Ambajipeta Marriage Band movie review: మన వూర్లో జరిగే కథ, చూడాల్సిన సినిమా!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:17 PM

సుహాస్, శరణ్య, శివాని నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాకి కొత్త దర్శకుడు దుష్యంత్ ని పరిచయం చేస్తూ, నిర్మాత ధీరజ్ మొగిలినేని తీసిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Ambajipeta Marriage Band movie review: మన వూర్లో జరిగే కథ, చూడాల్సిన సినిమా!
Ambajipeta Marriage Band movie review

సినిమా: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

నటీనటులు: సుహాస్, శివాని నగరం, శరణ్య, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ భండారి తదితరులు

ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్ (Wajid Baig)

సంగీతం: శేఖర్ చంద్ర

రచన, దర్శకత్వం: దుష్యంత్ కటికనేని (Dushyanth Katikaneni)

నిర్మాత: ధీరజ్ మొగిలినేని

విడుదల: ఫిబ్రవరి 2, 2024

రేటింగ్: 3.5

-- సురేష్ కవిరాయని

యువ నటుడు సుహాస్ ఇంతకు ముందు 'కలర్ ఫోటో' అనే సినిమాలో కథానాయకుడిగా చేసేడు. అది ఓటిటి లో నేరుగా విడుదలైంది, జాతీయ అవార్డు గెలుచుకుంది. తరువాత 'రైటర్ పద్మభూషణ్' అనే సినిమాలో కూడా కథానాయకుడిగా చేసాడు, ఆ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది, కానీ నిర్మాతకి డబ్బులు వచ్చాయి అన్నారు. ఇప్పుడు అదే సుహాస్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు అతని రెండు సినిమాలకి ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం అయితే, ఈ సినిమాతో దుష్యంత్ అనే ఇంకో దర్శకుడు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి గీత ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ వెనకాల నిలుచుంది. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకి నిర్మాత. ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ బన్నీ వాస్, దర్శక నిర్మాత వెంకటేష్ మహాలు ఈ సినిమాకి సమర్పకులుగా వున్నారు. ఈ సినిమా కథా నేపధ్యం దర్శకుడు దుశ్యంత్ తన స్వీయ అనుభవాలు, అలాగే తన ఊర్లో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తీశానని విడుదలకి ముందు చెప్పారు. నటి శరణ్య ఇందులో ఇంకో ప్రధాన పాత్ర పోషించింది, మరి ఈ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా ఎలా వుందో చూద్దాం.

suhasambajipetamarriageband.jpg

కథ:

ఈ కథ ఒక పీరియడ్ డ్రామా అంటే 2007 ప్రాంతంలో అంబాజిపేట అనే గ్రామంలో జరిగినది. ఆ ఊర్లో పెద్ద మనిషిగా వున్న వెంకట్ (నితిన్ ప్రసన్న), అదే వూర్లో చాలామందికి అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకుంటూ ఉంటాడు. ఆలా వూర్లో చాలామందిని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతని దగ్గర డబ్బులు తీసుకున్న ఆ ఊరి గ్రామస్థులు కొందరు అతను అసలు డబ్బులు ఎప్పుడు కట్టమంటాడా అని అతనికి భయపడుతూ బతుకుతూ ఉంటారు. అదే గ్రామంలో మల్లి (సుహాస్) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. అతను అక్క పద్మ (శరణ్య) కవలలు, పద్మ చదువుకున్నది, అందుకని అదే ఊర్లో వున్న స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంటుంది. పద్మకు వుద్యోగం ఇప్పించింది వెంకట్‌ అని, అతనికి పద్మకి మధ్య ఏదో సంబంధం ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. ఇదిలా ఉండగా మల్లి, వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ) ని ప్రేమిస్తాడు, ఆమెకి కూడా మల్లి అంటే ఇష్టం. మల్లి, పద్మ ల పుట్టినరోజు నాడు ఒక సంఘటన జరుగుతుంది, అది ఇంకో సంఘటనకి దారితీస్తుంది. ఇక ఇక్కడ నుండి కథ మొదలవుతుంది. ఆరోజు ఏమైంది, డబ్బు, పరపతి, అధికులం అనుకున్న వెంకట్ ఏమి చేసాడు, అతను చేసిన పనికి మల్లి, పద్మలు ఎలా ప్రతిస్పందించారు, లక్ష్మి, మల్లిల ప్రేమ సఫలం అయిందా, చివరకి ఈ సంఘటనలు అన్నీ ఎటు దారితీసాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ambposter.jpg

విశ్లేషణ:

