ఎన్నికల ప్రయోజనం కోసమే యాత్ర 2

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:32 AM

లోకసభ ఎన్నికల తర్వాతే రాజకీయ కథాచిత్రం ‘యాత్ర 2’ను సెన్సార్‌ చేయాలని నిర్మాత, పంపిణీదారుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నట్టి కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్‌ పర్సన్‌కు, హైదరాబాద్‌ ప్రాంతీయ సెన్సార్‌ అధికారికి...

ఎన్నికల ప్రయోజనం కోసమే యాత్ర 2

లోకసభ ఎన్నికల తర్వాతే రాజకీయ కథాచిత్రం ‘యాత్ర 2’ను సెన్సార్‌ చేయాలని నిర్మాత, పంపిణీదారుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నట్టి కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్‌ పర్సన్‌కు, హైదరాబాద్‌ ప్రాంతీయ సెన్సార్‌ అధికారికి లేఖ రాశారు. అంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌. పార్టీకి, ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఈ సినిమా తీశారని నట్టి కుమార్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత సోనియా గాంధీకి వ్యతిరేకంగా తీయడంతో పాటు వారి పాత్రలను కించపరుస్తూ వ్యంగ్యంగా ఈ సినిమాలో చిత్రీకరించారని ఆయన వివరించారు. తాజాగా పబ్లిసిటీ కోసం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ఇందుకు ఓ ఉదాహరణ అనీ నట్టి కుమార్‌ వెల్లడించారు. సోనియా గాంధీని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుని చులకన చేసి చూపించడం వెనుక త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనం పొందాలన్న ఉద్దేశం కనిపిస్తోందని తెలిపారు. సెన్సార్‌ ఇంకా చేయకుండానే ఫిబ్రవరి 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారనీ, సెన్సార్‌ మార్గదర్శకాలకు ఇది విరుద్ధమనీ, దీనిపై కూడా చర్య తీసుకోవాలని సెన్సార్‌ బోర్డ్‌ను కుమార్‌ కోరారు. చిత్రంలోని పాత్రలు ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, వ్యంగ్యంగా, అవమానకరంగా , కుట్రపూరితంగా లేకుండా చూసి సెన్సార్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా లోక్‌సభ ఎన్నికల ముందు ‘యాత్ర 2’ విడుదలైతే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతూ, . ఇలా తమ నాయకులను కించపరిచే సన్నివేశాలతో ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తే లీగల్‌గా ముందుకు వెళ్తానని నట్టి కుమార్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:32 AM