వచ్చేట్టు చేస్తాడు దర్శకుడు.

పోనీ రెండో సగంలో అయినా కథలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఏమీ ఉండదు. మొదటి సగం అంతా మహబూబ్ నగర్ అయితే, రెండో సగం అంతా హైదరాబాదులో ఆమె వెనకాల తిరుగుతాడు. అసలు ఈ కథలో దర్శకుడు ఏమి చెప్పాలని అనుకున్నాడో అది చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మొదట ఆమె తిరస్కరిస్తుంది, కానీ ఆ యువకుడు ఆమె వెంట పడతాడు, కేవలం స్నేహితులుగా ఉందాం అంటాడు, ఆమె సరే (అతని బాధపడలేక) అంటుంది. మధ్యలో ఆమె ఆ యువకుడిపై మనసు పారేసుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజే ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతను అంటేనే ఇష్టం అని, ఈ యువకుడికి చెపుతుంది. నా వెంట పడొద్దు అని చాలా ఖరాఖండీగా చెపుతుంది. కానీ యువకుడు ఆమెని చూడకుండా వుండలేకపోతాడు, అందుకని ఆమెని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని వెంటపడతాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఆ యువకుడు చివరికి ఏమయ్యాడు అనేది కథ.

Raju-Yadav-4.jpg

ఇలాంటి కథలు ఏమీ తెలుగులో కొత్తవి కాదు, కానీ తెలిసిన కథ అయినా కథ, కథనం కొంచెం ఆసక్తికరంగా ఉంటే పరవాలేదు, కానీ ఈ 'రాజు యాదవ్' లో ఆ రెండూ ఆసక్తికరంగా వుండవు. యదార్ధ సంఘటన అన్నారు, మరి దర్శకుడికి ఎటువంటి స్ఫూర్తితో తీశాడో అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మాయి తానేమి చేస్తోందో క్లియర్ గా వుంది, అబ్బాయిదే తప్పు. ఎందుకంటే అమ్మాయిని చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయి, ఆమె వద్దు అంటున్నా ఆమె వెనకాల పడి ఆమెని వేధించేలా అలా ఎలా తిరుగుతాడు. అలాంటివాడిని కథానాయకుడిగా ఎలా చూపించడానికి దర్శకుడు ప్రయత్నం చేశాడో అర్థం కావటం లేదు. సంఘటన యదార్ధం కావొచ్చు, కానీ అందులో ఆ యువకుడు కథానాయకుడు అయితే కాదు, ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేదు, ఎన్నోసార్లు తనవెంట పడవద్దు అని చాలా క్లియర్ గా చెప్పినా, వినకుండా ఆమె వెనకాల పడతాడు. అబ్బాయిదే తప్పు అని క్లియర్ గా తెలుస్తోంది, మరి దర్శకుడిగా అందులో ఏమి నచ్చిందో, ఎందుకు అతన్ని కథానాయకుడిగా చూపించాలి అనుకున్నాడో తెలీదు. అందుకే సినిమాలో కథానాయకుడికి అసలు సింపతీ రాదు. అందువలన ఈ సినిమా టోటల్‌గా రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది.

Raju-Yadav-5.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే గెటప్ శ్రీను తన పాత్రని కొంతవరకు బాగానే చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతని పాత్ర పూర్తిగా కథానాయకుడు అని అనలేము, కాదు అని చెప్పలేము, అలా ఉంటుంది. అంకిత కారత్ కథానాయకురాలిగా బలమైన పాత్రలేదు. దానికితోడు ఆమెకి, గెటప్ శ్రీను మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. వాళ్ళిద్దరికీ సరిగ్గా మ్యాచ్ కుదరలేదు. రాంగ్ పెయిర్ అనిపిస్తోంది. ఆమె కథానాయకురాలి పాత్రకి అసలు సరిపోలేదు. చక్రపాణి ఆనందరావు తండ్రిగా బాగా చేశాడు. ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది చక్రపాణి పాత్ర. మిగతా పాత్రలు అంతగా ఆకట్టుకోవు. సంగీతం, నేపధ్య సంగీతం అంతంత మాత్రమే ఉంటాయి. ఛాయాగ్రహణం పరవాలేదు. మాటలు కూడా అంతగా ఆకట్టుకోవు.

చివరగా, 'రాజు యాదవ్' కథ ఒక యదార్ధ సంఘటన ఆధారంగా అని చెప్పినప్పటికీ, దర్శకుడు కృష్ణమాచారి అది తెరపై చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రేక్షకులు సినిమా హాల్స్ కి రావటం లేదు, అందుకని మూసేస్తున్నాం అని ఒక పక్క థియేటర్స్ యజమానులు అంటున్న ఈ సమయంలో ఒక మంచి కథతో సినిమా రావాలి. 'రాజు యాదవ్' లాంటి సినిమాలు వస్తే, ఆ వచ్చే ఇద్దరు, ముగ్గురు ప్రేక్షకులు కూడా రావటం మానేస్తారు.

Updated Date - May 24 , 2024 | 05:10 PM