Well done to Senior Heroines : సీనియర్లూ శభాష్‌

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:33 AM

ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్లుగా పదేళ్ల పాటు కొనసాగటమే గొప్ప. 20 ఏళ్ల వయసులో కథానాయికలుగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మల్లో చాలామంది 40వ పడికి చేరువలో మాత్రం...

ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్లుగా పదేళ్ల పాటు కొనసాగటమే గొప్ప. 20 ఏళ్ల వయసులో కథానాయికలుగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మల్లో చాలామంది 40వ పడికి చేరువలో మాత్రం హీరో అక్క, వదిన, తల్లి లాంటి సైడ్‌ క్యారెక్టర్లకు మారుతున్నారు. కానీ బాలీవుడ్‌లో కొందరు కథానాయికలు మాత్రం దీనికి మినహాయింపుగా నిలుస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నా ఇంకా హీరోయిన్ల వేషాలతోనే అభిమానులను అలరిస్తున్నారు. హీరోలతో రొమాన్స్‌ చేసే చిలిపి పాత్రలు లాంటివి చేయకపోయినా కథను ముందుకు నడిపించే దమ్మున్న పాత్రలు చేస్తూ శభాష్‌ సీనియర్స్‌ అనిపించుకుంటున్నారు.

వెండితెరకు తరగని అందం

1997లో తమిళ సినిమా ‘ఇరువర్‌’ (ఇద్దరు)తో హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చారు విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌. హీరోయిన్‌గా 25 ఏళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. వివాహమైనా, ఓ పాపకు జన్మనిచ్చినా ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు అపజయం పాలైనా తన అభిరుచికి అద్దం పట్టే సినిమాలు చేస్తూ వచ్చారు. గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సిరీస్‌లో నందిని పాత్రలో తన అందం, అభినయంతో ప్రత్యేకాకర్షణగా నిలిచారు.


రూ. 150 కోట్ల చిత్రంతో...

2000 సంవత్సరంలో వచ్చిన ‘రెఫ్యూజీ’ చిత్రంతో కథానాయికగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు కరీనాకపూర్‌ ఖాన్‌. ఆ తర్వాత బాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ నటించి లెక్కకు మిక్కిలి హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కథానాయికగా ఆమె వయసు 24 ఏళ్లు అయినా ఇప్పటికీ తన చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆమె లీడ్‌రోల్‌ పోషించిన ‘క్రూ’ చిత్రం ఏకంగా రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓ వైపు బాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడుతుంటే ఈ లో బడ్జెట్‌ చిత్రం మాత్రం ఆశ్చర్యపరుస్తూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆమె ‘సింగం ఎగైన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సంచలన అత్యాచార కేసు ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలోనూ కరీనా లీడ్‌ రోల్‌లో కనిపించనున్నానే టాక్‌ వినిపిస్తోంది.

జోరు చూపుతున్న టబు

‘క్రూ’ చిత్రంలో కీలకపాత్ర పోషించిన మరో సీనియర్‌ హీరోయిన్‌ టబు సైతం తన జోరు చూపుతున్నారు. బాలనటిగా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆమె తెలుగు చిత్రం ‘కూలీ నంబర్‌ 1’ తో హీరోయిన్‌గా మారారు. ఈ చిత్రం విడుదలై దాదాపు 35 ఏళ్లు కావొస్తోంది. ఓ వైపు లీడ్‌రోల్స్‌ చేస్తూనే మధ్యమధ్యలో హీరోయిన్‌గానూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆమె అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఆరోం మే కహాన్‌ దమ్‌ థా’చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తున్నారు. వారిద్దరి కలయికలో వస్తున్న పదో చిత్రం ఇది.


వెండితెర రాణి

కభీ ఖుషీ కభీ ఘమ్‌, ప్యార్‌ దీవానా హోతా హై లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలతో హీరోయిన్‌గా మెప్పించారు రాణీ ముఖర్జీ. 1996లోనే ఓ బెంగాలీ చిత్రంతో కథానాయికగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాణీ ముఖర్జీ ఇప్పటికీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో సత్తా చాటుతున్నారు. ‘మర్దానీ 2, బంటీ ఔర్‌ బబ్లీ 2, మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ లాంటి వరుస చిత్రాల్లో లీడ్‌రోల్స్‌ పోషించి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఆమె సోనాలీ బోస్‌ దర్శకత్వంలో మహిళా ప్రాధాన్య చిత్రం చేయబోతున్నారు.

మెరుపు కలల జోడీ మరోసారి

అరవింద్‌ స్వామి, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ‘మెరుపు కలలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కాజోల్‌. ‘బాజీఘర్‌’, ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు బాలీవుడ్‌లోని ఆమె విజయ పర ంపరలో కొన్ని. అజయ్‌ దేవ్‌గణ్‌తో పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో ప్రభుదేవా, కాజోల్‌ జంటగా ఓ చిత్రం రాబోతోంది. 27 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్టయింది. సంయుక్తా మీనన్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.


తగ్గని హవా

హిందీ చిత్రసీమలో 90వ దశకంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి అగ్ర కథానాయికగా ఎదిగారు మాధురీ దీక్షిత్‌. ‘ఖల్నాయక్‌, హమ్‌ ఆప్కే హై కౌన్‌, బేటా, రాజా’ తదితర చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. మంచి డాన్సర్‌గానూ తనదైన ముద్ర వేశారు. పెళ్లయ్యాక సినిమాలు చేయడం తగ్గించారు మాధురీ. ప్రస్తుతం ఆమె ‘ఢమాల్‌ 4లో’ లీడ్‌రోల్‌లో నటించేందకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ టాక్‌. ఇంకా రవీనాటాండన్‌, జుహీచావ్లా, మనీషా కోయిరాలా, అమీషా పటేల్‌, విద్యాబాలన్‌ లాంటి సీనియర్‌ హీరోయిన్లు కథానాయిక ప్రాధాన్య చిత్రాలతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 01:33 AM