ఇది సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన విజయం

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:31 AM

‘నా సినీ జీవితంలో 200కు పైగా సినిమాలు చేశాను. అయితే వాటిలో అన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ఉండకపోవచ్చు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ విజయాన్ని మాత్రం కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. సినిమా విడుదలైనప్పటి నుంచి నాకు ప్రశంసలు...

‘నా సినీ జీవితంలో 200కు పైగా సినిమాలు చేశాను. అయితే వాటిలో అన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ఉండకపోవచ్చు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ విజయాన్ని మాత్రం కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. సినిమా విడుదలైనప్పటి నుంచి నాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి’ అని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీసు దగ్గర సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు రూ. వెయ్యికోట్ల వసూళ్లను అధిగమించిన సందర్భంగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన కమల్‌హాసన్‌ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ‘‘కల్కి చిత్రానికి వసూళ్ల పరంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో యాస్కీన్‌ పాత్ర కోసం చాలా కసరత్తు జరిగింది. చాలా కష్టపడ్డాం. మేకప్‌ కోసం లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లాం. మొదట్లో నా గెటప్‌ చూసి నాకే ఎబ్బెట్టుగా అనిపించినా, క్రమంగా ఉత్సాహం కలిగింది.


రెండో భాగంలో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలోని దిగ్గజాలు అంతా ఈ చిత్రంలో కలసి నటించారు. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావులా ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ కూడా ప్రేక్షకులను మాయ చేశారు. చిన్నపిల్లలు ఆటలో లీనమైపోయినట్లు పాత్రధారులందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత సంతోషిస్తే మేము అంతగా సంతోషిస్తాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 06:31 AM