ఈ రికార్డుని బ్రేక్‌ చేసేదెవరో?

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:15 AM

గత ఏడాదిలో అనూహ్య విజయాలను అందుకొని అరుదైన రికార్డులను సృష్టించిన హీరో షారుక్‌ ఖాన్‌. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏహీరోకీ లేని రికార్డు 2023లో షారుక్‌ వశమైంది. అమితాబ్‌ తర్వాత బాలీవుడ్‌లో...

ఈ రికార్డుని బ్రేక్‌ చేసేదెవరో?

గత ఏడాదిలో అనూహ్య విజయాలను అందుకొని అరుదైన రికార్డులను సృష్టించిన హీరో షారుక్‌ ఖాన్‌. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏహీరోకీ లేని రికార్డు 2023లో షారుక్‌ వశమైంది. అమితాబ్‌ తర్వాత బాలీవుడ్‌లో లాంగ్విటీ ఉన్న సూపర్‌స్టార్‌గా అవతరించారు షారుఖ్‌. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా, బాక్సాఫీస్‌ బాద్‌షాగా అభిమానులచే కితాబులందుకున్నారు. అయితే.. అంతటి సూపర్‌స్టార్‌కి కూడా బ్యాడ్‌ పిరియడ్‌ తప్పలేదు. దాదాపు నాలుగేళ్లు విజయం షారుక్‌పై సీతకన్నేసింది. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్‌. షారుఖ్‌ పని అయిపోయిందని, ఇక రిటైర్‌ అవ్వడం బెటరంటూ వ్యంగ్యభాషణలు కూడా వినిపించాయి. అయితే సింహం రెండడుగులు వెనక్కు వేసేది వందడుగులు దూకడానికే అన్న చందాన ‘పఠాన్‌’గా బాక్సాఫీ్‌సపై విరుచుకుపడ్డారు షారుఖ్‌. 2023 జనవరి 25న విడుదలైన ‘పఠాన్‌’ బాలీవుడ్‌ రికార్డులను తిరిగి రాసింది. వెయ్యికోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టి బాద్‌షా క్రేజ్‌ ఇసుమంత కూడా తగ్గలేదని నిరూపించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపిక పదుకొణే, జాన్‌ అబ్రహం, డింపుల్‌కపాడియా కీలక పాత్రలు పోషించగా, సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

హీరోలకు ఏడాదికి ఒక హిట్‌ రావడమే గగనమైన నేటి రోజుల్లో అదే ఏడాది సెప్టెంబర్‌ 7న ‘జవాన్‌’గా మరోసారి బాక్సాఫీ్‌సపై దాడి చేశాడు కింగ్‌ఖాన్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడొందలకోట్ల భారీ బడ్జెట్‌తో రూపొంది దాదాపు 1200కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ఫారుక్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా, తండ్రి సరసన దీపిక పదుకొణే, కొడుకు సరసన నయనతార కథానాయికలుగా నటించారు. విజయ్‌సేతుపతి ప్రతినాయక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలకపాత్ర పోషించారు. అనిరుథ్‌ సంగీతం సమకూర్చారు. దక్షిణభారతానికి చెందిన సినీకళాకారులు ఎక్కువమంది పనిచేసిన ఈ సినిమా షారుక్‌ కెరీర్‌లోనే వసూళ్ల పరంగా నంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది.

2023 డిసెంబర్‌ 21న ‘డంకీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు షారుక్‌ఖాన్‌. రాజ్‌కుమార్‌ హీరాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మూడొందలకోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టిందని తెలిసింది. తాప్సీ పన్ను, బొమ్మన్‌ ఇరానీ, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం వినోదభరితంగానేగాక సందేశాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.

ఈ ఏడాది మొత్తంగా చూస్తే తన మూడు సినిమాలతో 2500కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టి భారతీయ చలనచిత్ర చరిత్రలో రికార్డ్‌ సృష్టించారు షారుక్‌ఖాన్‌. ఇది ఏ హీరోకీ లేని రికార్డు. ఒకే ఏడాది మూడు సినిమాలు విడుదల అవ్వడం.. మూడూ విజయాలు సాధించడం.. వేలకోట్ల వసూళ్లను రాబట్టడం ఇది కనీవినీ ఎరుగని చరిత్ర.

ఈ విషయంపై ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేశ్‌ బాలా తన బ్లాగ్‌లో ‘ఒక కేలండర్‌ సంవత్సరంలో తన సినిమాల ద్వారా 2500కోట్ల రూపాయల స్థూల ఆదాయాన్ని బాక్సాఫీ్‌సకి అందించిన తొలి భారతీయ నటుడు ఫారుక్‌ఖాన్‌’ అంటూ అభివర్ణించారు. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం. నిజానికి రికార్డులు అనేవి తయారయ్యేది బ్రేక్‌ అవ్వడానికే. ఈ రికార్డు కూడా తప్పక బ్రేక్‌ అయి తీరుతుంది. ఎవరి చేతిలో అనేది కాలం చేతిలో ఉంది.

Updated Date - Jan 02 , 2024 | 05:15 AM