Mahesh babu : ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:43 AM

‘‘నాకూ, నాన్నగారికీ సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. సంక్రాంతికి విడుదలైన మా సినిమాలు బ్లాక్‌బస్టర్లయ్యాయి. ఈ సారి కూడా బాగా గట్టిగా కొడతాం. కానీ ఈ సారి ‘గుంటూరు కారం’ చిత్రం రికార్డులు, వసూళ్ల గురించి...

Mahesh babu : ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం

‘‘నాకూ, నాన్నగారికీ సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. సంక్రాంతికి విడుదలైన మా సినిమాలు బ్లాక్‌బస్టర్లయ్యాయి. ఈ సారి కూడా బాగా గట్టిగా కొడతాం. కానీ ఈ సారి ‘గుంటూరు కారం’ చిత్రం రికార్డులు, వసూళ్ల గురించి మాట్లాడడానికి నాన్న మన మధ్య లేరనే వెలితి ఉంది. ఆ లోటును ఇక మీరే (అభిమానులు) తీర్చాలి. ఇకపై నాకు అమ్మా, నాన్నా... అన్నీ మీరే’ అని మహేశ్‌బాబు భావోద్వేగంతో స్పందించారు. ఆయన హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈనెల 12న విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం గుంటూరులో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌ అంటే నాకు చాలా ఇష్టం. గత రెండేళ్లు ఆయన నాకు అండగా నిలిచిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన సినిమాల్లో చేసేటప్పుడు నా నటనలో ఏదో మ్యాజిక్‌ జరుగుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తరహాలో ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ అదే మ్యాజిక్‌ జరిగింది. ఇందులో మీరు కొత్త మహేశ్‌బాబును చూడబోతున్నారు. దానికి కారణం త్రివిక్రమే. మా నిర్మాత చినబాబు ఇష్టపడే హీరోని నేనే. వారితో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి శ్రీలీల పెద్ద హీరోయిన్‌ కావడం గొప్ప విషయం. ఆ అమ్మాయితో డాన్స్‌ చేయాలంటే హీరోలందరికీ తాట ఊడిపోద్ది. థమన్‌ బెస్ట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు’ అని తెలిపారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘ఒక సినిమాకు వంద శాతం పనిచేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేశ్‌బాబే. పాతికేళ్లయింది అంటున్నారు కానీ ఆయన్ను చూస్తుంటే నిన్నో, మొన్నో సినిమాల్లోకి వచ్చిన హీరోలానే ఉన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణగారు గొప్ప నటుడు. ఆయన నటించిన ఒక సినిమాకు సహాయ రచయితగా పనిచేశాను. అంత గొప్ప మనిషికి కొడుకుగా పుట్టిన మహేశ్‌బాబు ఎంత అదృష్టవంతుడో కదా అనిపిస్తుంది. ‘అతడు, ఖలేజా’ సినిమాలకు పనిచేసినప్పుడు మహేశ్‌ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నటనలోనూ అదే స్పీడ్‌ చూపిస్తున్నారు. షూటింగ్‌ తర్వాత బాగా అలసిపోయి కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి గుంటూరు వచ్చారు. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతిని ఈసారి రమణగాడితో కలసి చేసుకుందాం’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ ‘నాకు ఈ సినిమా మళ్లీ రీ లాంచ్‌లా అనిపిస్తోంది. మహేశ్‌బాబు బంగారపు విగ్రహానికి ప్రాణం పోసినట్లు ఉంటారు. ఆయన మనసు కూడా అంతే అందమైనది’ అని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘మేకర్స్‌గా చినబాబు, వంశీ ప్రయాణం అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్‌ ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు. మహేశ్‌బాబు మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఇస్తున్నారు’ అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘త్రివిక్రమ్‌తో పనిచేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది. ఆయనను అందరూ గురూజీ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థమవుతోంది. మహేశ్‌బాబు గారి సినిమాలో చేయాలని అడిగినప్పుడు షాక్‌ తిన్నాను. ఆయనతో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది మహేశ్‌గారి మాస్‌ ఫిల్మ్‌’ అని అన్నారు.

రేకుల షెడ్డు కూలి అభిమానులకు గాయాలు

గుంటూరు జిల్లాలోని పెదకాకాని సమీపంలో మహేష్‌ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ లో మంగళవారం రాత్రి అపశృతి చోటుచేసుకుంది. అంచనాలకు మించి భారీగా మహేష్‌ బాబు అభిమానులు రావడంతో, సభ ప్రాంగణం మొత్తం కనుచూపు మేర జనసంద్రంగా మారిపోయింది. దీంతో ప్రాంగణం కుడి వైపున వాచ్‌మెన్‌ కోసం నిర్మించిన రేకుల షెడ్డుపైకి పెద్ద ఎత్తున అభిమానులు ఎక్కారు. మహేష్‌ బాబును చూేసందుకు యువత ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో కొందరిని విజయవాడ, గుంటూరు అస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

పెదకాకాని

Updated Date - Jan 10 , 2024 | 03:43 AM