రామాయణానికి త్రివిక్రమ్‌ మాట సాయం?

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:12 AM

రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ చిత్రం మంగళవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాత...

రామాయణానికి త్రివిక్రమ్‌ మాట సాయం?

రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ చిత్రం మంగళవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాత. మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. ‘రామాయణం’ తెలుగు వెర్షన్‌కు సంభాషణలు అందించే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించారనేది మూడేళ్ల క్రితమే వినిపించిన మాట. షూటింగ్‌ మొదలవడంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది. కొద్ది మాటల్లో అనంతమైన భావాన్ని పొందికగా చెప్పగల చాతుర్యం త్రివిక్రమ్‌ సొంతం. రామాయణం లాంటి పౌరాణిక చిత్రానికి ఆయన అందించే సంభాషణలు సినిమా స్థాయిని మరింత పెంచుతాయని మేకర్స్‌ భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’ చిత్రం చేశాక త్రివిక్రమ్‌ ఇప్పటివరకూ తన కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించలేదు. కాబట్టి త్రివిక్రమ్‌ కూడా దీనికి అంగీకరించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే త్రివిక్రమ్‌ డైలాగ్‌ వెర్షన్‌ పూర్తిచేసి ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఆ రోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పదికాలాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేవిధంగా తెరకెక్కించడానికి మేకర్స్‌ చాలా కసరత్తు చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Updated Date - Apr 04 , 2024 | 09:31 AM