ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్‌ ఉన్న చిత్రం

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:15 AM

‘బిగ్‌ బాస్‌’ ఫేం అర్జున్‌ అంబటి హీరోగా, కిశోరి ధాత్రిక్‌ హీరోయిన్‌గా నటించిన ‘తెప్ప సముద్రం’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. సతీశ్‌ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మాత...

ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్‌ ఉన్న చిత్రం

‘బిగ్‌ బాస్‌’ ఫేం అర్జున్‌ అంబటి హీరోగా, కిశోరి ధాత్రిక్‌ హీరోయిన్‌గా నటించిన ‘తెప్ప సముద్రం’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. సతీశ్‌ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మాత. ఆదివారం రాత్రి ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో శాసన సభ్యుడు పైడి రాకేశ్‌ రెడ్డి సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాఘవేంద్ర గౌడ్‌ మాట్లాడుతూ ‘ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎందరో కష్టపడాలి. నేను చిరంజీవిగారి అభిమానిని. ఆయన స్ఫూర్తితోనే పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది.’ అన్నారు. అర్జున్‌ అంబటి మాట్లాడుతూ ‘చిన్న సినిమా అనగానే నిర్మాతకు, దర్శకుడికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మా నాన్న, పెద నాన్న డిస్ట్రిబ్యూటర్స్‌ కాబట్టి ఆ వేదన నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా. ఈ సినిమా 90 శాతం షూటింగ్‌ పోచంపల్లిలో జరిగింది’ అని చెప్పారు. ‘తెప్ప సముద్రంలో చిన్న పిల్లల మీద జరిగే ఆఘాయిత్యాలే కాకుండా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అవి థియేటర్‌లో చూస్తేనే బాగుంటుంది. ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్‌ ఉన్న చిత్రం’ అని దర్శకుడు సతీశ్‌ చెప్పారు.

Updated Date - Apr 16 , 2024 | 03:15 AM