Record break : అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తుంది
ABN , Publish Date - Feb 19 , 2024 | 03:01 AM
ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘రికార్డ్ బ్రేక్’ అని నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఆయన దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘రికార్డ్ బ్రేక్’ చిత్రం టీజర్..
ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘రికార్డ్ బ్రేక్’ అని నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఆయన దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘రికార్డ్ బ్రేక్’ చిత్రం టీజర్, ట్రైలర్‌లను ఆదివారం ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ‘ ఈ సినిమాలో హీరో అంటూ ఎవరూ లేరు ఇందులో పని చేసిన ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. వీళ్లే హీరోలు. నాకున్న అనుభవంతో మంచి కథ తీసుకుని సమాజానికి ఉపయోగపడే సినిమా అందించాలనే తపనతో ఐదేళ్లు కష్టపడి ‘రికార్డ్ బ్రేక్’ తీశాం. ఈ చిత్రానికి ఆ టైటిల్ కరెక్ట్ అని చూసిన వాళ్లంతా చెప్పారు. తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తుంది. కచ్చితంగా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఇప్పుడు వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇద్దరు అనాధలు దేశానికి గర్వకారణంగా ఎలా ఎదిగారు అనే కథతో ఈ సినిమా తీశాం. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను ఇందులో చూపిస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘మంచి మనసున్న వ్యక్తి, ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసరావుగారు. సామాజిక కథాంశంతో ఆయన రూపొందించిన ‘రికార్డ్ బ్రేక్’ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ రగ్దా, నటి సత్యకృష్ణ, హీరోల్లో ఒకరైన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.