ఈమధ్య కాలంలో 'బలగం' తరువాత సహజసిద్ధమైన కథతో, సన్నివేశాలతో, తెరమీద నటులు కాకుండా ఆయా పాత్రలు మాత్రమే కనపడే సినిమా ఏదైనా వచ్చింది అంటే అది ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మాత్రమే అని చెప్పొచ్చు. దర్శకుడు దుష్యంత్ తన జీవితంలో, అలాగే తన చుట్టుపక్కల జరిగే సంఘటనల ఆధారంగా సినిమాకోసం కొంచెం స్వేచ్చని తీసుకొని రాసిన కథ అని ఈ సినిమా విడుదలకి ముందు చెప్పారు. ఈమధ్య కాలంలో చాలామంది దర్శకులు పాన్ ఇండియా మోజులో పడి, ఎక్కడి కథలో ఇక్కడికి తీసుకు వచ్చి, దానికి ఎక్కడి నటులనో అత్యధిక పారితోషికాలు ఇచ్చి నటింప చేసి, చివరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉసూరుమనేట్టు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెంపపెట్టులా వుండే కథే ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. మన చుట్టుపక్కల జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని కథలు రాసి అవి అందరికీ చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు, హర్షిస్తారు అని చక్కగా ఈ సినిమాతో నిరూపించాడు దుష్యంత్.

దర్శకుడు దుష్యంత్ ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసుకున్న కథ వెండితెర మీద అంతే సహజంగా చూపించడంలో సఫలం అయ్యాడు. ఈ సినిమాతో పరిశ్రమకి ఇంకో కొత్త యువ దర్శకుడు పరిచయం అయ్యాడు అనే చెప్పాలి. సమాజంలో అధికులం, డబ్బు, పరపతి, అహంకారంతో విర్రవీగే ఊరి పెద్దమనిషిగా చెలామణి అయ్యే అతనిని బయపడి బతుకుతున్న ఆ ఊరి ప్రజలు, ఓపిక నశించిపోయి ఎదురుతిరిగే కొంతమంది యువకులు, ఇలాంటి కథలు ఎన్నో గ్రామాల్లో జరిగాయి. విన్నాం కూడా. ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' కథ కూడా అటువంటిదే, కొత్తదేమీ కాదు, కానీ దర్శకుడు ఈ కథని చాలా సహజంగా కొత్తగా చూపించాడు. ఇది ఒక ప్రేమ కథ అనుకుంటే పొరపాటే, ఒక యువతి తన ఆత్మభిమానం కోసం పోరాటం చేసే కథ. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్నీ ఎక్కడ నాన్చకుండా చాలా చక్కగా సహజంగా చూపించాడు. ముఖ్యంగా రెండో సగంలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రేక్షకుల హృదయాల్ని కట్టి పడేస్తాయి.

ambstill.jpg

ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా పద్మ పాత్ర వేసిన శరణ్య మీదే సాగుతుంది. ఆమె ఈ సినిమాకి హీరో అని చెప్పొచ్చు. ఆమె చూపించిన నటన, ప్రతిభ ముఖ్యంగా పోలీసు స్టేషన్ లో ఆమె విలన్ ని కాలితే తన్నే సన్నివేశం అయితే రోమాలు నిక్కబొడుచుకునేట్టు చేస్తుంది. అలాంటివే ఒక రెండు మూడు సన్నివేశాలు ఆమె చేసినవి వున్నాయి. ఈమధ్య కాలంలో ఒక బలమైన మహిళా పాత్ర వచ్చిన సినిమా ఏదైనా వుంది అంటే, అది శరణ్య పాత్ర అని చెప్పొచ్చు. ఆత్మాభిమానం కోసం తను ఎటువంటి పోరాటానికైనా సిద్ధం అని చూపించింది. అసలు ఆమెకి, నితిన్ ప్రసన్నకి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకి ప్రేక్షకుల్లోంచి చప్పట్లు, ఈలలు వేశారంటే ఆ సన్నివేశాల్లో ఆమె ఎంత సహజంగా నటించింది, దర్శకుడు ఎంత సహజంగా ఆ సన్నివేశాలని చిత్రీకరించారో అర్థం అవుతుంది. చావడానికైనా సిద్ధం కానీ ఆత్మాభిమానం మాత్రం చంపుకొని అనే ధీరోదాత్తమైన మహిళగా చేసిన శరణ్య ఈ సినిమాకి హీరో. ఇటువంటి కథతో చాలాకాలం తరువాత ఒక మంచి సినిమా తీసిన దర్శకుడు దుష్యంత్ కి క్రెడిట్ మొత్తం చెందుతుంది.

