టిల్లు మన మనిషి అయిపోయాడు

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:53 AM

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లుస్క్వేర్‌’ మార్చి 29న విడుదలై ఘనవిజయం అందుకుంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ సాధించిన...

టిల్లు మన మనిషి అయిపోయాడు

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లుస్క్వేర్‌’ మార్చి 29న విడుదలై ఘనవిజయం అందుకుంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ సాధించిన ‘టిల్లుస్క్వేర్‌’ సక్సెస్‌ మీట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘సిద్ధూకి సినిమా తప్ప వేరే ఏమీ తెలియదు. నిరంతరం వర్క్‌ గురించే ఆలోచిస్తుంటారు. ఈ సినిమాతో సిద్ధు కేవలం విజయాన్ని అందుకోవడమే కాకుండా మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక పాత్రను ఇచ్చారు. ఈ రోజు టిల్లు... మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. నేనింక నవ్వలేను బాబోయ్‌ అనేంతలా సిద్ధూ నవ్వించారు’’ అని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘టిల్లు స్క్వేర్‌’ మాత్రమే కాదు, రాధిక స్క్వేర్‌ కూడా. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశాను. అందుకే ఈ రేంజ్‌ సక్సెస్‌ వారికి దక్కింది’’ అని అన్నారు. కథానాయకుడు విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం సిద్ధు ఎంతగా ఎఫొర్ట్‌ పెట్టారో నాకు తెలుసు. టిల్లు పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని తెలిపారు. చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను చెప్పిన డైలాగ్‌ తారక్‌ అన్న నోటి నుంచి రావడం కంటే పెద్ద అవార్డ్‌ ఇంకోటి ఉండదు’’ అని చెప్పారు. దర్శకుడు రామ్‌ మల్లిక్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజయంలో చిత్ర బృందం సమష్టి కృషి ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు.

Updated Date - Apr 10 , 2024 | 01:53 AM