Multi starrer Web Series: ఒక సిరీస్‌... అనేక మంది తారలతో!

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:57 AM

ఒక సినిమాను ఇద్దరు దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అనేక పాత్రలతో వైవిధ్యమైన కథలను కలుపుతూ ఒకే సినిమాగా తీయడం కూడా తెలిసిందే. కానీ విభిన్న కథలున్న ఒకే సినిమాను లేదా వెబ్‌ సిరీస్‌ను...

ఒక సినిమాను ఇద్దరు దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అనేక పాత్రలతో వైవిధ్యమైన కథలను కలుపుతూ ఒకే సినిమాగా తీయడం కూడా తెలిసిందే. కానీ విభిన్న కథలున్న ఒకే సినిమాను లేదా వెబ్‌ సిరీస్‌ను పలువురు దర్శకులు తీస్తే ఎలా ఉంటుంది?. లాక్‌ డౌన్‌ టైమ్‌లో మొదలైన ఈ సరికొత్త పంథా.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ పాపులర్‌ ఫార్ములాగా మారింది. అదే ఆంతాలజీ. వెబ్‌ సిరీస్‌ల్లో ఎక్కువగా ఈ ట్రెండ్‌ కనిపిస్తుంది. అవేమిటో తెలుసుకుందాం.

లాక్‌డౌన్‌లో మొదటిసారిగా ఈ ఆంతాలజీ సిరీ్‌సను మన దక్షిణాది మేకర్స్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెట్రిమారన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, విఘ్నేష్‌ శివన్‌, సుధా కొంగర దర్శకత్వం వహించిన ‘పావై కథైగల్‌’ (paavai kadhaigal) 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) విడుదలైంది. పరువు హత్యలు అంతర్భాగంగా విభిన్న కథలతో నాలుగు భాగాలుగా ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌(Prakash raj), సాయి పల్లవి, అంజలి నటించారు. సమాజంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా కల్పనను జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్‌ అందరినీ గగుర్పాటుకు గురిచేసింది.


77-CJ.jpg

ప్రేమలోని డార్క్‌ సైడ్‌

ఆ తర్వాత తెలుగులో తొలి ఆంతాలజీ సిరీస్‌ ‘పిట్టకథలు’. (Pitta kathalu) ఇప్పుడు కల్కీ చిత్రంతో ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నాగ్‌ అశ్విన్‌ మరో ముగ్గురు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌ రెడ్డి, బి.వి. నందినీ రెడ్డి ఈ సిరీస్ తెరకెక్కించారు. నాలుగు భాగాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో 2021లో విడుదలైన ఈ సిరీస్ లో జగపతిబాబు, సత్యదేవ్‌, లక్ష్మీ మంచు, శ్రుతీ హాసన్‌, ఈషా రెబ్బా నటించారు. ప్రేమలోని చీకటి కోణాల్ని.. ప్రేమికుల మధ్యన ఉండే విభిన్న పార్శ్వాలను టచ్‌ చేసిన ఈ ఆంతాలజీకి అప్పట్లో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

నవరసాలతో ‘నవరస’ (Nava Rasa)

నవరసాలను తెరపై పలికించడమే లక్ష్యంగా.. తొమ్మిది మంది తమిళ దర్శకులు.. తొమ్మిది భాగాలుగా 2021లో వచ్చిన సిరీస్‌ ‘నవరస’. ప్రియదర్శన్‌(Priyadarshi) , గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌, అరవింద్‌స్వామి, బిజోయ్‌ నంబియార్‌, కార్తీక్‌ నరేన్‌, సర్జున్‌ కే.ఎమ్‌, రతీంధ్రన్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీ్‌సకు దర్శకుడు మణిరత్నంతో పాటు పలువురు కథలు అందించారు. సూర్య, విజయ్‌ సేతుపతి, సిద్ధార్థ్‌, అరవింద స్వామి, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, యోగిబాబు, రేవతి, పార్వతి తిరువోతు నటించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


7777-CJ.jpg

ఆరు విభిన్న ప్రేమ కథలతో..

న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన ‘మోడరన్‌ లవ్‌’ (Modern Love) ఆర్టికల్స్‌ ఆధారంగా తెలుగు, తమిళంలో ‘మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌’, ‘మోడరన్‌ లవ్‌ చెన్నై’ సిరీస్ లను అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తెరకెక్కించారు. 2022లో విడుదలైన ‘మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌’.. 2023లో ‘మోడరన్‌ లవ్‌ చెన్నై’ రెండూ ఆరు భాగాలుగా వచ్చాయి. రెండింటిలోనూ హైదరాబార్‌, చెన్నై నగరాల్లో వయసు, కుల మతాలకు అతీతంగా జరిగే ఆరు ఆసక్తికరమైన ప్రేమ కథలే కథాంశం. తెలుగు సిరీస్ కు నగేశ్‌ కుకునూర్‌, వెంకటేశ్‌ మహా, ఉదయ్‌ గుర్రాల, దేవిక బహుధానం దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రేవతి, నిత్యామీనన్‌, రీతూ వర్మ నటించారు. తమిళ సిరీస్‌ ‘మోడరన్‌ లవ్‌ చెన్నై’ సిరీ్‌సకు భారతీరాజా, బాలాజీ శక్తివేల్‌, త్యాగరాజన్‌ కుమార్‌రాజా, రాజు మురుగన్‌, క్రిష్ణ కుమార్‌, అక్షయ్‌ సుందర్‌ దర్శకత్వం వహించారు. అశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు.

బాలీవుడ్‌లో ఈ ఆంతాలజీ (anthology) సిరీస్‌ ట్రెండ్‌ ఎప్పుడో మొదలై.. సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటివరకూ అక్కడ పదుల సంఖ్యలో ఇలాంటివి తెరకెక్కగా.. అధిక భాగం ఆకట్టుకున్నాయి. సౌత్‌లో ఈ తరహా ప్రయత్నాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. మంచి కంటెంట్‌తో.. అనేక మందికి వినోదం అందించే దిశగా.. దక్షిణాది మేకర్స్‌ తరచూ ఇలాంటి ప్రయత్నాలతో ముందుకు వస్తే.. కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులు విజయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.


వాసుదేవన్‌ నాయర్‌కు నివాళిగా...

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకుడు, రచయిత ఎమ్‌.టి.వాసుదేవన్‌ నాయర్‌ రచించిన షార్ట్‌ స్టోరీస్‌ ఆధారంగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘మనోరథంగళ్‌’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. కారణం కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌ లాల్‌, ఫహాద్‌ ఫాజిల్‌, పార్వతి తిరువోతు, అపర్ణ బాలమురళి, మధుబాల వంటి ప్రముఖ తారాగణం నటించడమే. ఎనిమిది మంది దర్శకులు దీనికి దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఎమ్‌.టి.వాసుదేవన్‌ నాయర్‌కు, మలయాళ చిత్ర పరిశ్రమ మహోన్నత సంస్కృతికి ఇచ్చే నివాళి అని కమల్‌హాసన్‌ తెలిపారు. ఆగస్టు 15న జీ5లో ఇది విడుదలవుతుంది.

Updated Date - Jul 23 , 2024 | 09:38 AM