ఇక ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన శేఖర్ చంద్ర చాలా అద్భుతమైన నేపధ్య సంగీతం సమకూర్చాడు అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలకి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారంటే దానికి ఒక ప్రధాన కారణం శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపధ్య సంగీతం రెండూ బాగుంటాయి. అలాగే ఛాయాగ్రహణం ఈ సినిమా కథకి అనుగుణంగా ఉంటుంది, ఆ వూరు, ప్రజలు, సన్నివేశాలు సహజంగా కనపడటానికి ఛాయాగ్రహణం ఎంతో ఉపయోగపడింది. పద్మకి రాసిన మాటలు హత్తుకుంటాయి, ఆలోచింపచేస్తాయి. గ్రామీణ వాతావరణంలో వచ్చిన సినిమాలు వున్నా, ఒక మహిళా పాత్రని ఇంత బలంగా చూపించడం ఈమధ్య కాలంలో ఈ సినిమాలోనే చూపించాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి, ఒకరికొకరు చంపుకోవటం కాదు పరిష్కారం, మనం చంపితే హంతకుడు అంటారు అనే మాటతో బాగా చూపించాడు.

ambajipetamarriagebandstill.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సుహాస్ మరోసారి తన ప్రతిభా పాటవాలని చూపించాడు. తను ఎంచుకున్న పాత్రలని చాల జాగ్రత్తగా ఎంచుకుంటూ నటనలో తన ప్రతిభ చూపించడానికి వీలుగా ఉండేట్టు చూసుకుంటున్నారు. ఇందులో గుండు కూడా చేయించుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సినిమా అతని కెరీర్ లో ఇంకో మైలురాయి అవుతుంది. ఇక శరణ్య అయితే పద్మ పాత్రలో ఇమిడిపోయింది, ఎంతో అద్భుతంగా చేసింది. ఈమె చేసినవి తక్కువ సినిమాలు అయినా, ప్రతి సినిమాలో ఆమె మంచి ప్రతిభ కనపరుస్తుంది, కానీ ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' లో ఆమె చేసిన ఈ పద్మ పాత్ర ఆమెని ఎక్కడికో తీసుకువెళుతుంది. ఆమె చేసిన పాత్రకి గాను ఆమె అవార్డు రావాల్సిందే, అంతగా చేసింది ఆమె. 'పుష్ప' లో కేశవ పాత్ర తరువాత జగదీశ్ మరో మంచి పాత్రలో కనపడతాడు, సంజీవ్ గా ఒదిగిపోయాడు. గోపరాజు రమణ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. కథానాయకురాలి శివాని మొదటి సినిమా అయినా చక్కని ప్రతిభ కనపరచి ఎక్కడా కొత్తమ్మాయిలా కాకుండా అనుభవం వున్న నటిలా చేసింది. తెలుగమ్మాయి ఈ సినిమాతో పరిచయం అవటం సంతోషకరం. నితిన్ ప్రసన్న విలన్ గా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. పోలీసు స్టేషన్ లో శరణ్య కాలుతో తన్నిన సన్నివేశాన్ని ఒప్పుకున్నాడు అంటేనే అతను నటనకి, తన పాత్రకి ఎంతటి ప్రాముఖ్యం ఇచ్చాడో అర్థం అవుతుంది. ఇక మిగతా పాత్రలో అందరూ ఎంతో సహజంగా నటిస్తూ మెప్పించారు. అక్కడక్కడా కొంత సాగదీత వున్నా, వెంటనే ఒక మంచి సన్నివేశంతో ఉత్తేజం తెప్పిస్తాడు దర్శకుడు. ఇటువంటి చిన్న సినిమాకి వెనకాల వుండి నడిపించిన నిర్మాత ధీరజ్ మొగిలినేని, గీత ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలకి అభినందనీయం.

చివరగా, 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా ఎంతో సహజ సిద్ధంగా, ఎక్కడో ఇలా జరిగే ఉంటుంది అని అనుకునే సంఘటనలతో రాసిన కథ. దర్శకుడు దుష్యంత్ కి పూర్తి మార్కులు, అలాగే నటీనటులు అందరూ ఎంతో సహజంగా నటిస్తూ, ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేట్టు చేశారు. ముఖ్యంగా శరణ్య పాత్రకి ఈలలు చెప్పట్లు, సుహాస్ మరో అద్భుతమైన పాత్ర పోషించాడు. తప్పక చూడాల్సిన సినిమా ఇది. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలతో మన తెలుగు కథని, భావోద్వేగమైన సన్నివేశాలతో ఎలా ప్రేక్షకుల మెప్పు పొందాలో చూపించిన సినిమా ఇది.

Updated Date - Feb 02 , 2024 | 12:17 PM