థౌజండ్‌ వాలా టపాసులు

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:59 AM

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హిట్‌ అనిపించుకుంటే సరిపోదు.. కలెక్షన్లలో సునామీ సృష్టించి.. నిర్మాతలకు లాభాల పంట పండించాల్సిందే. వసూళ్ల పరంగా ఒకప్పుడు రూ.వంద కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే అద్భుతమనిపించేది...

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హిట్‌ అనిపించుకుంటే సరిపోదు.. కలెక్షన్లలో సునామీ సృష్టించి.. నిర్మాతలకు లాభాల పంట పండించాల్సిందే. వసూళ్ల పరంగా ఒకప్పుడు రూ.వంద కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే అద్భుతమనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పెరిగిన టికెట్‌ రేట్ల కారణంగా కలెక్షన్ల లెక్కలు మారిపోయాయి. రూ.వంద కోట్లు .. రూ.రెండు వందల కోట్లు.. రూ.మూడు వందల కోట్లు.. రూ..నాలుగు వందల కోట్లు.. రూ.ఐదొందల కోట్లు... ఇదీ లెక్క ఇప్పుడు. అలా పెరుగుతూ వచ్చిన కలెక్షన్ల లెక్కలకు తాజా టార్గెట్‌ రూ. వెయ్యి కోట్లు. తాజాగా ‘కల్కి’ చిత్రం రూ. వెయ్యి కోట్ల రికార్డును సాధించడంతో తెలుగు సినిమా సత్తా మరోసారి చాటిచెప్పినట్లయింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు రూ. వెయ్యికోట్లు వసూలు చేసిన చిత్రాల సంఖ్య ఏడైతే వాటిలో మూడు సినిమాలు మనవే కావడం గర్వంతో కాలర్‌ ఎగరెయ్యాల్సిన అంశమే.


‘యుద్ధం.. యుద్ధం’ అంటూ బరిలోకి దిగి బాక్సాఫీస్‌ను షేక్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌. ఆయన నటించిన ‘దంగల్‌’ చిత్రం 2016లో రిలీజై.. అప్పటివరకూ ఉన్న సినిమా రికార్డులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గ్లోబల్‌ బాక్సాఫీస్‌ దగ్గర రూ.2వేలపై చిలుకు కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా మల్లయోధుడు మహావీర్‌సింగ్‌ ఫోగట్‌, ఆయన కుమార్తెల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

కలెక్షన్లలో ‘మాహిష్మతీ సామ్రాజ్య’ విజృంభన

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా వచ్చిందే ‘బాహుబలి 2’. 2017లో రిలీజైన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ హద్దులు దాటి ప్రపంచవ్యాప్త హిట్‌గా నిలిచి.. అసలు సిసలు పాన్‌ ఇండియా సినిమా సక్సెస్‌ అంటే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపించింది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1810 కోట్లు కలెక్షన్ల మార్క్‌ అందుకుంది.


‘అసలు సిసలు మల్టీస్టారర్‌’

దర్శకధీరుడు రాజమౌళి రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేసిన మ్యాజికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ కల్పిత పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలోని పోరాటఘట్టాలు.. పాటలు చూసి పరదేశీయులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి సినిమాలకు గ్లోబల్‌ క్రేజ్‌ పీక్స్‌కు చేరింది. ఇందులోని ‘నాటు నాటు ’ పాటకు ఆస్కార్‌ వరించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌, రూసో బ్రదర్స్‌ ప్రశంసలు పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్లు వసూళ్లు చేసింది.

‘రాకీ భాయ్‌’ మానియా

యష్‌ నటించిన ‘కేజీఎఫ్‌’తో కన్నడ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూసేలా చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌ 2’తో కన్నడ సినిమా స్థాయి గ్లోబల్‌ రేంజ్‌కు ఎదిగింది. యాక్షన్‌ ప్రియులకు అత్యంత చేరువైన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లను కలెక్ట్‌ చేసింది.


‘వింటేజ్‌ కింగ్‌ ఖాన్‌’ ప్రభంజనం

వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుక్‌ ఖాన్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి ఎక్కించిన చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.వెయ్యి కోట్లు పైచిలుకు కలెక్షన్లను రాబట్టింది. ఇందులో రా ఏజెంట్‌గా షారుక్‌, ఐఎస్‌ఐ ఏజెంట్‌ పాత్రలో నటించిన జాన్‌ అబ్రహమ్‌తో చేసిన పోరాటాలు సినిమాకే స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాయి.

‘జవాన్‌’ మ్యాజిక్‌

తమిళ దర్శకుడు అట్లీతో షారుక్‌ ఖాన్‌ చేసిన సినిమా ‘జవాన్‌’. సమాజాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడడానికి తండ్రిగా.. కొడుకుగా షారుక్‌ ఇందులో డ్యూయెల్‌ రోల్‌ పోషించారు. అత్యద్భుత పోరాట ఘట్టాలతో అందరినీ కట్టిపడేసిన ఈ చిత్రం దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.


‘కల్కి’ హవా

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘కల్కి 2898 ఏ.డీ’. జూన్‌లో విడుదలైన ఈ సినిమాలో పురాణాల్ని, సైన్స్‌ ఫిక్షన్‌ను మిళితం చేసి దర్శకుడు అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఇందులో అమితాబ్‌, ప్రభాస్‌ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు.. కాంప్లెక్స్‌, కాశీ, శంభల ప్రాంతాల విజువల్స్‌.. పతాక సన్నివేశాల్లో ప్రభాస్‌ కర్ణుడిగా కనిపించే దృశ్యం సినిమా విజయాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. రిలీజైన 15 రోజులకే రూ.1000 కోట్ల కలెక్షన్లను అందుకుని.. మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది.

Updated Date - Jul 16 , 2024 | 04:59 AM