వెంకటేశ్‌ నట విశ్వరూపం చూస్తారు

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:41 AM

‘జయాపజయాల గురించి పట్టించుకోను. ప్రయాణాన్ని మాత్రమే ఆస్వాదిస్తాను. నిజాయితీగా పనిచేస్తే విజయం అదే వస్తుంది’ అంటున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సైంథవ్‌’....

వెంకటేశ్‌ నట విశ్వరూపం చూస్తారు

‘జయాపజయాల గురించి పట్టించుకోను. ప్రయాణాన్ని మాత్రమే ఆస్వాదిస్తాను. నిజాయితీగా పనిచేస్తే విజయం అదే వస్తుంది’ అంటున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సైంథవ్‌’. వెంకట్‌ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శైలేష్‌ విలేకరులతో మాట్లాడారు.

  • ‘హిట్‌2’ త ర్వాత వెంకటేశ్‌గారిని కలిశాను. బాగా తీశావ్‌ అని అభినందించారు. మేం సినిమాల కంటే జనరల్‌ విషయాలే ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం. రెండుమూడు మీటింగ్స్‌లో మా ఇద్దరికీ మంచి బాండింగ్‌ ఏర్పడింది. సినిమా చేయాలనుకున్నాం. ‘సైంధవ్‌’ ఐడియా చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ‘నా 75వ సినిమా అంటే ఇలా ఉండాలి’ అంటూ సంబరపడిపోయారు. ఆ లైన్‌ డవలప్‌చేసి పూర్తి స్ర్కిప్ట్‌ వినిపించాను. కథ మొత్తం విని హగ్‌ చేసుకున్నారు. ‘ఇది చేస్తున్నాం’ అంటూ భుజం తట్టారు

  • ఎలాంటి టెన్షన్‌ లేకుండా సినిమాను పూర్తి చేశాను. దానికి కారణం వెంకటేశ్‌గారే. అయితే.. ప్రమోషన్స్‌లో వెంకటేశ్‌గారి ఏవీలు చూస్తుంటే.. ‘ఇంతటి అద్భుతమైన జర్నీ ఉన్న హీరోతో సినిమా చేశానా!?’ అని టెన్షన్‌ మొదలైంది. నా వరకూ దర్శకుడిగా పూర్తి సంతృప్తితో ఉన్నా. వెంకీ 75 మూవీ ఎలా ఉండాలో అలా చేశాం. ఇందులో వెంకటేశ్‌ విశ్వరూపం చూస్తారు.

  • వెంకటేశ్‌గారు ఎమోషనల్‌గా చేసిన ప్రతి సినిమా హిట్టే. శత్రువు, ధర్మచక్రం, గణేశ్‌, తులసి.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఈ సినిమా వాటిని మించేలా ఉంటుంది. ఇంత ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న కథ చేయడం నాకిదే ప్రథమం. ఇందులో వెంకటేశ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ ప్రేక్షకులకు గూజ్‌బమ్స్‌ తెప్పిస్తుంది. హృదయాలను ద్రవింపజేసే భావోద్వేగపూరిత సన్నివేశాలు ఉన్నాయి ఇందులో.

  • స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతుకలేదు. 17కోట్ల ఇంజక్షన్‌ కోసం తపన పడే పేరెంట్స్‌ గురించి, వారి పోరాటం గురించి మనకి పెద్దగా అవగాహనలేదు. సమాజంలో ఈ విషయంపై అవగాహన పెంచాలంటే విస్తృతంగా కమ్యునికేట్‌చేసే నటులు కావాలి. వెంకటేశ్‌గారితోపాటు ఆండ్రియా, రుహానీ శర్మ లాంటి నటులు ఇందులో భాగమవ్వడానికి కారణం అదే. ఒక పవిత్రభావనతో తయారు చేసుకున్న కథ ఇది. అందుకే అందరికీ కనెక్ట్‌ అవుతుందని నమ్ముతున్నాను.

  • ఇందులో నవాజుద్దీన్‌ సిద్దిఖీ పాత్ర యూనిక్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన కూడా ఈ తరహా పాత్ర చేయలేదు. డబ్బింగ్‌ సమస్య కారణంగా ఆయన దక్షిణాది సినిమాలు చేయడానికి ఇన్నాళ్లూ ఆసక్తి చూపలేదు. ఇందులో వచ్చీరాని తెలుగులో మాట్లాడే పాత్రని రాసుకున్నాను. ఆ పాత్రకు ఆయనతో డబ్బింగ్‌ చెప్పించడమే కరెక్ట్‌. అది ఆయనకి నచ్చింది. దాంతో చేయడానికి ఒప్పుకున్నారు. శద్ధగా డబ్బింగ్‌ చెప్పారు.

  • సినిమా చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. కథకోసం వైజాగ్‌ సముద్రతీరంగా ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్‌ టౌన్‌ని క్రియేట్‌ చేశాం. నిర్మాత ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అందుకే సినిమా ఇంతబాగా వచ్చింది. పార్ట్‌2కు అవకాశం ఉన్న కథ ఇది. ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా పార్ట్‌2 ఉంటుంది. ఇక నా ‘హిట్‌3’ రైటింగ్‌ దశలో ఉంది. అది రావడానికి ఏడాదిన్నర పట్టొచ్చు.

Updated Date - Jan 10 , 2024 | 03:41 AM