పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:29 AM

‘అల్లరి’ నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న మల్లి అంకం సోమవారం...

పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది

‘అల్లరి’ నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న మల్లి అంకం సోమవారం మీడియా సమావేశంలో చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • మా కథకు యాప్ట్‌ టైటిల్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. నరేశ్‌ సూచనతో ఆ టైటిల్‌ పెట్టాం. ఈ టైటిల్‌తో వచ్చిన పాత సినిమాకూ మా సినిమాకూ పోలిక లేదు. పెళ్లి చుట్టూ తిరిగే కథాంశం ఇది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌ ఉంది. వినోదాత్మకంగా చెప్పాం.


  • ఈ కథతో నరేశ్‌ను కలిశాను. అప్పటికే ఆయన నాలుగు సినిమాలు కమిట్‌ అయ్యారు. కామెడీ కథ అనగానే మొదట అంత ఉత్సాహం చూపించలేదు. అయితే ఆయన్ని నేను కన్విన్స్‌ చేసి కథ చెప్పాను. ఫస్ట్‌ హాఫ్‌ వినగానే షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ‘ఈ సినిమా చేస్తాం’ అన్నారు. తను అంగీకరించిన నాలుగు సినిమాల్లో రెండింటిని వెనక్కి నెట్టి మా సినిమాను ముందుకు తెచ్చారు. ఇందులో కామెడీతో పాటు మంచి ఎమోషన్‌ కూడా ఉంది.

  • హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా పాత్ర కీలకంగా ఉంటుంది. కథ ఆమె పాత్ర ద్వారానే మలుపు తిరుగుతుంది. ఫరియాలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. అది ఈ సినిమాకు హెల్ప్‌ అయింది.

  • నా ఫ్రెండ్స్‌లో కొంతమందికి పెళ్లి కాలేదు. ఓ ఫంక్షన్‌కు వారంతా వచ్చినప్పుడు వేదికపైకి రమన్నా రాలేదు. అందరూ పెళ్లి గురించి అడుగుతారు కనుక , వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వేదికపైకి రాకుండా కిందే ఉండిపోయారు. వాళ్ల పెయిన్‌ నాకు అర్థమైంది. అలాగే మ్యాట్రిమోనికి సంబంధించిన కొన్ని సంఘటనలు, పేపర్లలో వచ్చిన వార్తలు చదివి స్ఫూర్తి పొంది ఈ కథ తయారు చేశాను.

  • జామీ లివర్‌ ఇందులో నరేశ్‌ తమ్ముడి భార్య పాత్ర పోషించారు. ఆ పాత్ర హిలేరియస్‌గా ఉంటుంది. బాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌ జానీ లివర్‌ అమ్మాయి ఆమె. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. సినిమాలోని పాత్రలన్నీ వినోదభరితంగా ఉంటాయి.

  • ఫ నిర్మాత రాజీవ్‌ చిలకతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘ఛోటా భీమ్‌’కు సంబంధించి ప్రమోషన్స్‌ నేనే చూసేవాడిని. ఆయనకు సినిమా తీయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. నేను చెప్పిన కథ నచ్చి, కావాల్సిన బడ్జెట్‌ సమకూర్చారు.

Updated Date - Apr 30 , 2024 | 06:29 AM