ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ కాదు

ABN , Publish Date - May 30 , 2024 | 12:13 AM

సూపర్‌ హిట్‌ పాటల రచయితగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణచైతన్య దర్శకుడిగా మారి ‘రౌఢీ ఫెలో’, ‘చల్‌ మోహన రంగా’ చిత్రాలను తెరకెక్కించారు....

ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ కాదు

సూపర్‌ హిట్‌ పాటల రచయితగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణచైతన్య దర్శకుడిగా మారి ‘రౌఢీ ఫెలో’, ‘చల్‌ మోహన రంగా’ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


‘‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కథ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద మరింత బాగా హృదయానికి హత్తుకునేలా పండాయి. ఇందులోని చివరి 20 నిమిషాలు చాలా కీలకం. ఇది ఒక ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌. అందరూ అనుకున్నట్లు ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ కాదు. ఈ సినిమా అంతా నాలుగు గ్యాంగ్స్‌ చుట్టూ జరుగుతుంది. మహాభారతంలోని ‘నా అనేవాడే నీ మొదటి శత్రువు’ అనే వాక్యమే ఈ సినిమా కథకు స్ఫూర్తి. విష్వక్‌ ఈ సినిమా కోసం గోదావరి మాండలికాన్ని చక్కగా పలికించారు. ఆయన నేను ఊహించినదాని కంటే మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. యువన్‌ శంకర్‌రాజా అందించిన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది’’ అని చెప్పారు.

Updated Date - May 30 , 2024 | 12:13 AM