సరికొత్త బాలకృష్ణను చూస్తారు

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:11 AM

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకూ మహారాజ్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలవుతోంది...

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకూ మహారాజ్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. బాలకృష్ణ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. విజువల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఊహించిన దాని కంటే గొప్పగా ఉంటాయి. దాదాపు వందకు పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన బాలకృష్ణను ‘డాకూ మహారాజ్‌’ సరికొత్తగా చూపిస్తుంది’’ అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. గూస్‌బంప్స్‌ వచ్చాయి. కచ్చితంగా ప్రేక్షకులంతా గొప్ప సినిమాను చూసిన అనుభూతి పొందుతారు.


భావోద్వేగాలు, వినోదం, యాక్షన్‌ అన్నీ అదిరిపోయే రేంజ్‌లో ఉన్న సినిమా ఇది. తమన్‌ నెక్స్ట్‌ లెవల్‌ సంగీతం ఇచ్చారు. 30 ఏళ్లుగా బాలకృష్ణను ఎవరూ చూపని విధంగా ఇందులో వింటేజ్‌ లుక్‌లో చూపిస్తున్నాం. నిర్మాతగా నా కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇప్పటికి అది కుదిరింది. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేస్తాం. జనవరి 8న యూఎస్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక చేసి ఓ సాంగ్‌ విడుదల చేస్తాం. అలాగే, జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 05:11 AM